‘Ninu Veedani Needanu Nene Movie’ Review

0
685

గత కొన్ని సినిమాలుగా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిష‌న్ కు ఎప్ప‌టిక‌ప్పుడు నిరాశే ఎదురవుతుంది త‌ప్పించి ఒక్కసారి కూడా త‌ను అనుకున్న రేంజ్ హిట్ దొర‌క‌ట్లేదు. ఎప్పుడో కెరీర్ మొద‌లుపెట్టిన‌ప్పుడు వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ అనే ఒక సినిమాతో త‌న ఖాతాలోకి హిట్ వేసుకున్నాడు త‌ప్పించి, ఆ త‌ర్వాత దాని మొఖం చూసి ఎర‌గ‌డు. ఈసారి ఎలాగైనా స‌రే మంచి విజ‌యాన్ని చేజిక్కించుకోవాల‌ని ఒక కొత్త కాన్సెప్ట్ తో ”నిను వీడ‌ని నీడ‌ను నేనే” అంటూ తనే హీరోగా, నిర్మాత‌గా సినిమాను నిర్మించాడు. మ‌రి సందీప్ కు ఈ సినిమా అయినా సందీప్ కు త‌ను అనుకున్న విజ‌యాన్ని అందించిందా? ఈ సినిమా కూడా నిరాశే మిగిల్చిందా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

సినిమా కథ 2035లో మొదలవుతుంది. సైకాలజీ ప్రొఫెసర్‌(మురళీ శర్మ) తను డీల్‌ చేసిన ఓ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పటం మొదలు పెడతాడు. కథ 2013 సంవత్సరానికి మారుతుంది. అర్జున్ (సందీప్‌ కిషన్‌), మాధవి (ఆన్య సింగ్) భార్య భర్తలు. ఓ బంగ్లాలో నివాసం ఉంటున్న వీరికి ఓ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. వారు అద్దంలో చూసుకున్నప్పుడు వారికి బదులుగా ఇతర వ్యక్తులు రిషీ, దియా ముఖాలు కనిపిస్తుంటాయి. అద్దంలో వేరే వ్యక్తులు కనపడడానికి కారణం ఏంటి.? అద్దంలో కనిపించేది ఎవరు? చివరకు రిషీ, దియాలు ఏమయ్యారు? అన్నదే సినిమా కథ.

సందీప్ కిషన్‌ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. తనకు బాగా పట్టున్న కామెడీతో పాటు హారర్‌, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చాలా బాగా పండించాడు. హీరోయిన్ ఆన్య సింగ్ తెలుగులో తొలి సినిమానే అయినా మంచి మార్కులు సాధించింది. లుక్స్‌ పరంగా ఆకట్టుకున్న ఆన్య నటనలోనూ పరవాలేదనిపించింది. మరో కీలక పాత్రలో నటించిన వెన్నెల కిశోర్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. ఇతర పాత్రల్లో పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, ప్రగతి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

నిర్మాత‌గా మారుతున్న త‌న తొలి సినిమా కోసం సందీప్ కిష‌న్ మంచి క‌థ‌నే ఎంచుకున్నాడు. సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్ కు త‌గ్గ‌ట్లుగానే ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశాడు ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజు. ఫ‌స్టాఫ్ లో క‌థ కాస్త స్లో గా ఉన్న‌ప్ప‌టికీ బాగా ఆస‌క్తిని క‌లిగించగ‌లిగాడు. ఇక ఇంట‌ర్వెల్ కు అస‌లు ట్విస్ట్ రివీల్ అవుతుంది. కానీ లాజిక్ ల కోసం వెతికితే మాత్రం మ‌నం నిరాశే చెందుతాం. సెకండాఫ్ కు వ‌చ్చే సరికి సినిమాలో ఏదేదో జ‌రుగుతుంది. అస‌లేం అర్థం కాదు. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు థ‌మ‌న్ ఎప్పుడూ మంచి మ్యూజిక్ అందిస్తాడు. ఈ సినిమా విష‌యంలో కూడా థ‌మ‌న్ త‌న మార్క్ చూపించాడు. పాట‌లు ఫ‌ర్వాలేద‌నిపించినా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా స్థాయిని పెంచాడు. త‌నే నిర్మాత కావ‌డంతో ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా సినిమాకు ఎంతమేర అవ‌స‌ర‌మో అంత మేర‌కు ఖ‌ర్చు పెట్టి, మంచి నిర్మాణ విలువ‌లు పాటించాడు సందీప్ కిష‌న్.

ప్ల‌స్ పాయింట్స్ః
ఫ‌స్టాఫ్
రీరికార్డింగ్

మైన‌స్ పాయింట్స్ః
సెకండాఫ్
లాజిక్ లేని సీన్స్

పంచ్‌లైన్ః నీడ వీడింది.. కానీ ప్ర‌యోజ‌నం లేదు..
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here