రోగ్ సినిమా రివ్యూ


ఇండ‌స్ట్రీకి కొత్త హీరోను ప‌రిచయం చేయాలంటే ముందుగా గుర్తొచ్చే డైరక్ట‌ర్స్ లో పూరీ జ‌గ‌న్నాథ్ ఒక‌రు. చిరుత తో రామ్ చ‌ర‌ణ్ ను పూరీ ఎలా లాంఛ్ చేశారో అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. నాల్రోజుల్లో క‌థ‌ను రాయ‌డం, అంతే స్పీడ్ గా స్టార్ హీరోతో సైతం సినిమాల‌ను తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. ఆ ప్ర‌య‌త్నంలో తీసిన సినిమాలు అయితే బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ లేకుంటే డిజాస్ట‌ర్స్. టెంప‌ర్ విజ‌యం తర్వాత తీసిన జ్యోతి ల‌క్ష్మి, లోఫ‌ర్,ఇజం ఈ మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను సొంతం చేసుకుని ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయిన‌వే..అయితే ఇప్పుడు పూరీ ఇషాన్ అనే మరో కుర్రాడిని రోగ్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు పరిచ‌యం చేశాడు. మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థగా ప్ర‌మోట్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మ‌న సమీక్ష‌లో చూద్దాం.


క‌థ‌లోకి వెళితే, 

ఏ ప‌నీ లేకుండా రోగ్ గా తిరిగే ఇషాన్ ఏంజెలా తో ప్రేమ‌లో ఉంటాడు. ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ల‌వుతున్న నేప‌థ్యంలో వాళ్ల ఇంటికి వెళ్లి గొడ‌వ‌ప‌డ‌తాడు. అక్క‌డ ఉన్న పోలీసుల్ని కొట్టే ప్ర‌య‌త్నంలో ఒక కానిస్టేబుల్ కాళ్ళు విర‌గ్గొడ‌తాడు. పోలీసుల‌ను కొట్టిన ఇషాన్ కు రెండేళ్ల జైలు శిక్ష ప‌డుతుంది. రెండేళ్ల త‌ర్వాత బ‌య‌టికొచ్చిన ఇషాన్ కు త‌న వ‌ల్లే కాళ్లు కోల్పోయిన కుటుంబం గురించి తెలుసుకుని వాళ్ల‌కు సాయ‌ప‌డ‌టానికి రిక‌వ‌రీ ఏజెంట్ గా, ఆటో న‌డుపుతూ డ‌బ్బు సంపాదించి ఆ కుటుంబానికి ఆస‌రాగా నిలుస్తాడు. త‌న అన్న‌ను గాయ‌ప‌రిచిన ఇషాన్ ను మొద‌టి ద్వేషించిన మ‌న్నారా చోప్రా, త‌న కుటుంబానికి చేసిన సాయం తెలుసుకుని ప్రేమిస్తుంది. ఇదిలా ఉండ‌గా మ‌న్నారా చోప్రాను, ఒక సైకో(అనూప్ సింగ్) ప్రేమిస్తున్నానంటూ జైలు నుంచి త‌ప్పించుకుని వ‌స్తాడు. ఆ సైకో నుంచి కానిస్టేబుల్ కుటుంబాన్ని ఎలా కాపాడాడు అన్న‌దే క‌థ‌.  


న‌టీన‌టుల ప్ర‌తిభః

 ఇండ‌స్ట్రీకి చాలా మంది కుర్రాళ్లు హీరోల‌వుదాం అనుకుని వ‌స్తుంటారు. కానీ అందులో కొంద‌రే అన్ని ఎదురుదెబ్బ‌లను ఎదుర్కొని నిల‌బ‌డ‌గ‌ల‌రు. ఇషాన్ చూడ్డానికి చాలా బాగున్నాడు. ఒక హీరోకి కావాల్సిన రూపు రేఖ‌లు, ఒడ్డూ పొడ‌వులూ అన్నీ ఉన్నోడు. స్క్రీన్ ప్రెజెన్స్ కి కూడా లోటు లేదు. యాక్ష‌న్ సీన్స్ లోనూ, మాస్ ఆడియ‌న్స్ కు కావాల్సిన అన్నీ యాంగిల్స్ ను త‌న మొద‌టి సినిమాలోనే చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. పూరీ మార్క్ హీరోయిజం చూపించ‌డంలో కూడా ఇషాన్ సరిగ్గా స‌రిపోయాడు. నిజం చెప్పాలంటే సినిమా మొత్తాన్ని త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడ‌నే చెప్పాలి. ఒక లేత హీరోపై త‌ల‌కు మించిన పెద్ద భారమే పెట్టాడు పూరీ. సాన బ‌డితే స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయి. పూరీ సినిమా కాబ‌ట్టి గ్లామ‌ర్ షో ఉండాలి. అందుకే ఏంజెలా అన్న‌ట్లు ఉంది. మ‌రీ మొద‌టి సాంగ్ లో ఏంజెలా ను అలా చూపించ‌డం అంటే అది ఒక్క పూరీకే చెల్లుతుంది. మ‌న్నారా చోప్రా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. సైకోగా అనూప్ సింగ్ న‌ట‌న మెప్పిస్తుంది.మిగ‌తా వారిలో పోసాని, తుల‌సి, అలీ, సుబ్బ‌రాజు ఇలా ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు. 


విశ్లేష‌ణః

త‌న‌ కెరీర్‌లో ఒక‌ప్పుడు స్టార్ డైర‌క్ట‌ర్ గా ఒక వెలుగు వెలిగిన పూరీ, గ‌త మూడు సినిమాలుగా అదే పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని, రోట్లో వేసి దానికి కొంచెం గ్లామ‌ర్ షో ను జోడించి ప్రేక్ష‌కుల మీద రుద్దుతున్నాడు. హీరోను కొత్త‌గా ప్రెజెంట్ చేయడం అంటే కేవ‌లం ఒక్క లుక్ మారిస్తే స‌రిపోదు. త‌న బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, త‌న క్యారెక్ట‌రైజేష‌న్ ఇలా మొత్తం మార్చేయాలి. అలా కాకుండా నా పంథా నాదే, నా దారి నాదే అంటే ఇంతే ఉంటుంది. ఒక్క టెంప‌ర్ లో త‌ప్పించి, మిగతా అన్నీ పూరీ సినిమాల్లోనూ హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఒకేలా ఉంటుంది. హీరో ను ర‌ఫ్ అండ్ ట‌ఫ్ గా చూపించ‌డం, హీరోయిన్స్ గ్లామ‌ర్ షో, విల‌న్ తో కామెడీ, అలీతో ఓ స్పెష‌ల్ కామెడీ ట్రాక్ ,బీచ్ లో పాటలు ఇవే క‌దా పూరీ సినిమా అంటే అని అంద‌రూ అనుకునే స్థాయికి ప‌డిపోయాడు  పూరీ. పోనీలే రోగ్  తో అయినా మెప్పిస్తాడు అనుకుంటే ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఫాలో అయ్యాడు. ఎప్పుడూ పూరీ త‌న క‌లంతో చేసే మ్యాజిక్ కూడా ఈసారి మిస్ అయింది. ఏదో ఒక సినిమాలో విల‌న్ తో కామెడీ అంటే బాగుంటుంది. కానీ ప్ర‌తీ సినిమాలో ఇదే చేస్తే వికార‌మ‌వుతుంది. ఎవ‌రైనా కామెడీ చేస్తే ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొర‌కాలి కానీ, చిరాకు రాకూడ‌దు. ఫ‌స్టాఫ్ అంతా కొంచెం స‌ర‌దా స‌ర‌దాగా ఉన్నా, సెకండాఫ్ మ‌రీ బోర్ కొట్టిస్తుంది. ఓవ‌రాల్ గా చెప్పాలంటే పూరీ క‌థ‌, క‌థ‌నంగా ప‌ర‌మ రొటీన్ గా, చాలా బోరింగ్ గా ఉన్నాయి. ముఖేష్ సినిమాటోగ్రఫీ బాగుంది. సునీల్ క‌శ్య‌ప్ అందించిన పాటలు సో..సో.. గా ఉన్నా, నేప‌థ్య సంగీతం తో ఆక‌ట్టుకున్నాడు. ఎడిటింగ్ సినిమా రేంజ్ కు త‌గ్గ‌ట్టు ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 


ఇషాన్, అనూప్ న‌ట‌న‌

నేప‌థ్య సంగీతం

సినిమాటోగ్ర‌ఫీ


మైన‌స్ పాయింట్స్ః 


రొటీన్ స్టోరీ

డైర‌క్ష‌న్

మ్యూజిక్


చివ‌ర‌గా,

మ‌రో చంటిగాడి ప్రేమ‌క‌థ‌గా ఇడియ‌ట్ సినిమాతో పోల్చుకున్న రోగ్, కేవ‌లం టైటిల్స్ కొంచెం ఒకేలా ఉంటాయి త‌ప్పించి, అస‌లు ఆ సినిమాలో ఒక్క సీన్ కు కూడా ఈ సినిమా స‌రితూగ‌దు. ఇషాన్ నుంచి మంచి న‌ట‌న‌, హీరోయిన్స్ గ్లామ‌ర్ షో, పూరీ రొటీన్ టేకింగ్‌తో సినిమా ప్రేక్ష‌కుల‌ను నిరుత్సాహ ప‌రుస్తుంద‌నే చెప్పాలి.


పంచ్‌లైన్ః పూరీ మార్క్ రొటీన్ సినిమా


ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః2.5/5