‘ఇస్మార్ట్ శంక‌ర్’ మూవీ రివ్యూ

0
815

ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ పూరి జగన్నాధ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. కొంత కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్ద‌రూ త‌మ ఆశ‌ల‌న్నీ ఇస్మార్ట్ శంక‌ర్ మీదే పెట్టుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన ట్రైల‌ర్స్, సాంగ్స్ ల‌తో సినిమా మీద అంచ‌నాలు బాగా పెరిగిపోయాయి. దానికి తోడు చాలా రోజుల త‌ర్వాత వ‌స్తున్న మాస్ సినిమా కావ‌డం, పూరి- రామ్ ల క్రేజీ కాంబినేష‌న్ వ‌ల్ల సినిమాకు మంచి హైప్ వ‌చ్చింది. మ‌రి ఆ హైప్ కు త‌గ్గ‌ట్టే ఇస్మార్ట్ శంక‌ర్ అల‌రించాడా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

ఓల్డ్ సిటీలో సెటిల్‌మెంట్స్ చేసే శంక‌ర్ (రామ్ పోతినేని) కు ఓ డీల్ విష‌యంలో ప‌రిచయ‌మైన ఛాందిని (న‌భా న‌టేష్) తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో పొలిటీషియ‌న్ కాశీ రెడ్డిని చంపిన కేసులో జైలుకు వెళ్లడం, అక్క‌డ నుంచి త‌ప్పించుకున్న శంక‌ర్ మెద‌డులోకి మ‌రో వ్య‌క్తి జ్ఞాప‌కాల‌ను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంది సైంటిస్ట్ సరా అలియాస్ పింకీ (నిధి అగ‌ర్వాల్). అస‌లు శంక‌ర్ మెద‌డులోకి వేరొక‌రి మెమొరీస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి? కాశీ రెడ్డిని శంక‌ర్ ఎందుకు చంపుతాడు? అన్న‌దే ఇస్మార్ట్ శంక‌ర్ క‌థ‌.

ఎప్పుడూ చాక్లెట్ బాయ్ లుక్స్ తో ల‌వ్, ఫ్యామిలీ సినిమాలు చేసుకుంటూ పోతున్న రామ్, ఈ సినిమా తో పూర్తి మేకోవ‌ర్ చేశాడు. లుక్స్ నుంచి, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ వ‌ర‌కు అన్నింటిలోనూ డిఫ‌రెన్స్ చూపించాడు. సినిమాలో నువ్వెందుకు క్రిమిన‌ల్ అయ్యావ్ అని ఒక స‌న్నివేశంలో హీరోయిన్ అడుగుతుంది. దానికి శంక‌ర్ చెప్పే స‌మాధానం.. ”నువ్వు ఇంట్లో పెరిగితే నేను పెంట‌లో పెరిగా”. ఈ ఒక్క డైలాగ్ తోనే పూరీ త‌న హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను సింపుల్ గా చెప్పేశాడు. అలాంటి ప‌రిస్థితుల్లో పెరిగిన వాడు ఎలా ఉంటాడో, ఎలా మాట్లాడ‌తాడో, ఏ సంద‌ర్భంలో ఎలా రియాక్ట్ అవుతాడో అచ్చు శంక‌ర్ లా చేసిన రామ్ కూడా ఈ సినిమాలో అలానే అనిపిస్తాడు. ప్ర‌తీ సీన్ లోనూ ఎంతో ఎన‌ర్జిటిక్ గా, అస‌లు మునుపెన్న‌డూ చూడ‌ని రామ్ ని ఈ సినిమాలో చూస్తాం. డ్యాన్సులు కూడా యూత్ ను ఉర్రూత‌లూగించేలా చేశాడు. ఇక యాక్ష‌న్ సీన్స్ లో మాస్ ఆడియ‌న్స్ తో వావ్ సూప‌ర్బ్ అనిపిస్తాడు. హీరోయిన్లుగా చేసిన న‌భా న‌టేష్ కు మంచి పాత్రే ద‌క్కింది. యాక్టివ్ పెర్ఫామెన్స్ తో మంచి మార్కులే కొట్టేసింది. నిధి అగ‌ర్వాల్ క్యారెక్ట‌ర్ సినిమాకు ఒక విధంగా కీల‌కమైన పాత్ర అయినా, కావాల్సినంత స్కోప్ లేకుండా చిన్న క్యామియో లా మార్చేశారు. కానీ త‌న క్యారెక్ట‌ర్ ఉన్నంత వ‌ర‌కు నిధి బాగా చేసింది. త‌న అందం, అభిన‌యం, డ్యాన్సుల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. కీల‌క పాత్ర‌లో న‌టించిన స‌త్య‌దేవ్ ఉన్న‌ది కాసేపే అయినా చాలా ప్రామిసింగ్ రోల్ గా, గుర్తుండి పోయే పాత్ర చేశాడు. స‌త్య‌దేవ్, షియాజీ షిండే వారికి అల‌వాటైన పాత్ర‌ల్లో చాలా అల‌వోకగా న‌టించేశారు. గెట‌ప్ శీను, తుల‌సి, మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధుల్లో చేశారు.

చాలా కాలంగా ఫ్లాపుల‌తో ఇబ్బందులు ప‌డుతున్న పూరీ ఈసారి ఎలాగైనా హాట్ కొట్టాల‌న్న క‌సితో ఇస్మార్ట్ శంక‌ర్ ను తెర‌కెక్కించాడు. త‌న గ‌త చిత్రాల మాదిరిగా కాకుండా ఇస్మార్ట్ శంక‌ర్ ను కాస్త మ‌న‌సు పెట్టి తీసిన‌ట్ల‌నిపిస్తుంది. ఎక్స్‌పెరిమెంట‌ల్ ఫిల్మ్స్ వ‌స్తున్న త‌రుణంలో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములా తో ఈసారి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన పూరీ ఎప్ప‌టిలానే త‌న‌కు తెలిసిన ఒక సాంగ్, ఒక ఫైట్ ఫార్ములా వేసి తెగ్గొట్టేశాడు. క‌థ కొత్త‌గా ఉన్నా స్క్రీన్ ప్లే విష‌యంలో మాత్రం త‌నకు అల‌వాటైన రొటీన్ స్టైల్ నే పూరీ ఈ సినిమాకూ నమ్ముకున్నాడు. కాక‌పోతే అక్క‌డ‌క్క‌డా చిన్న సీన్స్ లోనే చాలా విష‌యాలు చెప్పాడు. ఉదాహ‌ర‌ణ‌కు ”చిన్న‌ప్ప‌టి నుంచి ఎవ్వ‌రూ లేకుండా అనాథ‌గా పెరిగిన శంక‌ర్ కు కాకా త‌ప్ప ఎవ‌రూ తెలీదు. కాకా చెప్పిన ప‌ని చేయాలి. అది మంచైనా, చెడైనా.. ఇది మాత్ర‌మే తెలిసిన శంక‌ర్.. త‌ర్వాత న‌మ్మిన వాళ్లు మాత్ర‌మే ఏదైనా చేయ‌గ‌ల‌రు” అని కూడా తెలుసుకుంటాడు. చిన్న చిన్న స‌న్నివేశాల్లో మంచి ఫిలాస‌ఫీనే చెప్పాడు పూరి. అలాగ‌ని పూరి త‌న మూస ఫార్ములా నుంచి బ‌య‌ట ప‌డ్డాడా అంటే ఖ‌చ్చితంగా లేద‌నే చెప్పాలి. త‌న గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ చిత్రం కాస్త ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది కానీ పూరీ ఈజ్ బ్యాక్ అనేంత‌లా అయితే లేదు. ఎప్పుడైనా స‌రే పూరీ త‌ను చెప్పాల‌నుకున్నది చెప్పేస్తాడు త‌ప్పించి, అన‌వ‌సరంగా ఆలోచించి లాజిక్స్ జోలికి పొర‌పాటున కూడా వెళ్ల‌డు. ప్రేక్ష‌కుడు ఫ‌లానా సీన్ లో లాజిక్ వెతుకుతాడేమో అని త‌న‌కు అన్పించిన స‌న్నివేశంలో ఒక మంచి డైలాగ్ రాసి, దాన్ని క‌వ‌ర్ చేసేయ‌డం పూరి కి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఎప్ప‌టిలాగే ఈ సినిమాలో కూడా మాస్‌, యూత్‌ ఆడియన్స్‌ను అలరించే డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు పూరి. జునైద్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమాకు మేజ‌ర్ హైలైట్ అంటే మ‌ణిశ‌ర్మ సంగీతం. నిజం చెప్పాలంటే సినిమా ముందు ఇంత హైప్ క్రియేట్ అవ‌డానికి కార‌ణం కూడా మ‌ణిశ‌ర్మ సంగీత‌మే. ప్ర‌తీ పాట యూత్ ని ఆక‌ట్టుకునేలా ట్యూన్ చేశాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. కొన్ని భ‌రించ‌లేని సీన్స్ ను కూడా త‌న రీరికార్డింగ్ తో ఫ‌ర్లేదు భ‌రించేయొచ్చు అనిపించేలా చేశాడు. మ‌రి కొన్ని సీన్స్‌లో నేపథ్య సంగీతం సన్నివేశాలను డామినేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుందంటే మ‌ణిశ‌ర్మ సంగీతం ఏ రేంజ్ లో ఇచ్చాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఎడిటింగ్ పూరీ సినిమా స్థాయిలోనే ఉంది. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకునే స్థాయిలో లేవు.

ప్ల‌స్ పాయింట్స్ః
రామ్ న‌ట‌న‌
మ‌ణిశ‌ర్మ సంగీతం, రీరికార్డింగ్
యాక్ష‌న్ సీన్స్

మైన‌స్ పాయింట్స్ః
రొటీన్ స్క్రీన్ ప్లే

పంచ్‌లైన్ః ఊర మాస్ శంక‌ర్
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here