‘డియ‌ర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ

0
752

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో యూత్ లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు ‘డియ‌ర్ కామ్రేడ్’ అంటూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. గీత గోవిందంతో హిట్ పెయిర్ గా .పేరు తెచ్చుకున్న ర‌ష్మిక‌, విజ‌య్ లు ఈ సినిమాలో జంట‌గా న‌టిస్తుండ‌టం, మంచి అభిరుచి గ‌ల నిర్మాత‌లైన మైత్రి మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంస్థ‌లు ఈ సినిమాని నిర్మిస్తుండ‌టంతో సినిమాపై మొదటి నుంచి మంచి అంచ‌నాలే ఉన్నాయి. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్న ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను నిల‌బెట్టిందా లేదా అన్న‌ది సమీక్ష‌లో చూద్దాం.

వైజాగ్‌లో ఉండే చైత‌న్య అలియాస్ బాబీ(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) కాలేజ్ స్టూడెంట్ లీడ‌ర్. త‌న క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే చూస్తూ ఊరుకునే ర‌కం కాదు. గొడ‌వ‌ల్లో ముందుండే దూకుడు స్వ‌భావాన్ని అత‌ని స్నేహితులు, త‌ల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. బాబీ వాళ్ల ఎదురింటికి వాళ్ల బంధువు అప‌ర్ణా దేవి అలియాస్ లిల్లీ(ర‌ష్మిక మంద‌న్న)ని ప్రేమిస్తాడు. లిల్లీ స్టేట్ క్రికెట్ ప్లేయ‌ర్‌. చివ‌ర‌కు లిల్లీ కూడా బాబీ ప్రేమ‌కు ఓకే చెబుతుంది. అయితే లిల్లీకి గొడ‌వ‌లంటే భ‌యం. దానికి దూరంగా ఉండ‌మ‌ని లిల్లీ చెప్పినా బాబీ వినిపించుకోడు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డంతో బాబీకి దూరంగా లిల్లీ వెళ్లిపోతుంది. దాంతో బాబీ పిచ్చోడైపోతాడు. చివ‌ర‌కు దేశం ప‌ట్టుకుని వెళ్లి.., సౌండింగ్ థెర‌పీ మీద రీసెర్చ్‌ చేస్తూ మూడేళ్లు ఇంటికి దూరంగా ఉంటాడు. బాబీ ఇంటికి తిరిగి వ‌చ్చిన‌ప్పుడు, ఎలాంటి ప‌రిస్థితుల‌ను చూస్తాడు? లిల్లీని బాబీ క‌లిసిన త‌ర్వాత ఆమె మానసిక స్థితేంటి? లిల్లీ ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది? చివ‌ర‌కు లిల్లీకి జ‌రిగిన అన్యాయంపై బాబీ ఎలాంటి పోరాటం చేస్తాడు? అన్న‌దే మిగ‌తా క‌థ‌.

విజ‌య్ దేవ‌ర‌కొండ డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్ తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నాడు. స్టూడెంట్ లీడ‌ర్ గా, ప్రేమికుడిగా, ప్రేయ‌సి దూర‌మై బాధ‌లో ఉన్న వ్య‌క్తిగా చాలా మంచి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. విజ‌య్ మార్క్ అగ్రెసెవ్ సీన్స్ సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యాయి. లిల్లీ పాత్ర‌లో ర‌ష్మిక ఒదిగిపోయింది. రొమాంటిక్ సీన్స్ లోనూ, ఎమోష‌నల్ సీన్స్ లోనూ ర‌ష్మిక మెప్పించింది. డ‌బ్బింగ్ లో కాస్త శ్ర‌ద్ధ తీసుకుని ఉంటే బావుండేది. మ‌ల్టీ లింగ్యువ‌ల్ మూవీ కావ‌డంతో మిగిలిన పాత్ర‌ధారులంతా ప‌ర‌భాష వాళ్లే ఎక్కువున్నారు. వారు కూడా వారి వారి ప‌రిధుల్లో బాగానే చేశారు.

డియ‌ర్ కామ్రేడ్ క‌థ ప‌రంగా ఓకే అయినా దాన్ని చెప్పే తీరులో ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ప్రేక్ష‌కుల‌కు నిరాశే మిగిల్చాడు. త‌ను అనుకున్న క‌థ‌ను చాలా వివ‌రంగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించి, ఆడియ‌న్స్ స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడు. క‌థ ప‌రంగా కొత్త‌గా లేక‌పోయినా, స్క్రీన్ ప్లే తో అయినా ఏదైనా మ్యాజిక్ చేశాడా అంటే అదీ లేదు. ఫ‌స్టాఫ్ మొత్తం కేవ‌లం హీరో ని ఎస్టాబ్లిష్ చేయ‌డానికే అన్న‌ట్లు.. సెకండాఫ్ కోసం క‌థ దాచిపెట్టేశాడు. స‌రే సెకండాఫ్ ఏమైనా స్పీడ్ గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉందా అంటే లేదు. సెకండాఫ్ చూశాక ఫ‌స్టాఫే బెట‌రేమో అనిపించేలా విసుగు పుట్టించాడు. ర‌ష్మిక‌, విజ‌య్ ల ల‌వ్ ట్రాక్ త‌ప్ప క‌థ‌లో గొప్ప‌గా ఏమీ ఉండ‌దు. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్. కేర‌ళ అందాల‌తో పాటు నార్త్ లో తెర‌కెక్కించిన రోడ్ విజువ‌ల్స్ బావున్నాయి. జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీతం కొత్త‌గా ఉంది. పాటలు బావున్న‌ప్ప‌టికీ, స్క్రీన్ మీద అవి కొత్త‌గా పంటికింద రాయిలా అనిపిస్తాయి. ఎడిటర్‌ కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. ప్రతీ సన్నివేశం సుధీర్ఘంగా సాగుతూ ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
విజ‌య్, ర‌ష్మిక ల న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
స్క్రీన్ ప్లే
ర‌న్ టైమ్

పంచ్‌లైన్ః కామ్రేడ్ కు కాస్త క‌ష్ట‌మే..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here