‘విజిల్’ మూవీ రివ్యూ

0
1354

వరుస విజయాలతో తిరుగులేని ఫామ్ లో ఉన్న హీరో విజయ్ మెర్సల్, సర్కార్ లాంటి భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. తేరి, మెర్సల్ తర్వాత మరోసారి అట్లీ తో జతకట్టి ‘విజిల్’ అనే స్పోర్ట్స్ డ్రామాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఆల్రెడీ హిట్ పెయిర్ అవడం, దానికి తోడు విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తుండటం తో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాల్ని విజిల్ అందుకుందా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం.

మైఖేల్‌ రాజప్ప (విజయ్‌) స్థానికంగా మంచి రౌడీ. తన మురికివాడలోని ప్రజలను ప్రత్యర్థుల నుంచి కాపాడుకుంటూ ఉంటాడు. స్థానికంగా మంత్రి కాలేజీ మూయించాలని చూస్తే దానిని అడ్డుకుంటాడు. ఈ క్రమంలో అమ్మాయిల ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్‌ అయిన మైఖేల్‌ స్నేహితుడు కిరణ్‌ తన టీమ్‌ను తీసుకొని అతను ఉండే చోటుకి వస్తాడు. కిరణ్‌తో కలిసి కారులో వెళుతుండగా ప్రత్యర్థులు మైఖేల్‌పై అటాక్‌ చేస్తారు. ఈ దాడిలో మైఖేల్‌ రౌడీలను చితగ్గొట్టినప్పటికీ.. అతని విరోధి మాత్రం కిరణ్‌ను గొంతులో కత్తితో పొడుస్తాడు.  దీంతో చికిత్స పొందుతూ, బెడ్‌కు పరిమితమైన కిరణ్‌.. తనస్థానంలో మైఖేల్‌ను అమ్మాయిల టీమ్‌కు కోచ్‌గా వెళ్లమని కోరుతాడు. ప్లాష్‌బ్యాక్‌లో బిగిల్‌గా పేరొందిన మైఖేల్‌ గొప్ప ఫుట్‌బాల్‌ ఆటగాడు. అతని తండ్రి రాజప్ప (విజయ్‌) స్థానికంగా పేరుమోసిన రౌడీ. అయినా తన కొడుకు కత్తి పట్టకుండా ఆటలతో పైకి రావాలని కోరుకుంటాడు. ఈక్రమంలో అతను, అతని స్నేహితులు కలిసి నేషనల్‌ గేమ్స్‌ ఆడేందుకు వెళ్తుండగా రైల్వే స్టేషన్‌లో ప్రత్యర్థులు అటాక్‌ చేసి.. మైఖేల్‌ కళ్లముందే రాజప్పను చంపేస్తారు. దీంతో జాతీయ కప్‌ కొట్టాలన్న తన తండ్రి కల రైల్వే స్టేషన్‌లో ఆగిపోతుం‍ది. పుట్‌బాల్‌ ప్లేయర్‌ కావాలనుకున్న మైఖేల్‌ తండ్రి స్థానంలోకి రౌడీగా మారిపోతాడు. ఈ క్రమంలో కిరణ్‌ కోరిక మేరకు అమ్మాయిల జట్టుకు కోచ్‌గా మారిన మైఖేల్‌.. బిగిల్‌ కప్పు ముఖ్యంరా అన్న తండ్రి కలను నెరవేర్చాడా? కోచ్‌గా ఎలా నిలదొక్కుకు‍న్నాడు? నేషనల్‌ గేమ్స్‌లో అతనికి ఎదురైన అవాంతరాలు ఏమిటి? అమ్మాయిలు సమాజంలోని ప్రతికూలతలను ఎదుర్కొని ఎలా పోరాడారు? అన్నదే కథ.

హీరో విజ‌య్ రాజ‌ప్ప‌, మైకేల్ అనే రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్స్‌ను చూపిస్తూ న‌టించాడు. రాజ‌ప్ప పాత్ర అభిమానులను ఆక‌ట్టుకునేలా మాస్‌గా ఉంటే.. మైకేల్ పాత్ర తండ్రి ఆశ‌యాల కోసం పాటుప‌డే ఓ ఇన్‌స్పిరేష‌న‌ల్‌గా సాగుతుంది. ఇక న‌య‌న‌తార త‌న పాత్ర ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించింది. జాకీష్రాఫ్ స్టైలిష్ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు. సెకండాఫ్ అంతా ఫుట్‌బాల్ గేమ్ మీదే సాగుతుంది. ఫుట్‌బాల్ టీమ్‌గా యాక్ట్ చేసిన వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ఇందుజ‌, రెబా మోనిక‌, అమృత ఎవరికివారు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.

విజిల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప‌క్కా మాస్ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. తొలి పార్ట్‌లో 30 నిమిషాలు కేవ‌లం విజ‌య్ అభిమానుల కోస‌మే సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు, ప‌క్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫ‌స్టాఫ్ అంతా హీరో, హీరోయిజం, అత‌ని చుట్టూ సాగే క‌థ‌, హీరో తండ్రి త‌న‌లా త‌న బ‌స్తీ పిల్లలు కాకుండా గొప్ప‌గా ఎద‌గాల‌నుకోవ‌డం అనే అంశాల చుట్టూనే క‌థ న‌డుస్తుంది. ఇక సెకండాఫ్ అంతా లేడీ టీమ్ ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను దాటి గెలుపు సాధించింద‌నే దానిపై సాగుతుంది. సినిమాలో గొప్ప ట్విస్టులు ట‌ర్న్‌లు ఉండ‌వు. కానీ స‌న్నివేశాల‌ను ఎంగేజింగ్‌గా, హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ తెర‌కెక్కించ‌డంలో అట్లీ స‌క్సెస్ సాధించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ ను తెరకెక్కించిన విధానం చాలా బావుంది. పోలీస్ స్టేషన్ లో టైమ్ లిమిట్ పెట్టె సీన్ ని, తర్వాత గ్రౌండ్ లో ఫుట్ బాల్ చూపించే సీన్ కి సింక్ చేయడం, ప్రాక్టీస్ టైమ్ లో కోచ్ నేర్పించిన గేమ్ ని క్లైమాక్స్ లో దాన్ని ఫ్లాష్ కట్ లో చూపించడం, రైల్వే స్టేషన్ లో తన తండ్రిని కత్తితో పొడవడం చుసిన బిగిల్ ట్రైన్ దిగేటప్పుడు, తనతో పాటు ఫుట్ బాల్ కూడా కింద పడటం.. అంటే తాను మిస్ అవుతుంది ట్రైన్ ని  మాత్రమే కాదు.. తన గేమ్ ని కూడా అని ఒక చిన్న బాల్ తో చాలా అర్ధవంతంగా చెప్పాడు అట్లీ.  అలాగే ఆసిడ్ విక్టిమ్ ని మళ్ళీ తిరిగి గేమ్ లోకి తీసుకురావాలని విజయ్ తనకి చెప్పే ఇన్స్పైరింగ్ స్టోరీ, ఒక అగ్రహారం ఇల్లాలిని గేమ్ లోకి పంపించామని నయనతార తో చెప్పించే సన్నివేశాలు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. శ్రీ రామ‌కృష్ణ రాసిన డైలాగ్స్ సెకండాఫ్‌లో ముఖ్యంగా ఆక‌ట్టుకున్నాయి.విష్ణు కెమెరా ప‌నితనం బావుంది. ముఖ్యంగా ఫుట్‌బాల్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన తీరు బావుంది.  ఉన్న పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం సన్నివేశాల్ని ఎలివేట్ చేసేలా ఉంది.  ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
విజయ్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:
రన్ టైమ్
ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్

పంచ్ లైన్: విజిల్ వేయాల్సిందే
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3.25/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here