Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

పెళ్లి చూపులు మూవీ రివ్యూ2014వ సంవ‌త్స‌రంలో సైన్మా అని ఒక షార్ట్ ఫిల్మ్ యూ ట్యూబ్ లో రిలీజ్ అయిన తర్వాత‌, ఒక్క‌సారిగా ప‌రిశ్ర‌మ అంతా ఏంటా సైన్మా..? బాగా తీశాడంట‌..! అద్భుత‌మైన క్వాలిటీతో తీశాడంట…! అని మాట్లాడుకున్నారు. ఈ సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ కి వ్యూస్ కూడా త‌క్కువేం రాలేదు. ల‌క్ష‌ల్లో వ‌చ్చాయి. ఎప్పుడో కామెడీ సీన్ల కోసం వాడుకునే తెలంగాణ భాష ,యాస‌తో 27ని.ల నిడివితో షార్ట్ ఫిల్మ్ తీసి అంద‌రి మ‌న్న‌న‌లు అందుకోవ‌డం ఆ రోజుల్లో ఆషామాషీ విష‌యం కాదు.


కేవ‌లం ల‌క్షా 60 వేల రాపాయ‌ల‌తో వికారాబాద్ ద‌గ్గ‌ర‌లో కొంప‌ల్లి అనే గ్రామంలో బ్లాక్ మ్యాజిక్ అని కెమెరాతో కొత్త టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసి, దాదాపు థియేట‌ర్ ప్రొజెక్ష‌న్ క్వాలిటీతో చేసి ప‌రిశ్ర‌మ‌ అంతా త‌న గురించి మాట్లాడుకునేలా చేశారు సైన్మా టీమ్.
ఏంటి..? పెళ్లి చూపులు రివ్యూ అని చెప్పి ఈ సోదంతా ఏంటి అని కంగారు ప‌డుతున్నారా..
ఏం లేదండి.. ఇప్పుడు దాదాపు అదే టీమ్ షార్ట్ ఫిల్మ్ నుంచి ఫీచ‌ర్ ఫిల్మ్ కు ప్ర‌మోట్ అయ్యి అదే క్వాలిటీతో, అదే ధైర్యంతో తీసిన సినిమానే ఈ పెళ్లిచూపులు.
అస‌లు ఈ రోజుల్లో రిలీజ్ కు ముందు ఎవ‌రికైనా సినిమా చూపించాలంటేనే నిర్మాత భ‌యప‌డతాడు. ఎందుకంటే ఎంత మంచి సినిమా చేసినా అందులో ఏదో ఒక లోపం ఉంటుంది. చూసిన వాళ్లు ఆ లోపాల‌ను వెతుకుతూనే ఉంటారు. రిలీజ్ కు ముందే సినిమా చూపిస్తున్నాడంటే ఇత‌ను అంత పోటుగాడా… అంత బాగా తీశాడా… చూద్దాం అస‌లు ఏం తీశాడో … అని నెగిటివ్ మైండ్ తో చూసేవాళ్లే చాలా ఎక్కువ‌. సో ఇలాంటి వాళ్లు సినిమాలో ఉన్న లోపాల‌ను బ‌య‌ట‌కు చెప్పి సినిమాను ఎక్క‌డ చంపేస్తారో అని ఎవ‌రూ కూడా రిలీజ్ కు ముందే సినిమా చూపించే సాహ‌సం చేయ‌రు.
కానీ ఈ పెళ్లిచూపులు టీమ్ మాత్రం, జులై 29 న విడుద‌ల చేయాల్సిన సినిమాను గ‌త 15రోజులుగా ఇండస్ట్రీలోని పెద్ద‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్లకు, మీడియా ప‌ర్స‌న్స్ కు అంద‌రికి హైద‌రాబాద్ లో స్పెష‌ల్ షోలు వేస్తూనే ఉన్నారు. అలాగే మ‌న తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌ధాని విజ‌య‌వాడ‌లో కూడా ప్రీమియ‌ర్ షోలు వేసి సినిమా మీద వాళ్ల‌కు ఉన్న ధైర్యాన్ని చూపించారు. ఇంత ధైర్యంగా షోలు వేసిన ఈ చిత్రాన్ని చూసిన వాళ్లు ఏమంటున్నారో… గ‌త ప‌ది రోజులుగా ఈ చిత్రానికి వ‌స్తున్న పాజిటివ్ బ‌జ్ తోనే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


అస‌లు ఈ చిత్రంలో ఏముంది..?, అంత గొప్ప క‌థ‌నా..?, ద‌ర్శ‌కుడు అంత బాగా తీశాడా..? మ‌న స‌మీక్ష‌లో చూద్దాం..


క‌థ విష‌యానికి వ‌స్తే..
నిజంగా ఇదేమీ గొప్ప క‌థ కాదు. ఇలాంటి క‌థ‌లు మాగ్జిమ‌మ్ సినిమాల్లో చూసే ఉంటాము. బీటెక్ పాస్ అవ‌డానికి నానా తంటాలు ప‌డుతున్న త‌న కొడుక్కి పెళ్లి చేస్తే అయినా సెట్ అవుతాడ‌ని పెళ్లి చూపుల‌కు బ‌యలుదేరుతారు. కానీ పొర‌పాటుగా అడ్ర‌స్ మారి ఒక అమ్మాయిని చూసే బ‌దులు, మ‌రో అమ్మాయిని చూస్తాడు మ‌న హీరో. త‌రువాత పొర‌పాటు తెలుసుకుంటాడు కానీ ఈ లోపే అనుకోని ప‌రిస్థితుల్లో ఒక‌రి గురించి ఒక‌రు పూర్తిగా తెలుసుకుంటారు. కానీ మ‌న హీరో డ‌బ్బుకు ప్రాధాన్య‌మిస్తూ క‌ట్నం కోసం కాబోయే మామ పెట్టిన కండిష‌న్ తో, హీరోయిన్ తో క‌లిసి బిజినెస్ చేయాల్సి వ‌స్తుంది. ఆ ప్ర‌యాణంలో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది, చివ‌రికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడా, త‌నకు కాబోయే మామ పెట్టిన కండిష‌న్ కు రీచ్ అయ్యాడా లేదా అన్న‌దే ఈ చిత్రం.


సైన్మా షార్ట్ ఫిల్మ్ ద్వారా త‌ను అంద‌రిలా కాదు కొత్త‌గా తీయాలి, కొత్త‌గా చూపించాలి అని ఋజువు చేసుకుని, మొద‌టిసారి ఫీచ‌ర్ ఫిల్మ్ చేస్తున్నా, సింపుల్ క‌థ‌తో కూడా అద్భుతాలు సృష్టించ‌గ‌ల‌ను అని ఋజువు చేసుకున్నాడు డైర‌క్ట‌ర్. ఈయ‌న గురించి చెప్పాలంటే ముందుగా క‌థ‌కు త‌గ్గ న‌టీన‌టులను ఎంచుకోవ‌డంలోనే స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్పుకోవాలి. ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం తో మ‌న‌కు ప‌రిచ‌యం అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ ను హీరోగా, ప్రేమ ఇష్క్ కాద‌ల్, నా రాకుమారుడు చిత్రాల ద్వారా మ‌నకు తెలిసిన రీతూ వ‌ర్మ ను హీరోయిన్ గా, ఒక కీల‌క పాత్ర‌కు నందు ను, ఎంపిక చేసుకుని వాళ్ల నుంచి త‌న‌కు కావాల్సిన న‌ట‌న‌ను ఎంతో బాగా రాబ‌ట్టుకోగ‌లిగాడు. ముఖ్యంగా క‌థ‌నంలో ప్రేక్ష‌కుడికి ఎక్కడా బోర్ కొట్టించకుండా సినిమాలో ఎంట‌ర్ టైన్ మెంట్ పెట్టి ప్రేక్ష‌కుల‌ను కావాల్సినంత వినోదాన్ని అందించగ‌లిగాడు. ఎక్క‌డా కూడా అతిగా లేకుండా, స‌హ‌జ‌మైన క్యారెక్ట‌రైజేష‌న్ తో మెప్పించాడు.


సినిమాలో ప్ర‌తి పాత్ర తెలంగాణ యాస‌లోనే మాట్లాడుతుంది. ఎక్కడా కూడా ఆ యాస మిస్ అవ‌కుండా, చివ‌ర‌కు ఎమోష‌న్ సీన్ల‌లో కూడా అదే యాస‌తో కంటిన్యూ చేయ‌డంతో ప్ర‌తి పాత్ర బాగా ఆక‌ట్టుకుంటుంది. మొద‌టి సినిమాతోనే త‌న‌కంటూ ఒక కొత్త స్టైల్ ను క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో త‌రుణ్ భాస్క‌ర్ కూడా చేర‌తాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. డైలాగ్స్ కూడా వెరీ నేచుర‌ల్ గా ఉన్నాయి.


అలాగే కౌషిక్ క్యారెక్ట‌ర్ తో నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగిన‌ప్పుడు ”బుక్ రాస్తున్నా” అంటే ‘ఏం బుక్ అన్న‌ప్పుడు’, ”నా చావు నేను చ‌స్తా, నీకెందుకు” అనే బుక్ ఇలాంటి డైలాగ్స్ ప్రేక్ష‌కుల్లో న‌వ్వులు పూయించాయి.


కెమెరా ప‌నితీరు ఎంతో అద్భుతంగా ఉంది. కానీ సెకండాఫ్ లో ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకొంచెం ప‌ని చెప్తే బాగుండేది. సంగీతం గురించి చెప్పాలంటే ఓకే. తిన‌గ తిన‌గ వేము తియ్య‌నుండు అనే వేమ‌న శ‌త‌కం లాగా, విన‌గ విన‌గ పెళ్లి చూపులు పాట‌లు కూడా న‌చ్చుతాయి. సినిమా నిర్మాణంలో కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా బాగా తీశారు. దీనికి తోడు సురేష్ బాబు, మధుర శ్రీధ‌ర్ తోడ‌వ్వ‌డంతో ఈ సినిమా మీద న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది.


ఇలాంటి చిత్రాన్ని అందించిన నిర్మాత‌లు రాజ్ కందుకూరి, య‌ష్. రంగినేని కి హ్యాట్సాఫ్ చెప్పాలి. మ‌న‌కు స‌మ‌ర్పకుడిగా చాలా చిత్రాలు అందించిన రాజ్ కందుకూరి కి ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా కూడా క‌లిసొస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


న‌టీన‌టులుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రితు వ‌ర్మ‌, త‌మ స‌హ‌జ న‌ట‌న‌తో మెప్పించారు. నిజంగా ఎక్క‌డా కూడా పాత్ర‌లు త‌ప్ప ఆర్టిస్టులుగా వాళ్లు క‌నిపించ‌రు. ర‌ఫ్ లుక్ తో నందు కి ఈ సినిమాలో మంచి పాత్ర దొరికింద‌నే చెప్పాలి. ముఖ్యంగా హీరో ఫ్రెండ్స్ గా చేసిన అభ‌య్, కౌషిక్ న‌ట‌న నేచురల్ గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో 100% స‌క్సెస్ అయ్యారు. ఈ చిత్రంతో మ‌రో ఇద్ద‌రు కమెడియ‌న్స్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు దొరికార‌ని చెప్పొచ్చు.


చివ‌ర‌గా..
చిన్న క‌థ‌ను ఎంచుకుని, దానికి అద్భుత‌మైన క‌థ‌నాన్ని జ‌త చేసి, ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచిన ఈ పెళ్లి చూపులు చిత్రాన్ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ.. సినిమా చూసి బ‌య‌ట‌కు న‌వ్వుతూ వ‌చ్చి, ఏదో తెలియ‌ని ఆనందంతో వెళ్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


పంచ్ లైన్
పెళ్లి చూపులుః మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తూనే ఉంటారు


Film Jalsa Rating : 3.75/5