'యుద్ధం శ‌ర‌ణం' మూవీ రివ్యూ


ప్రేమ‌మ్, సాహ‌సం శ్వాస‌గా సాగిపో, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల విజ‌యంతో, మంచి ఊపు మీదున్న నాగ‌చైత‌న్య.. త‌నకు చిన్న‌ప్ప‌టి నుంచి స్కూల్ మేట్, క్లాస్ మేట్ అయిన కృష్ణ మురిముత్తు అనే కొత్త ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌కత్వంలో న‌టించిన సినిమా యుద్ధం శ‌ర‌ణం. సినిమా ఫ‌స్ట్ లుక్ నుంచి, ట్రైల‌ర్ వ‌ర‌కు రోజురోజుకీ అంచ‌నాలు పెంచుతూ వ‌స్తున్న ఈ సినిమా ఈవారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సినిమాతో కూడా విజ‌యం సాధించి, త‌న స‌క్సెస్ ట్రాక్ ను అలాగే మెయింటైన్ చేయాల‌న్న‌ నాగ‌చైత‌న్య కోరిక తీరుతుందా..? మ‌ంచి అభిరుచి ఉన్న చిత్రాల‌ను నిర్మించే సంస్థ‌గా పేరున్న వారాహి చ‌ల‌న చిత్రంకు ఈసారైనా విజ‌యం వ‌రిస్తుందా..? అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం. 

క‌థః

హ్యాపీగా, త‌న బ్ర‌తుకు తాను బ్ర‌తుకుతున్న హీరో ఫ్యామిలీ అనుకోని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల చిక్కుల్లో ప‌డుతుంది. దీనివ‌ల్ల హీరో కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నాడ‌న్నదే యుద్ధం శ‌ర‌ణం అస‌లు క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః
నాగ‌చైత‌న్య ఎప్ప‌టిలాగే మ‌రోసారి ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. న‌టుడిగా త‌న‌కి తానే పెట్టుకుంటున్న ప‌రీక్ష‌ల్లో చైతూ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ‌స్ట్ క్లాస్ లో పాస్ అవుతూనే ఉన్నాడు.  సినిమా సినిమాకు వేరియేష‌న్స్ చూపిస్తూ వ‌స్తున్న చైతూ, ఈ సినిమాలో కూడా అర్జున్ గా మెప్పించాడు. త‌న కుటుంబం ప‌ట్ల త‌న కేరింగ్, ప్రియురాలి ప‌ట్ల ప్రేమ ఇలా అన్ని కోణాల్లోనూ న‌టుడిగా నాగ‌చైత‌న్య ఎదిగాడు. లావ‌ణ్య త్రిపాఠి బాగా చేసింది. ఇక పోతే సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్ట‌ర్ అంటే శ్రీకాంత్.  శ్రీకాంత్ న‌ట‌న పెద్ద అస్సెట్. అయితే ఇది శ్రీకాంత్ కు కొత్త‌గా ఉంటుందేమో కానీ, చూసే ఆడియ‌న్స్ కు అంత కొత్త‌గా ఏమీ అనిపించ‌దు. శ్రీకాంత్ క్యారెక్ట‌ర్ ను డైర‌క్ట‌ర్ ఇంకాస్త బాగా డెవ‌ల‌ప్ చేసుండాల్సింది. ఇక‌ రావు ర‌మేష్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌న్లేదు. హీరో త‌ల్లిగా రేవ‌తి మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌ర‌చింది. సినిమా చూస్తున్నంతసేపు త‌మలాంటి త‌ల్లిదండ్రులు ప్ర‌తీ ఒక్క‌రికీ ఉండాల‌నుకుంటారు. మిగతా వారిలో ముర‌ళీ శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి త‌మ త‌మ పాత్ర‌ల  ప‌రిధి మేర బాగానే న‌టించారు. 

సాంకేతిక నిపుణులుః
కృష్ణ కు దర్శకుడిగా తొలి సినిమా అయినా కానీ తనకి ఆడియ‌న్స్ పల్స్‌ బాగా తెలుసని ఫ‌స్టాఫ్ తో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ, ఎమోష‌న్స్ ప‌రంగా సాగుతూ వ‌చ్చిన సినిమా సెకండాఫ్ కు స‌డ‌న్ గా సీరియ‌స్ జోన్ లోకి వెళ్తుంది.  అయితే సీరియ‌స్ అండ్‌ ఎమోషన్‌ అన్నట్టుగా డివైడ్‌ చేసుకుని ఫార్ములాకి తగ్గ కథనం రాసుకోవ‌డంలో కృష్ణ ఫెయిల్ అయ్యాడు. దానికి తోడు వినోదం లోటు కూడా సినిమాలో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపించింది.  వివేక్ సాగ‌ర్ అందించిన పాట‌ల్లో ఏ ఒక్క‌టీ విన‌సొంపుగా లేక‌పోగా, సినిమాకు అడ్డంగా అనిపిస్తాయి. కానీ రీరికార్డింగ్ విష‌యంలో మాత్రం వివేక్ జాగ్ర‌త్త ప‌డ్డాడు. స్టాండ‌ర్డ్ సినిమాల‌కు త‌గ్గ‌ట్టు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సినిమా మొత్తాన్ని ఒకే మూడ్ లోతీసుకురావ‌డంలో సినిమాటోగ్ర‌ఫ‌ర్ స‌క్సెస్ అయ్యాడు. సినిమాలో ఇంకా ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గిన‌వేమీ లేవు. ఎడిటింగ్ ఇంకా చేసి ఉండాల్సింది.  
 
 ఏ రీజ‌న్ లేకుండా ఒక ఫ్యామిలీ స‌ఫ‌ర్ అవ‌డం, ఆ కుటుంబాన్ని కాపాడటం కోసం హీరో నానా తంటాలు ప‌డ‌టం మ‌నం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇక్కడ కూడా సేమ్ రొటీన్ స‌బ్జెక్ట్ ను తీసుకొచ్చి మ‌ళ్లీ బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నమే చేశాడు ద‌ర్శ‌కుడు కృష్ణ‌. స‌రికొత్త క‌థాంశం కానీ, క‌థ‌నం కానీ లేకుండా రొటీన్ ఎలిమెంట్స్ తో సినిమా తీశాడు. స‌గ‌టు సినీ ప్రియుడికి కావాల్సిన అన్ని అంశాలు స‌రైన డోస్ లో ప‌డి, అన్నీ స‌రిగ్గా కుదిరితే, ఎన్ని సార్లు చూసిన క‌థ‌నైనా మ‌ళ్లీ ఇంకోసారి చూడ్డానికి ఏం కంప్ల‌యింట్స్ ఉండ‌వు. కాక‌పోతే దానికోసం ఆ ఫార్ములాని క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేసి, గ్రాఫ్ ని ఎలా మెయింటైన్ చేయాలో పేస్ ఎంత క‌న్సిస్టెంగ్ గా ఉంచాలో అన్నీ తెలిసుండాలి. ఈ విష‌యం ద‌ర్శ‌కుడికి ఈ సినిమా త‌ర్వాత అయినా తెలుస్తుంద‌ని ఆశిద్దాం. మంచి ఫామ్ లో ఉన్న హీరో తో కొత్త‌గా సినిమా చేస్తున్నాడంటే మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయి ఉంటే, ద‌ర్శ‌కుడిగా త‌న‌కు, హీరోగా నాగ‌చైత‌న్య‌కు మ‌రో విజ‌యం వ‌చ్చేవి. 

ప్ల‌స్ పాయింట్స్ః

నాగ‌చైత‌న్య  న‌ట‌న‌
శ్రీకాంత్ క్యార‌క్ట‌రైజేష‌న్
నేప‌థ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్ః

సెకండాఫ్
కొన్ని అన‌వ‌స‌రమైన స‌న్నివేశాలు

పంచ్‌లైన్ః యుద్ధం శరణమే....

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5