శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా రివ్యూగౌర‌వం, కొత్త‌జంట చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకుని దాదాపు రెండు సంవ‌త్స‌రాలు గ్యాప్ తీసుకొని, మంచి క‌థ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశాన‌ని, చెప్తూ వ‌చ్చిన అల్లు శిరీష్.. త‌ను కోరుకున్న‌క‌థ‌తో వ‌చ్చిన ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈరోజు విడుద‌లైన చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. మ‌రి త‌ను అనుకున్న‌ట్లు, ఈ చిత్రంతో అయినా శిరీష్ కు విజ‌యం వ‌రించిందా లేదా అన్న‌ది మ‌న సమీక్ష‌లో తెలుసుకుందాం.


క‌థ విషయానికి వ‌స్తే..
రెండు సంవ‌త్స‌రాలు ఈ కథ కోసం వెయిట్ చేసి ఉంటే, శిరీష్ పప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే క‌థేమీ కొత్త‌ది కాదు. చాలా సినిమాలు ఇలాంటి క‌థ‌తో వ‌చ్చిన‌వే. బొమ్మ‌రిల్లు, సోలో చిత్రాలు కూడా దాదాపు ఈ కోవ‌లోనే ఉంటాయి. కాక‌పోతే ఇక్క‌డ క‌థ కంటే, క‌థ‌నం మీదే దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. ఎలాంటి క‌థైనా క‌థ‌నంతోనే క‌ట్టిప‌డేసే ప్ర‌తిభ ద‌ర్శ‌కుడిది. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు.


డ‌బ్బు కోస‌మే అమ్మాయిలు డ‌బ్బున్న అబ్బాయిల‌ను ప్రేమిస్తారు అనుకునే తండ్రి, ఎంత‌గా అంటే, త‌న పెద్ద కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, 5సం.ల త‌ర్వాత కూడా త‌న కోడ‌లి పేరు తెలియ‌నంత‌గా డ‌బ్బును ప్రేమించే తండ్రి. అలాంటి తండ్రి క‌డుపున పుట్టిన శిరీష్ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తండ్రి మాత్రం డ‌బ్బు కోస‌మే ఆ అమ్మాయి ప్రేమిస్తుంది అంటాడు. అప్పుడు మ‌న‌హీరో మీ ఐడెంటిటీ వాడ‌కుండా ఆ అమ్మాయిని ప్రేమించేలా చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు.


తండ్రి అంటే కూతురుకు ప్రాణం. కూతురు కోస‌మే బ్ర‌తికే తండ్రి.. వీరికి అండ‌గా, వీరి కుటుంబాన్ని ఇష్ట‌ప‌డే హీరోయిన్ తండ్రికి స్నేహితుడు. ఇంకేముంది? మ‌నం ఊహించిన‌ట్లుగానే, అమ్మాయికి ప్రేమ పుట్టేస‌రికి, ఇంకెవ్వ‌రితోనో పెళ్లికి ఓకే చెప్పాల్సి రావ‌డం, హీరో ఏమో నీకు నామీద ప్రేముంది, నువ్వు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదంటూ హీరోయిన్ ఇంటికి వెళ్ల‌డం. చివ‌ర‌కు కుటుంబాన్ని ఒప్పించాడా లేదా అన్న‌దే క‌థ‌. బ‌ట్ ఇలాంటి క‌థ‌లో ఏం జ‌రుగుతుందో మ‌నం కొత్త‌గా ఊహించ‌న‌క్క‌ర్లేదు. కొత్త‌గా ఊహిస్తే మ‌నం అంగీక‌రించ‌లేం కూడా..


ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ..
ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా బోర్ కొట్ట‌కుండా, వినోదం మిస్ అవ‌కుండా బాగా జాగ్ర‌త్త ప‌డ్డాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా శిరీష్, లావ‌ణ్య‌, స్వ‌ప్నిక‌, ప్ర‌భాస్ శ్రీను ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. సెకండాఫ్ లో వెడ్డింగ్ ప్లానర్ లా అలీ, చాలా రోజుల త‌ర్వాత మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేష‌న్ లో హంసా నందిని, సుబ్బ‌రాజు, అలీ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో న‌వ్వులు పూయించాయి.


చివ‌ర‌లో, బొమ్మరిల్లు క్లైమాక్స్ ను పోలి ఉన్న ప్ర‌కాశ్ రాజ్, శిరీష్ ల మ‌ధ్య ఎమోష‌న్స్ ను బాగా పండించాడు. ముఖ్యంగా పేదింటి అమ్మాయిగా వ‌చ్చిన త‌న వదిన ఇక్క‌డ ఎంత‌గా బాధ ప‌డుతుందో చెప్పే సీన్ కు క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతాయి. అలాగే లావ‌ణ్య, రావు ర‌మేష్ ల మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌న్నీ కూడా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తాయి. ప‌ది నిమిషాల్లో జ‌ర‌గాల్సిన పెళ్లిని ఆపే సీన్ కొంత న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా, న‌మ్మ‌క తప్ప‌ని ప‌రిస్థితి.


పెర్ఫామెన్స్ విష‌యానికి వ‌స్తే..
అల్లుశిరీష్ రెండు చిత్రాల‌తో న‌టునిగా గుర్తింపు తెచ్చుకొన్నా, క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకోలేక పోయాడు అన్న బాధ ఉండేది. కానీ ఈ చిత్రంతో, న‌టునిగా మంచి మార్కులు వేసుకుంటూ అటు క‌మ‌ర్షియ‌ల్ గా కూడా స‌క్సెస్ అయ్యే దిశ‌గా ప్ర‌య‌త్నం చేశాడు. కామెడీ సీన్ల‌తో పాటు, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో కూడా గ‌త చిత్రాల‌తో పోలిస్తే, న‌ట‌న‌లో చాలా మెచ్యూరిటీ క‌నిపిస్తుంది.


లావ‌ణ్య ఈ చిత్రంలో గ్లామ‌ర్ తో పాటు, పెర్ఫామెన్స్ ప‌రంగా కూడా ఒక మెట్టు ఎక్కువ స‌క్సెస్ అయింది. ప్రేమించిన అబ్బాయి ఎదురుగా ఉన్నా, త‌న ప్రేమ‌ను చెప్ప‌లేని నిస్స‌హాయ ప్రేమ‌కురాలిగా చాలా బాగా చేసింది. ముఖ్యంగా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే రావు ర‌మేష్, ఎప్ప‌టిలాగే త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రాణం పోశాడు. ప్ర‌కాశ్ రాజ్ కొద్ది సేపే అయినా, త‌న స్టైల్ లో అంద‌రినీ క‌ట్టిప‌డేశాడు. ప్ర‌భాస్ శ్రీను, అలీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో విజ‌యం సాధించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, ప్ర‌గ‌తి, ర‌ణ‌ధీర్ త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.


సాంకేతిక నిపుణులు..
త‌మ‌న్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద హైలైట్. పాట‌ల‌తో పాటూ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాను చాలా చోట్ల నిల‌బెట్టాడు. ప్ర‌తీ లొకేష‌న్ నూ త‌న కెమెరా క‌న్నుతో ఎంతో అందంగా చూపించడంలో కెమెరామెన్ స‌క్సెస్ అయ్యాడు. ఎడిటింగ్ లో ఎక్క‌డా బోర్ కొట్టించ‌కుండా, త‌న క‌త్తెరకు బాగానే ప‌ని చెప్పాడు ఎడిట‌ర్. ఇక సినిమా నిర్మించ‌డంలో, త‌న కొడుకు సినిమాకు ఎక్క‌డ ఎంత కావాలో, అంత ఖర్చు పెట్టి, సినిమాను గ్రాండ్ గా ప్రెజెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది గీతా ఆర్ట్స్.


చివ‌ర‌గా..
మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు త‌మ అమ్మాయిని డ‌బ్బున్న వాళ్ల ఇంటికి కోడ‌లిగా పంపించాలనుకుంటారు కానీ, అక్క‌డ డ‌బ్బు మాత్ర‌మే ఉంటుందంటే, ఏ తండ్రీ త‌న కూతురిని అలాంటి ఇంటికి పంపించడు అన్న పాయింట్ కు వినోదం జోడించి, మంచి కుటుంబ క‌థా చిత్రంగా తెర‌కెక్కిన ఈ చిత్రంతో సినిమా యూనిట్ స‌క్సెస్ అయింద‌నే చెప్పొచ్చు.


పంచ్ లైన్ః శ్రీర‌స్తు..శుభ‌మ‌స్తు..అంటూ అంద‌రూ దీవిస్తారు


Filmjalsa Rating : 3/5