‘Dorasaani’ Movie Review

0
729

యాంగ్రీ యంగ్ మ‌న్ రాజ‌శేఖ‌ర్ చిన్న కూతురు శివాత్మిక‌, విజ‌య్ దేవర‌కొండ తమ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌లు ‘దొర‌సాని’ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. కె.వి.ఆర్ మ‌హేంద్ర ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ధుర ఎంట‌ర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్ప‌టికే పోస్ట‌ర్స్, టీజ‌ర్, పాట‌లు, ట్రైల‌ర్ల‌తో ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా మీద అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచనాల‌ను ‘దొర‌సాని’ అందుకుందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం.

తెలంగాణ‌లోని ప‌ల్లెటూరికి చెందిన రాజు (ఆనంద్ దేవ‌ర‌కొండ‌) సొంత ఊరిని వ‌దిలి అమ్మ‌మ్మ వాళ్ల ద‌గ్గ‌ర ఉండి చదువుకుంటూ ఉంటాడు. వాళ్ల త‌ల్లిదండ్రులు సున్నం వేసే ప‌ని చేసుకుంటూంటారు. ఊరి లో ఉన్న దొర కూతురు చిన్న దొర‌సాని (శివాత్మిక‌) ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. దొర‌సాని కూడా రాజు ను ప్రేమిస్తుంది. పేదింటి అబ్బాయి, దొర‌సాని ల మ‌ధ్య ప్రేమ‌కు త‌ర్వాత ఎలాంటి చిక్కులొచ్చాయి..? అంద‌రి ప్రేమ‌ల్లా కాకుండా వీరి ప్రేమ కొత్త‌గా అనిపించ‌డానికి కార‌ణ‌మేంట‌నేది వెండి తెర మీద చూసి తెలుసుకోవాలి.

ఆనంద్, శివాత్మిక లు ఇద్దరినీ తెర‌పై చూస్తున్నంత సేపు రాజు, దొర‌సాని లు మాత్ర‌మే మ‌న‌కు క‌నిపించారంటే వాళ్ల న‌ట‌న ఎంత‌గా పండిందో అర్థం చేసుకోవ‌చ్చు. శివాత్మిక అయితే క‌ళ్ల‌తోనే చాలా స‌హ‌జంగా న‌టించేసింది. ఆనంద్ దేవ‌ర‌కొండ కూడా ఆ పాత్ర‌కు కావాల్సినంతా చేశాడు. వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ కూడా బావుంది. దొర పాత్ర‌లో విన‌య్ వ‌ర్మ స‌హ‌జంగా ఉన్నాడు. న‌క్స‌లైట్ గా కిషోర్ త‌మ ప్ర‌త్యేకత‌ను చాటుకున్నాడు. హీరో స్నేహితులుగా చేసిన కుర్రాళ్లు కూడా బాగా చేశారు. శ‌రణ్య‌, మిగిలిన ప్ర‌తి ఒక్క‌రూ కూడా త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమ క‌థ‌ను చాలా సిన్సియ‌ర్ గా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు కెవిఆర్ మ‌హేంద్ర‌. 30 ఏళ్ల నాటి వాతావ‌ర‌ణాన్ని, ఆ ప‌ద్ధతుల్ని, ఆచారాల‌ను, యాస ను తెర‌మీద‌కు తీసుకురావ‌డంలో అత‌డిని ఖ‌చ్చితంగా అభినందిచాల్సిందే. క్లైమాక్స్ లో ట్విస్ట్ ను కూడా బాగానే రాసుకున్నాడు. కాక‌పోతే త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నేది ప్రేక్ష‌కుడికి ముందుగానే తెలిసిపోయేలా ఉంది. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. క‌థ‌కు స‌రిపోయే మూడ్ ని క్రియేట్ చేసి ప్ర‌తీ షాట్ ను అద్భుతంగా తీసి, సినిమాకు మంచి లుక్ ను తీసుకొచ్చాడు. ప్ర‌శాంత్ విహారి అందించిన సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్. రీరికార్డింగ్ సినిమాకు మంచి ప్ల‌స్ అయింది. కొన్ని కొన్ని సీన్స్ లో రీరికార్డింగ్ ఆ స‌న్నివేశాల‌ను ఎలివేట్ అయ్యేలా చేసింది. నిర్మాత‌లుగా మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి, య‌ష్ రంగినేని ల‌ను ఇలాంటి మంచి సినిమాను తెర‌మీద‌కు తీసుకురావడానికి త‌మ‌కున్న అభిరుచికి మెచ్చుకోవాల్సిందే. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి మించి ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
న‌టీన‌టుల న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ
ప్ర‌శాంత్ విహారి సంగీతం

మైన‌స్ పాయింట్స్ః
ముందుగానే అర్థ‌మ‌య్యే క‌థ‌నం

పంచ్‌లైన్ః మ‌నసును మెచ్చే దొర‌సాని
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here