‘ఖైదీ’ మూవీ రివ్యూ

0
1393

‘ఖాకి’ వంటి డిఫ‌రెంట్ మూవీతో మెప్పించిన కార్తికి తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్ ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యంలో కార్తి  మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమాయే ‘ఖైదీ’. చిరంజీవిని స్టార్ హీరోగా నిల‌బెట్టిన ఖైదీ సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ఆ టైటిల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అంటే కార్తి కాస్త ధైర్యం చేశాడ‌నే చెప్పాలి. మరి ఈ సాహసమైన కార్తీ కి హిట్ ని అందించిందా లేదా అన్నది సమీక్షలో చూద్దాం.

80 కిలోమీటర్లు.. నాలుగు గంటలు.. పదేళ్ల నిరీక్షణ.. చావుకు దగ్గరగా.. ఆశకు దూరంగా ఇది దిల్లీ(కార్తీ) పరిస్థితి. పదేళ్ల జైలు శిక్ష అనంతరం తన బిడ్డను చూడటానికి ప్రయాణం మొదలు పెట్టిన దిల్లీ అనుకోకుండా పోలీస్‌ ఆఫీసర్‌ బిజయ్‌(నరైన్‌)కు సహాయం చేయాల్సి వస్తుంది. బిజయ్‌తో సహా మరో నలుగురు పోలీస్‌ ఆఫీసర్లను చంపడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. అంతేకాకుండా ఈ ఐదుగురు పోలీసులతో పాటు పెను ప్రమాదంలో ఉన్న మరో నలుగురు యువకులు, ఓ యువతిని కాపాడాల్సిన బాధ్యత దిల్లీపై ఉంటుంది. అసలు ఆ ముఠా బిజయ్‌పై, పోలీస్‌ స్టేషన్‌పై ఎందుకు దాడి చేశారు? వందలమంది శత్రు సైన్యంతో పోరాడి దిల్లీ వారిని కాపాడాడా? చివరకు తన బిడ్డను కలుసుకున్నాడా? అనేదే కథ.

ఎప్పుడూ ప్రయోగాత్మకమైన, మంచి కథలను ఎంచుకునే కార్తీ, ఈ సారి కూడా ఓ కొత్త కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా మొత్తం మాసిన గడ్డం, లుంగీతో రఫ్‌ లుక్‌లో కనిపిస్తాడు. ఇక యాక్షన్‌ సీన్లలో మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు తన బిడ్డను చూడటానికి అతడు పడే తాపత్రయం, కొన్ని ఎమోషన్‌ సీన్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఇక కార్తీతో పాటు నరైన్‌ కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఒదిగిపోయాడు. కానిస్టేబుల్‌ పాత్రతో పాటు కార్తీ, నరైన్‌లతో సినిమా మొత్తం కనిపించే మరో కుర్రాడు ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడితో కార్తీ అక్కడక్కడా చేసే కామెడీ పండింది. చాలాకాలం తర్వాత తెరమీద కనిపించిన రమణ విలన్‌ పాత్రలో జీవించాడు. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ప్రయోగాత్మకంగా యువ దర్శకుడు లోకేశ్‌ను, కథను పూర్తిగా నమ్మి కార్తీ ఈ చిత్రానికి ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్‌ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకొని.. సందీప్‌ కిషన్‌తో ‘మానగరం’వంటి హిట్‌ సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ ఈ సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై మోశాడు.  ఒక రోజు రాత్రి నాలుగు గంటలు జరిగే ప్రయాణానికి సస్సెన్స్‌, థ్రిల్స్‌ను జోడించి కథ, కథనాన్ని ముందుకు నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. తను అనుకున్న కథను ఎక్కడా డీవియేట్‌ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి కథలకు స్క్రీన్‌ ప్లే ముఖ్యం.  పక్కాగా స్క్రీన్‌ప్లేను ప్రజెంట్‌ చేయడంలో డైరెక్టర్‌ విజయవంతమయ్యాడు. కొన్ని చోట్ల ఎమోషన్స్‌ పండించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఎక్కడా సీన్లు అతికించినట్టు కాకుండా కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రజంట్‌ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఇక రెండు ప్రదేశాల్లో జరిగే యాక్షన్‌ సీన్స్‌ను ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తెరపై చక్కగా చూపించారు. సినిమాటోగ్రఫీ చాలా చాలా బావుంది. పాటలు లేనప్పటికీ కథనానికి తగినట్లు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అక్కడక్కడా మెరుపులు మెరిపిస్తుంది. ఫైట్‌ మాస్టర్స్‌ కొత్త యాక్షన్‌ సీన్స్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
కార్తీ
స్టోరీ, స్క్రీన్ ప్లే
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

పంచ్ లైన్: ఖైదీ మాటంటే మాటే
ఫిల్మ్ జల్సా రేటింగ్:3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here