”సైరా నరసింహా రెడ్డి” మూవీ రివ్యూ..

0
1148

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మాములుగానే చాలా హైప్ ఉంటుంది. అలాంటిది ఈ సినిమా తన డ్రీమ్ అని స్వయంగా చిరునే చెప్పడం, ఆ సినిమా ని రామ్ చరణ్ నిర్మించడం తో సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటేశాయి. మరి ఇన్ని అంచనాల నడుమ ఇవాళ విడుదలైన ”సైరా నరసింహారెడ్డి” ఎలా ఉందనేది సమీక్ష లో చూద్దాం .

ఝాన్సీ లక్ష్మి భాయ్ స్వాతంత్రం కోసం పోరాటం మొదలు పెట్టింది నరసింహ రెడ్డి అని చెప్పడంతో సైరా కథ మొదలవుతుంది. మొదట్లో చాలా సేపు  వరకు పాత్రల పరిచయం కోసం వాడుకున్న తర్వాత మెల్లిగా కథ మొదలవుతుంది. పన్ను చెల్లించాలని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన షరతుకి తిరుగుబాటుగా మొదలై తర్వాత మెల్లి మెల్లిగా అది ఉద్యమంలా ఎలా మారింది? ఆంగ్లేయులపై నరసింహ రెడ్డి ఎలా తిరగబడ్డాడు అన్నదే మిగిలిన కథ.

సైరా అనేది తన పన్నెండేళ్ల కల అని చెప్పుకొస్తున్న చిరు ఈ సినిమా కోసం అలానే తయారయ్యారు. తెర మీద చూస్తున్నంత సేపు మనకి డాన్సులు ఇరగతీసే ‘మెగాస్టార్’ అస్సలు కనిపించడు, తన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి బాధలు పడుతున్నారో, తన హక్కులని ఎలా కాపాడుకోవాలో, దేశానికి స్వేచ్ఛ అందించాలనే కసి ఉన్న పోరాటయోధుడే కనిపిస్తాడు. నరసింహా రెడ్డి కి అన్ని విద్యాలతో పాటు, సంస్కారం నేర్పిన గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ ఇమిడిపోయారు. అవుకు రాజుగా సుదీప్ చేసిన పాత్ర గుర్తుండిపోతుంది. ఒకవైపు నరసింహా రెడ్డి అంటే నచ్చని వ్యక్తిగా ఉంటూనే మరోవైపు బ్రిటిష్ వారిపై నరసింహారెడ్డి చేస్తున్న ఉద్యమానికి సహకరించే పాత్రలో బాగా చేసాడు. వీరా రెడ్డి గా జగపతిబాబు మరోసారి మెప్పించాడు. పాండిరాజ్ గా విజయ్ సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. బసిరెడ్డి గా రవికిషన్ నెగటివ్ రోల్ లో కనిపించాడు. ఝాన్సీ లక్ష్మి భాయి గా అనుష్క ఆకట్టుకుంది.  ఇక నయనతార గురించి ప్రత్యేకం గా చెప్పేదేముంది.. సిద్ధమ్మగా చాలా హుందాగా కనిపించింది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో నయనతార తన మార్క్ చూపించింది. లక్ష్మి పాత్రలో తమన్నా కి కెరీర్ బెస్ట్ రోల్ దక్కింది. ఆ పాత్రకి తమన్నా పూర్తి న్యాయం చేసింది. నరసింహా రెడ్డి తల్లి పాత్ర కూడా మెప్పిస్తుంది.నిహారిక, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, మిగిలిన వారు కూడా వారి వారి పాత్రల పరిధిలో బాగా చేసారు.

సైరా సినిమా తెరకెక్కించడం కోసం దర్శకుడు ఎందుకు ఇంత టైమ్ తీసుకున్నాడు అనేది సినిమా చూసాక ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఒక చరిత్ర ని తన సినిమా కి కథగా తీసుకుని, సినిమా తీయడమంటే ఏమంత ఆషామాషీ విషయం కాదు. దానికి తోడు చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరో తో ఆ కథ అంటే ఆ దర్శకుడికి అది కత్తి మీద సాము లాంటిదే. ఈ సినిమా కోసం సురేందర్ రెడ్డి పడిన శ్రమ, తాపత్రయం అన్నీ తెర మీద స్పష్టంగా కనిపిస్తాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన కథకి తాను జోడించిన స్క్రీన్ ప్లే, రాసుకున్న సీన్ లు కలిపి సైరా ని ఒక విజువల్ వండర్ గా మార్చాయి. ప్రేక్షకులు చిరంజీవి నుంచి ఏం ఆశిస్తారో తెలుసుకుని వాటికి అనుగుణంగా కథని మార్చుకుని, అలాగని అసలు కథని మార్చకుండా చాలా కష్టమే పడ్డాడు. ఆర్ట్ వర్క్ చాలా బావుంది. వెనుకటి రోజులని కళ్ళకి కట్టినట్లు అనిపిస్తుంది. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమా కి చాలా పెద్ద ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ ని చాలా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసి మంచి విజువల్స్ ని ఇచ్చాడు. అమిత్ త్రివేది, జూలియస్ సంగీతం బావుంది. రీరికార్డింగ్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసేలా ఉంది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అర్ధవంతంగా, ఆలోచించేవిగా చాలా బావున్నాయి. ఎడిటింగ్ కూడా బాగా కుదిరింది. ఫైనల్ గా నిర్మాత రామ్ చరణ్ గురించి.. తన తండ్రి కలని నెరవేర్చడానికి ఈ సినిమా ని నిర్మించడమే కాకుండా.., సినిమా ని, కథని నమ్మి ఎక్కడా ఖర్చుకి వెనుకాడకుండా చాలా ధైరం చేసి మంచి నిర్మాణ విలువలు పాటించాడు.

ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
దర్శకత్వం
టెక్నీషియన్స్ వర్క్

మైనస్ పాయింట్స్:
ప్రారంభ సన్నివేశాలు

పంచ్ లైన్: సాహో ‘సైరా’
ఫిల్మ్ జల్సా రేటింగ్ : 3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here