‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

0
1026
తమిళంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా  రూపొందిన ‘కణా’ ని తెలుగు లో కౌసల్య కృష్ణమూర్తి గా రీమేక్ చేసారు .ఇప్పటికే తమిళంలో బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ కి తెలుగు లో కూడా అంతటి విజయాన్నిఈ సినిమా అందించిందా లేదా అన్నది సమీక్ష లో చూద్దాం.
కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్) కి వ్యవసాయం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. తండ్రి చనిపోయినా కూడా క్రికెట్ చూస్తూ ఉండేంత పిచ్చి. ఇండియా మ్యాచ్ లో ఓడిపోవడం తో తండ్రి కన్నీళ్ళని చుసిన కౌసల్య ( ఐశ్వర్య రాజేష్) తాను పెద్ద క్రికెటర్ అయ్యి, ఇండియా తరపున ఆడి, టీం ని గెలిపించి తండ్రి ని సంతోషపెడదామనే ఆలోచనతో పెరుగుతుంది. పల్లెటూరి వాతావరణం లో పెరిగిన కౌసల్య తన కష్టాలని దాటుకుని ఎలా తన కల ని చేధించిందన్నదే కథ.
తండ్రి ఇష్టాన్ని చూస్తూ పెరిగిన కౌసల్య.. తన తండ్రి కల కోసం పాటుపడే క్యారెక్టర్ లో ఐశ్వర్య రాజేష్ జీవించేసింది. కళ్ళతోనే నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఒక క్రికెటర్ లా తనని తాను ప్రెజెంట్ చేసుకోడానికి ఐశ్వర్య పడిన పాట్లు తెర మీద స్పష్టంగా తెలుస్తున్నాయి. రైతు గా రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన మార్క్ చూపించాడు. కౌసల్య కి తల్లిగా, కృష్ణమూర్తి భార్య గా  ఝాన్సీ తన అనుభవాన్ని చూపించింది. కౌసల్య ని ప్రేమిస్తూనే.. తనకి సాయపడే పాత్ర లో కార్తీక్ రాజు బాగా చేసాడు. శివ కార్తికేయన్ క్యామియో బావుంది. మిగిలిన వారంతా కూడా తమ తమ పరిధుల్లో బాగానే చేసారు.
కౌసల్య కృష్ణమూర్తి.. తమిళ హిట్‌ ‘కణా’ మూవీకి రీమేక్‌. కథలో ఉన్న ఫీల్‌ను మిస్‌ చేయకుండా, మన నేటివిటీకి తగ్గట్టు చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు  భీమినేని శ్రీనివాసరావు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చాలానే సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమాలో క్రికెట్ తో పాటుగా వ్యవసాయాన్ని కూడా కలిపి కథనాన్ని రాసుకున్న విధానం చాలా బావుంది. ఒకపక్క క్రికెట్, మరోవైపు రైతు, వ్యవసాయం గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. కాకపోతే తర్వాతి సన్నివేశం ఏంటన్నది ప్రేక్షకుడు ముందే ఊహించేయడం కాస్త నిరాశ పరుస్తుంది. సంభాషణలు చాలా సహజంగా, ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. సినిమా కి మేజర్ ప్లస్ అంటే సంగీతమే. మ్యూజిక్ డైరెక్టర్ తన నేపథ్య సంగీతం తో ప్రతీ సీన్ ఎలివేట్ అయ్యేలా చేసాడు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: 
ఐశ్వర్య రాజేష్
సంగీతం

మైనస్ పాయింట్స్: 
ప్రేక్షకుడి ఊహకి అనుగుణంగా సాగే కథనం

పంచ్ లైన్: తండ్రిని గెలిపించే కూతురి కథ 
ఫిల్మ్ జల్సా రేటింగ్: 3/5 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here