‘విన‌య విధేయ రామ’ మూవీ రివ్యూ

0
1259
‘రంగ‌స్థలం’ లాంటి తిరుగులేని ఘ‌న విజ‌యం త‌ర్వాత మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా ‘విన‌య విధేయ రామ‌’. వ‌రుస ప్రయోగాల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ తో వ‌స్తుండ‌టం, బోయ‌పాటి కాంబినేష‌న్ లో కావ‌డం వ‌ల్ల సినిమా మీద మంచి అంచ‌నాలే ఏర్పడ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను ‘వినయ విధేయ రామ’ ఏ మేర‌కు ఆక‌ట్టుకుంది? త‌న స‌క్సెస్ ట్రాక్ ను రామ్ చ‌ర‌ణ్ కంటిన్యూ చేశాడా అన్న‌ది స‌మీక్ష లో చూద్దాం.

రామ్ ( రామ్ చ‌ర‌ణ్) కు త‌న అన్న‌లంటే ప్రాణం. త‌న అన్న‌ల కోసం చ‌దువును, భ‌విష్య‌త్తును కాద‌నుకుని అన్న‌ల‌ను పెద్ద చ‌దువులు చ‌దివిస్తాడు రామ‌. భువ‌న్ కుమార్ ఎల‌క్ష‌న్ క‌మిష‌నర్ గా వైజాగ్ లో ప‌నిచేస్తుండ‌గా పందెం ప‌రుశురామ్ ( ముఖేష్ రుషి ) తో గొడ‌వ అవుతుంది. త‌న అన్న‌ల జోలికి ఎవ‌రొచ్చినా స‌హించ‌లేని రామ‌, పరుశురామ్ ను అత‌డి మ‌నుషుల‌ను కొట్టి పంపిస్తాడు. మ‌రోవైపు బీహార్ లోని ఓ ప్రాంతాన్ని త‌ను క‌నుసైగ‌ల‌తో శాసిస్తున్న వ్య‌క్తి రాజు భాయ్ మున్నా ( వివేక్ ఒబెరాయ్) త‌న ప్రాంతంలో ఎల‌క్ష‌న్లే లేకుండా త‌న‌కు న‌చ్చిన వారినే ప‌దవుల్లో పెట్టుకుంటాడ‌ని తెలిసి భువ‌న్ కుమార్ ను అక్క‌డికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ గా పంపిస్తారు. త‌నకు ఎదురొచ్చే వారిని అంతం చేసే రాజు భాయ్, భువన్ ను ఏం చేశాడు? అన్న కోసం రామ ఏం చేశాడ‌న్న‌ది తెర మీదే చూడాలి.

‘రంగస్థలం’తో నటుడిగా గొప్ప పేరు సంపాదించి.. మరపురాని విజయాన్నందుకున్న రామ్ చరణ్.. దాని తర్వాత ఇలాంటి సినిమా చేయడం విచారకరమైన విషయం. అతడికి ఈ సినిమా ఏ రకంగానూ ఉపయోగపడదు. చరణ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యాక్సెప్టెన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి సినిమా ఖ‌చ్చితంగా అతడి కెరీర్ ని వెనక్కి లాగేదే. పెర్ఫామెన్స్ పరంగా చెప్పుకోవడానికేమీ లేదు. యాక్షన్ సన్నివేశాల్లో, డ్యాన్సుల్లో అతను ఎప్పట్లాగే రాణించాడు. హీరోయిన్ కియారా అద్వానీ కేవలం పాటలకు మాత్రమే పనికొచ్చింది. ఆమె అందంగా కనిపించింది. విలన్ వివేక్ ఒబెరాయ్ దర్శకుడు చెప్పినట్లు చేసుకుపోయాడు. అతడి పాత్ర ఏమీ ఆసక్తి రేకెత్తించదు. ప్రశాంత్, స్నేహలకు కొంచెం వెయిట్ ఉన్న పాత్రలే ఇచ్చారు కానీ.. అవేమీ అంత ఆసక్తికరంగా లేవు. ఆర్య‌న్ రాజేష్, హ‌రీష్ ఉత్త‌మ‌న్, ముకేష్ రిషి, ర‌వి వ‌ర్మ‌, మ‌ధు నంద‌న్ ఇలా చాలా మందే ఉన్న‌ప్ప‌టికి వారి గురించి పెద్ద‌గా చెప్పుకోడానికి పెద్ద‌గా ఏమీ లేదు.

‘రంగ‌స్థ‌లం’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్ సినిమా కావడంతో ఆడియ‌న్స్ మంచి సినిమాను ఆశించ‌డం స‌హ‌జం. అయితే ఆ ఆశ‌ను అడియాశ‌గా మార్చాడు బోయ‌పాటి. అస‌లు బోయ‌పాటి సినిమా అంటేనే భారీ యాక్ష‌న్ ఎపిసోడ్స్, మంచి ఎమోష‌న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలో ఆ రెండూ శృతి మించిపోయాయి. బోయ‌పాటి గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇది అట్ట‌డుగు వ‌ర్గ చిత్రంగా చెప్పొచ్చు. స్క్రీన్ నిండా న‌టీన‌టులున్నా, వారిని వాడుకోవ‌డం మానేసి.. త‌ను న‌మ్ముకున్న యాక్ష‌న్ సీన్స్ తోనే సినిమాను లాగిద్దామ‌నుకుని, తను చేసిన ప్ర‌య‌త్నం చాలా గ‌ట్టిగానే బెడిసికొట్టింది. అస‌లు క‌థ‌లో భాగంగా ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ లో భాగ‌మే క‌థ‌నా.. అనే రేంజ్ లో ఈ సినిమాను తెర‌కెక్కించాడు బోయపాటి. ఒక వేరే రాష్ట్ర ముఖ్య‌మంత్రి కొన్ని వంద‌ల మంది క‌మాండోల‌తో కలిసి తెలుగు రాష్ట్రంలో ఉన్న హీరో ద‌గ్గ‌రికి వ‌చ్చి అంటాడు ”మా రాష్ట్రానికి ఒక‌ప్పుడు బుద్ధుడొచ్చాడు. త‌ర్వాత నువ్వొచ్చి మా ద‌గ్గ‌ర జ‌రుగుతున్న అరాచ‌కాల్ని ఆపావు” అని. ఇవ‌న్నీ ఎప్పుడో గతంలో అయితే బావుండేవి. అలాంటి ఎలివేష‌న్లు చూసి చూసీ జ‌నాలు విసుగెత్తిపోయి కొత్త‌ద‌నాన్ని కోరుకుంటున్నారు ప్రేక్ష‌కులు. ఈ టైమ్ లో బోయ‌పాటి వ‌చ్చి మ‌ళ్లీ అలాంటి ఎలివేష‌న్లే ట్రై చేసి.. ప్రేక్ష‌కుల అస‌హ‌నానికి ‘విన‌యం’గా ప‌రీక్ష పెడ‌తాడు. త‌నకంటే పెద్ద వాళ్ల‌యిన కుర్రాళ్ల‌ను ఒక ఏడెమినేదేళ్ల పిల్లాడు ”నేను ప‌ని చేసి వీళ్లను చ‌దివిస్తా” అని స‌వాల్ విస‌రడం, నేను చెప్పింది సాధించా అన్న‌ట్లు త‌ను చ‌దివించిన వాళ్లంద‌రూ మంచి మంచి ఉన్న‌త స్థానాల్లో ప‌నిచేయ‌డం అనే మొద‌టి సీన్ తోనే ఈ సినిమా ఎలా ఉంటుందో ఒక అంచ‌నా వ‌చ్చేస్తుంది. అక్క‌డి నుంచి మొద‌లు.. ఒక‌టేమిటి? త‌ర్వాత వ‌చ్చే ఏ స‌న్నివేశం అయినా స‌రే మ‌న అంచ‌నాల‌కు ఏ మాత్రం అంద‌కుండా.. ప‌ర‌మ రొటీన్ సో కాల్డ్ యాక్ష‌న్ సీన్స్ తో క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్ లోనే న‌డిపించాడు ద‌ర్శ‌కుడు. సినిమాకు ఉన్న మేజ‌ర్ ప్ల‌స్ అంటే సినిమాటోగ్ర‌ఫీ. రిషి పంజాబీ ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా, నీట్ గా ప్రెజెంట్ చేశాడు. ఎలివేష‌న్ షాట్స్, యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది. ఇలాంటి సినిమాకు ఒక మంచి పాట ఇచ్చినా వేస్ట్ అవుతుంద‌నుకున్నాడో ఏమో కానీ దేవీ శ్రీ ప్ర‌సాద్ పాటలు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. పోనీ రీరికార్డింగ్ అయినా బావుందా అంటే అదీ లేదు. ఎడిటింగ్ , నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః
రామ్ చ‌ర‌ణ్
కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్స్
సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్ః
కావాల‌ని ఇరికించిన ఫైట్స్
ద‌ర్వ‌క‌త్వం
సంగీతం

పంచ్‌లైన్ః విన‌యం లేదు.. అంతా విధ్వంస‌మే..!
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here