”తిప్పరా మీసం” మూవీ రివ్యూ

0
1417

అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి  సినిమాలతో ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకున్న శ్రీవిష్ణు ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత ఇప్పుడు ‘తిప్పరా మీసం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీవిష్ణు డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

మణిశంకర్‌ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయి దాటిపోతుందేమోనని, అతడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి  ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతను.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏది ఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది మిగతా కథ.

శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా.. కొన్ని సీన్స్ లో, మదర్‌ సెంటిమెంట్‌ సీన్లలో శ్రీవిష్ణు అదరగొట్టాడు. హీరోయిన్‌ నిక్కీ తంబోలీ పాత్ర అప్పుడప్పుడే కనిపించి వెళ్తుంది. కథలో భాగంగా నిక్కీ ఎస్సై పాత్రను పోషించిప్పటికీ పెద్దగా ఆకట్టుకునే సీన్లు లేవు. సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ, ఇతన నటులు తమ పరిధి మేరకు పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

తల్లీకొడుకుల బంధం బేసిక్‌ హ్యూమన్‌ రిలేషన్‌. అలాంటి కనీస మానవీయ బంధాన్ని కోర్టుకీడ్చిన కొడుకు..  చివరకు మంచి మనిషిగా ఎలా మారిపోయాడనే కథ బాగానే ఉన్నా.. దర్శకుడు స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు. సినిమా ఫస్టాఫ్‌ అంతా ఫ్లాట్‌గా సాగుతూ.. పెద్దగా ఆసక్తి రేకెత్తించదు. మణి క్యారెక్టర్‌ను ఎస్టాబ్లిష్‌ చేయడానికి డైరెక్టర్‌ దాదాపు ఫస్టాఫ్‌ అంతా సాగదీస్తున్నట్టు  అనిపిస్తుంది. చాలా చోట్ల మణి పాత్ర కూడా డైరెక్టర్‌ డల్‌గా డీల్‌ చేసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో ఫస్టాఫ్‌లో తల్లీని కోర్టుకీడ్చడం.. కొడుకు కోసం తల్లి ఇల్లు అమ్మి డబ్బులు వంటి సీన్లు కొంతమేరకు బాగుండి ప్రేక్షకుల కనెక్ట్‌ అయ్యే అవకాశముంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే సీన్లు పెద్దగా ఆసక్తికరంగా అనిపించవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సురేశ్‌ బొబ్బలి అందించిన పాటలు అంతగా గుర్తుండకపోయినా.., నేపథ్య సంగీతం బావుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లున్నాయి.

ప్లస్ పాయింట్స్:
శ్రీవిష్ణు నటన
మదర్ సెంటిమెంట్

మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే
సాగదీత

పంచ్ లైన్: మీసం తిప్పలేకపోయిన శ్రీవిష్ణు
ఫిల్మ్ జల్సా రేటింగ్:2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here