'ఉంగ‌రాల రాంబాబు' మూవీ రివ్యూ


క‌మెడియ‌న్ గా టాలీవుడ్ లో ఒక సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సునీల్ హీరోగా మారిన త‌ర్వాత మొద‌ట్లో అయితే హీరోగా విజ‌యం అందుకున్నాడు కానీ త‌ర్వాత మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు నిరాశే ఎదుర్కొంటున్నాడు. ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా సునీల్ ను మాత్రం విజ‌యం వ‌రించ‌ట్లేదు. ఈ నేప‌థ్యంలో ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల‌తో ద‌ర్శ‌కుడిగా మారిన క్రాంతి మాధ‌వ్ డైర‌క్ష‌న్ లో ఉంగ‌రాల రాంబాబుగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మ‌రి ఈ సినిమాతో అయినా సునీల్ కెరీర్ ఓ గాడిన ప‌డుతుందా లేదా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః

ఓ డ‌బ్బున్న పెద్దాయ‌న‌కు మ‌నువ‌డైన ఉంగరాల రాంబాబు (సునీల్) కు తాత చ‌నిపోయిన త‌ర్వాత త‌న‌కు ఉన్న‌వి ఆస్తులు కాదు, అప్పులు అని తెలుస్తుంది. ఈ ప‌రిష్కారం నుంచి బ‌య‌ట ప‌డేయ‌మ‌ని బాదం బాబా (పోసాని కృష్ణ‌ముర‌ళి) ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. అక్కడి నుంచి త‌న లైఫ్ ఎలా మారుతుంది? త‌న జీవితంలోకి ఎలాంటి మార్పులు వ‌చ్చాయ‌న్న‌దే అస‌లు క‌థ‌. 


న‌టీన‌టుల ప్ర‌తిభః  

మొద‌టి నుంచి ద‌ర్శ‌కుడు ఏదైతే చెప్తున్నాడో  సునీల్ అదే  చేస్తున్నాడు. సునీల్ ఎమోష‌నల్ గా ట్రై చేసి ఆ యాంగిల్ లో స‌క్సెస్ అయ్యాడు. హీరోయిన్ మియా జార్జ్ బాగుంది. హీరోయిన్ తండ్రిగా ప్ర‌కాష్ రాజ్ చాలా బాగా చేశాడు. త‌న న‌ట‌న గురించి ఈరోజు కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. వెన్నెల కిషోర్ పాత్ర లెంగ్త్ ఉన్నప్ప‌టికీ త‌నను డైర‌క్ట‌ర్ స‌రిగా వాడుకోలేదేమో అనిపిస్తుంది. క‌లెక్ట‌ర్ గా రాజీవ్ క‌న‌కాల బాగా సెట్ అయ్యాడు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే చేశారు. 


సాంకేతిక విభాగంః 

సునీల్ తో సినిమా చేసే ఏ ద‌ర్శ‌కుడైనా సునీల్ ను ఎలా చూపించాలి? ఎలా ప్రెజెంట్ చేస్తే ప్రేక్ష‌కులు సునీల్ ను బాగా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలుసుకుని త‌ర్వాత సినిమా ప్లాన్ చేసుకుంటే బెట‌ర్. ఎంత‌సేప‌టికీ డ్యాన్సులు, ఫైట్లు ఇవేనా సినిమా అంటే. హీరో చేయాల్సింది ఇవేనా. కేవ‌లం డ్యాన్సులు, ఫైట్లు అయితే జిమ్నాస్టులు చాలా మందే ఉన్నారు క‌దా. ఇందులో సునీల్ ను అనుకోవాల్సిన ప‌నేం లేదు. ఇదే క‌థ‌తో చాలా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ అదే పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని తీసుకుని దానికి కాస్త మార్పులు చేర్పులు చేసి ప్రేక్ష‌కుల‌కు ప్రెజెంట్ చేశాడు డైర‌క్ట‌ర్ క్రాంతి మాధ‌వ్. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు లాంటి క్లాసిక్ సినిమా తీసిన ద‌ర్శ‌కుడి నుంచి ఇలాంటి సినిమాలు ఎవ‌రూ ఆశించ‌రు. ఈ విష‌యాన్ని ఇప్పుడైనా క్రాంతి మాధ‌వ్ గ్ర‌హిస్తే మంచిది. సినిమా ఏ విష‌యంలోనూ గొప్ప‌గా చెప్పుకునే రేంజ్ లో లేదు. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. జిబ్రాన్ సంగీతం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌. దానికి తోడు అవి అన‌వ‌స‌రమైన స‌మ‌యంలో వ‌చ్చి చికాకు పుట్టిస్తాయి. రీరికార్డింగ్ అంతంత మాత్ర‌మే. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు మ‌రింత ప‌దును పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రానిరోజు వంటి సినిమా తీసిన డైర‌క్ట‌ర్ ఈ సినిమాకు కూడా డైర‌క్ట‌ర్ కావ‌డం

ప్ర‌కాష్ రాజ్ న‌ట‌న‌


మైన‌స్ పాయింట్స్ః 

పాట‌లు

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం

క‌మెడియ‌న్స్ ను పెట్టుకుని స‌రిగా కామెడీ లేక‌పోవ‌డం


పంచ్‌లైన్ః  కేవ‌లం రంగురాళ్ల రాంబాబే

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.25/5