‘Oh! Baby’ Movie Review

0
879
నా కెరీర్ లో ఎంతో స్పెష‌ల్ సినిమాగా ఈ సినిమా నిల‌వ‌నుంద‌ని స‌మంత చెప్పిన ‘ఓ బేబి’ కొరియ‌న్ సినిమా మిస్ గ్రానీ కి రీమేక్. ఇప్ప‌టికే ఆరు భాష‌ల్లో రీమేక్ అయ్యి, అన్ని భాష‌ల్లో స‌క్సెస్ అయిన ఈ సినిమాకు ఇది ఏడో రీమేక్. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల వ‌య‌సుకు మారిపోయాక ఏం జ‌రిగింది? అన్న ఇంట్రెస్టింగ్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమా పోస్ట‌ర్, టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌తోనే ఆక‌ట్టుకుంది. ఈ సినిమా విజ‌యం మీద స‌మంత‌తో స‌హా ద‌ర్శ‌క‌నిర్మాత‌లంతా ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రి ఆ న‌మ్మకాన్ని ఓ బేబి నిల‌బెడుతుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.
సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) 70 ఏళ్ల వృద్ధురాలు. కొడుకు (రావూ రమేష్)తో కలిసి ఉండే సావిత్రి తన అతి ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. దీంతో మనస్తాపం చెందిన బేబి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అంతేకాదు తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు అని కోరుకుంటుంది. వెంటనే దేవుడు ఆమెకు యవ్వనాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారిన బేబీకి (సమంత)కి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆమె ప్రయాణం ఎలా సాగింది? చివరకు బేబీ తన అసలు వయస్సుకు వచ్చిందా.. లేదా..?అన్నదే మిగతా కథ.
స‌మంత న‌ట‌న ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్. ఓ బేబి టైటిల్ కి త‌గ్గట్టే సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై న‌డిపించింది. ల‌క్ష్మి ఎలాగైతే ఉందో అచ్చు అలాగే, తెర‌పై ఆమెనే చూస్తున్న‌ట్లు అంత బాగా న‌టించింది. ముఖంలో హావ‌భావాల ద‌గ్గ‌ర నుంచి… బాడీ లాంగ్వేజ్, న‌డ‌క వ‌ర‌కు అన్నీ ల‌క్ష్మి గారిలాగే ఉంటూ, ఇటు యూత్ ను ఆక‌ర్షించేలా చేయ‌డ‌మంటే అదేం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. కానీ స‌మంత దాన్ని చాలా ఎన‌ర్జిటిక్ గా, అల‌వోకగా చేసేసింది. ల‌క్ష్మి, రాజేంద్ర ప్ర‌సాద్, నాగ‌శౌర్య పాత్ర‌లు చ‌క్క‌గా పండాయి. ఆయా పాత్ర‌ల్లో ఎవ‌రికి వారు జీవించారు. ముఖ్యంగా లక్ష్మి- రాజేంద్ర ప్ర‌సాద్ జంట మ‌ధ్య కెమిస్ట్రీ వ‌ర్క‌వుటైంది. శౌర్య పాత్ర స‌మంత రూపంలో ఉన్న ల‌క్ష్మిని ప్రేమించ‌డం మూవీలో ఫ‌న్ ని పెంచింది. క్లైమాక్స్‌లో సమంత, రావు రమేష్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండె బరువెక్కిస్తాయి. బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

రెగ్యుల‌ర్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల మాదిరిగా కాకుండా మంచి ఫ‌న్ రైడ్ లా ఓ బేబి ని తెర‌కెక్కించింది ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి. ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే కామెడీ చాలా బావుంటుంది. ఫ‌స్టాఫ్ ను ఎంట‌ర్‌టైనింగ్ గా తెర‌కెక్కించిన నందినీ, సెకండాఫ్ లో ఎక్కువ‌గా ఎమోష‌న్స్ కు ప్రాధాన్య‌మిచ్చింది. ఎంట‌ర్‌టైన్ మెంట్ కొంచెం త‌గ్గ‌డం, దానికి తోడు ప్రేక్ష‌కుడు ఏం జ‌రుగుతుందో ముందే ఊహించేయ‌డంతో సెకండాఫ్ కాస్త సాగ‌దీసిన‌ట్ల‌నిపిస్తుంది. కాక‌పోతే మ‌ధ్య‌మ‌ధ్య‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేస్తాయి. సినిమా ఎప్పుడు అయిపోతుందా? ఎప్పుడెప్పుడు ఇంట్లో ఉన్న పెద్ద‌వాళ్ల‌ని క‌లుస్తామా అన్నంత ఫీల్ ను క‌లిగిస్తుంది సినిమా చూసి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌తి ప్రేక్ష‌కుడికి. ఒక సినిమాకు అంత‌కంటే పెద్ద అఛీవ్‌మెంట్ ఇంకేం కావాలి? సినిమాకు ల‌క్ష్మీ భూపాల్ అందించిన సంభాష‌ణ‌లు మ‌రో హైలైట్. ఒక ప‌క్క న‌వ్విస్తూనే.. మ‌రోప‌క్క ఆలోచింప చేసేలా ఉన్నాయి. సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ను చాలా క‌ల‌ర్‌ఫుల్ గా చూపించ‌డంలో సినిమాటోగ్ర‌ఫ‌ర్ స‌క్సెస్ అయ్యాడు. మిక్కీ జే మేయ‌ర్ ఈసారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. గుర్తుండిపోయే స్థాయిలో ఒక్కటంటే ఒక్క‌పాట కూడా లేక‌పోవ‌డం కాస్త నిరాశ‌ప‌డాల్సిన విష‌య‌మే. ఉన్నంత‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ఎడిటింగ్ బావుంది కానీ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కు క‌త్తెర ప‌డుంటే ఇంకాస్త మెరుగైన అవుట్‌పుట్ వ‌చ్చేది.

ప్ల‌స్ పాయింట్స్ః
స‌మంత న‌ట‌న‌
ఎమోష‌న‌ల్ సీన్స్
ఎంట‌ర్‌టైన్‌మెంట్

మైన‌స్ పాయింట్స్ః
స్లో సెకండాఫ్
మ్యూజిక్

పంచ్‌లైన్ః ఓ బేబీ ఎమోష‌న‌ల్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here