'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ


ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే హై ఎన‌ర్జిటిక్ మాస్ హీరో ర‌వితేజ దాదాపు రెండున్న‌రేళ్లుగా సినిమా తీయ‌కుండా, ఇప్పుడు  అంధుడిగా ఒక కొత్త అవ‌తార‌మెత్తి సినిమా చేస్తున్నాడంటేనే వినడానికి చాలా ఆస‌క్తిక‌రంగా ఉంది. 'ప‌టాస్', 'సుప్రీమ్' వంటి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాల‌ను అందుకున్న అనిల్ రావిపూడి డైర‌క్ష‌న్ లో ''రాజా ది గ్రేట్'' అనే సినిమా చేయ‌డం, ఈ సినిమాను దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత నిర్మిస్తుండ‌టంతో సినిమాకు చాలానే క్రేజ్ వ‌చ్చింది. మ‌రి ఇంత క్రేజ్ తో దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను ఎంత‌వ‌ర‌కు అందుకుందో చూద్దాం.

క‌థః 
సిన్సియ‌ర్ పోలీసాఫీస‌ర్ అయిన ప్ర‌కాష్ రాజ్ కూతురు ల‌క్కీ ఒక కేసు విష‌యంలో విల‌న్ త‌మ్ముడైన దేవను ప‌ట్టుకోవ‌డానికి సాయం చేస్తుంది. దేవ‌ను పోలీసులు చంపేడంతో ప్ర‌కాష్ రాజ్ ను చంపేసి, దానికి కార‌ణ‌మైన ల‌క్కీని కూడా చంపడానికి తెగ ట్రై చేస్తుంటే ల‌క్కీ మాత్రం వారికి దొర‌క్కుండా త‌ప్పించుకుని దూరంగా వెళుతుంది. ఎలాగైనా పోలీస్ అవ్వాల‌న్న కోరిక‌తో చూపులేని రాజా(ర‌వితేజ‌) ఆ అమ్మాయిని కాపాడ‌డానికి సీక్రెట్ మిష‌న్ లో చేర‌తాడు. అస‌లు దేవానుండి చూపులేక‌పోయినా రాజా ల‌క్కీని ఎలా కాపాడాడు అన్న‌దే సినిమా క‌థ‌.

నటీన‌టుల ప్ర‌తిభః 
గ‌త కొద్ది కాలంగా ప‌రాజయాల‌తో ఇబ్బంది ప‌డుతున్న ర‌వితేజ‌కు ఈ సినిమా మాంచి బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పుకోవాలి. రెండున్న‌రేళ్ల గ్యాప్ వ‌చ్చినా కూడా ర‌వితేజ ఎనర్జీ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అస‌లు అంధుడి పాత్ర‌ను ఎంతో అల‌వోక‌గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ర‌వితేజ చేసిన సినిమాల్లో ఈ సినిమా త‌న‌కు కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. మెహ‌రీన్ న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ప్ర‌కాష్ రాజ్ పాత్ర త‌క్కువ స‌మ‌య‌మే ఉన్నా గుర్తుండిపోతుంది. రాజా త‌ల్లిగా రాధిక చాలా బాగా చేసింది. బ‌హుశా ఆమె ఆ  క్యారెక్ట‌ర్ చేయ‌డం వ‌ల్లే రాజా తల్లి పాత్ర‌కు అంత గుర్తింపు వ‌చ్చిందేమో. విల‌న్ పాత్ర‌లో చేసి వివేనా బాటేనా ఫ‌ర్లేద‌నిపిస్తాడు. సంపత్ రాజ్ క్యారెక్ట‌రైజేష‌న్ కాస్త కామెడీ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో వెండితెర తెరంగేట్రం చేసిన ర‌వితేజ కొడుకు మ‌హాధ‌న్ రాజా చిన్నప్ప‌టి పాత్ర‌లో చాలా బాగా చేశాడు. మిగిలిన వారిలో రాజేంద్ర ప్ర‌సాద్, సాయి కుమార్, పోసాని, శ్రీనివాస రెడ్డి, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగానే చేశారు. 
 
ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభః 
అసలు ఏ మాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ‌ను తీసుకుని, కేవ‌లం హీరో కు అంధ‌త్వం ఉండ‌ట‌మే కీ స్టోరీ గా పెట్టుకున్న అనిల్ రావిపూడి త‌న స్క్రీన్ ప్లే తో ప్రేక్ష‌కుల‌ను బాగా ఇంప్రెస్ చేశాడు. త‌న మొద‌టి సినిమా నుంచే క‌మ‌ర్షియ‌ల్ డైర‌క్ట‌ర్ అనిపించుకున్న అనిల్, హీరోకు చూపు లేక‌పోయినా, ఆ హీరోతో క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేయొచ్చ‌ని నిరూపించాడు. ప్రేక్ష‌కుల ప‌ల్స్ బాగా తెలుసు కాబ‌ట్టే, సినిమా కాస్త డ‌ల్ అవుతుంద‌న్న టైమ్ లో సెకండాఫ్ లో 'గున్నా గున్నా మావిడి' అంటూ ఒక్క పాట పెట్టి సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. అంతేకాదు హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కోసం అనిల్ చాలానే రీసెర్చ్ చేశాడ‌ని కూడా మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. సినిమాకు డైలాగులు కూడా బాగానే రాసుకున్నాడు అనిల్. ''సహాయం చెయ్యాలంటే రూపాయి ఖ‌ర్చు పెట్టాలి. కానీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు ఫ్రీ నే క‌దా. పంచితే ఏమ‌వుతుంది'' అంటూ హీరోయిన్ ను త‌న బాబాయ్ ల‌కు ద‌గ్గ‌ర చేసే స‌న్నివేశం ఆక్టట్టుకుంటుంది. ''నీ బాడీలో నీకు అవ‌స‌రం లేనిది ఏంటి అన‌గానే నా క‌ళ్లు'' అని చెప్తుంది రాజా పాత్ర అంటుంది అంటే ఆ పాత్రలోకి అనిల్ ఎంత‌గా ఇన్వాల్వ్ అయితే ఇలాంటి మాట‌లొస్తాయ‌నేది అర్థ‌మవుతుంది. ''నీ వెన‌కాల ఎంత‌మంది ఉంటే ఏంటి?  నాకు క‌న‌బ‌డ‌దు. పుట్టిన ద‌గ్గ‌ర నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నా ఐయామ్ ఎ వారియ‌ర్'' అని ర‌వితేజ చెప్పే డైలాగ్స్ బావున్నాయి. సుప్రీమ్ సినిమాలో 'అమేజింగ్.. జింగ్ జింగ్' అంటూ ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా 'ఇట్స్ లాఫింగ్ టైమ్ హుహుహుహూ' అనే లైన్ ను అయితే వాడారు కానీ ఈ లైన్ మాత్రం క్యాచీ గా అనిపించ‌లేదు. అంతేకాదు రాజేంద్ర‌ప్ర‌సాద్, పోసాని, శ్రీనివాస రెడ్డి లాంటి ఆర్టిస్టు ల‌ను ఉంచుకుని కామెడీని కేవ‌లం ర‌వితేజ‌కు వ‌దిలేయడం బాలేదు. కొంత‌మందికి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, త‌మ ప‌ని మీద ఎంత న‌మ్మ‌క‌మున్నా కొన్ని కొన్ని సెంటిమెంట్ల‌ను మాత్రం ఫాలో అవుతూ ఉంటారు. అలాంటి సెంటిమెంటే మ‌న డైర‌క్ట‌ర్ కు కూడా ఉన్న‌ట్లుంది. ప‌టాస్ సినిమా హీరోయిన్ తో సుప్రీమ్ లో ఒక పాట చేయించిన అనిల్, ఇప్పుడు రాజా ది గ్రేట్ కోసం సుప్రీమ్ హీరోయిన్ రాశీని రంగంలోకి దింపాడు. క‌థ ఏమైనా డిమాండ్ చేసిందా అంటే అదేమీ లేదు. చూస్తుంటే ఇది సెంటిమెంట్ లానే ఉంది. 

సాంకేతిక నిపుణులుః 
మోహ‌న‌క్రిష్ణ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ముఖ్యంగా డార్జిలింగ్ అందాల‌ను ఆయ‌న కెమెరాతో బాగా చూపించ‌గ‌లిగాడు. సాయి కార్తీక్ పాటలు పెద్ద‌గా ఆక‌ట్టుకోవు. నేప‌థ్య సంగీతం మాత్రం బాగుంది. హీరో క్యారెక్ట‌రైజేష‌న్ కు సాయి కార్తీక్ అందించిన థీమ్ మ్యూజిక్ రాజా క్యారెక్ట‌ర్ ను మ‌రింత ఎలివేట్ అయ్యేలా చేసింది. ఎడిటింగ్ బాగానే ఉంది. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ వారి నిర్మాణ విలువ‌లు ఎప్ప‌టిలాగానే ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా చాలా బావున్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్ః 
రవితేజ  
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 
ఎంట‌ర్‌టైన్‌మెంట్

మైన‌స్ పాయింట్స్ః 
రొటీన్ స్టోరీ
పాట‌లు

పంచ్‌లైన్ః 'రాజా ది గ్రేట్' అని ఆడియ‌న్స్ క‌న్సిడ‌ర్ చేసేస్తారు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5