'ఒక్క క్ష‌ణం' మూవీ రివ్యూ


టాలీవుడ్ లో స్టార్ స్టేట‌స్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఇప్పుడు అల్లు శిరీష్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. గ‌తంలో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో మంచి స‌క్సెస్ ను అందుకున్న శిరీష్ ఇప్పుడు 'ఒక్క‌ క్ష‌ణం' అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకున్న విఐ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ప్యార్ల‌ల్ లైఫ్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా మొద‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో మంచి ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి సినిమాతో కూడా ఒక్క‌క్ష‌ణం ప్రేక్ష‌కుల్ని అల‌రించిందా..?  శిరీష్ కు స్టార్ స్టేట‌స్ దిశ‌గా మ‌రో అడుగు ప‌డిందా..? 2017 సంవ‌త్సరానికి ఖైదీ నెం.150 తో గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పాడు మెగాస్టార్. మరి ఈ మెగా హీరో 'ఒక్క క్ష‌ణం'తో 2017 కు అంతే గ్రాండ్ గా గుడ్ బై చెప్పాడా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

క‌థేంటి అన్న‌ది టీజర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. ఇంత‌మంది మ‌నుషుల్లో చాలా మంది  జీవితాలు ప్యార్ల‌ల్ గా ఉంటాయ‌న్న దాని మీదే క‌థంతా న‌డుస్తుంది.  శ్రీనివాస్(శ్రీనివాస్ అవ‌స‌రాల‌), శ్వేత‌(సీర‌త్ క‌పూర్)ల జీవితంలో ఏదైతే జ‌రుగుతుందో జీవా(అల్లుశిరీష్), జ్యో (సుర‌భి)ల జీవితంలో కూడా జ‌రుగుతుంద‌ని గ్ర‌హించిన జీవా, జ్యోలు ఎలా త‌మకు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు..?  విధి నుంచి త‌మ జీవితాల్ని ఎలా కాపాడుకున్నార‌న్న‌దే అస‌లు క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

అల్లు శిరీష్ జీవా క్యారెక్ట‌ర్ లో చాలా బాగా ఇమిడిపోయాడు. ల‌వ‌ర్ బాయ్ గానూ, త‌న ప్రేయ‌సి కి వ‌చ్చిన క‌ష్టాన్ని ఎదుర్కొనే స‌మ‌యంలో గంభీరంగా ఉంటూ ఆక‌ట్టుకున్నాడు. గ‌త సినిమాల కంటే శిరీష్ న‌ట‌న చాలా మెరుగైంది. సుర‌భి త‌న అందంతో, అభిన‌యంతో బాగా చేసింది. త‌న భ‌విష్య‌త్తు ఏంటో ముందే తెలుసుకున్న అమ్మాయి పాత్ర‌లో బాగా మెచ్యూర్డ్ గా చేసింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అవ‌స‌రాల శ్రీనివాస్, సీర‌త్ క‌పూర్ ల గురించి. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకు ప్రాణం పోసింది వీరే. ఒక‌రి కోసం ఒక‌రు త‌మ జీవితాన్నికూడా త్యాగం చేసుకునే పాత్ర‌ల్లో ఇద్ద‌రూ చాలా బాగా న‌టించారు. ప్ర‌వీణ్‌, స‌త్య ల కామెడీ అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తుంది. మిగిలిన పాత్ర‌ల్లో రోహిణి, విశ్వ‌నాధ్, త‌దిత‌రులు త‌మ ప‌రిధి మేర బాగా న‌టించారు.


సాంకేతిక నిపుణులుః

అస‌లు సినిమాలో కొంచెం కూడా క‌థ లేకుండా ఏదోక రొటీన్ స్టోరీ తీసుకుని ప్రేక్ష‌కుడితో కాల‌క్షేపం చేపిస్తున్న డైర‌క్ట‌ర్లున్న ఈ రోజుల్లో.. ఒకే సినిమాలో రెండు క‌థ‌ల‌ను (రెండు ప్యార్లల్ క‌థ‌ల‌ను) చాలా త‌క్కువ స‌మ‌యంలో అర్థ‌మ‌య్యేట్లు తెర‌కెక్కించ‌డంలో ముందుగా ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అస‌లు  తెలుగు సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని  ప్యార్ల‌ల్ లైఫ్ ఆధారంగా సినిమా తీయాల‌న్న త‌న ఆలోచ‌న‌కే మెచ్చుకోవాలి. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే త‌ను ఏదైతే చెప్పాల‌నుకున్నాడో చెప్పేశాడు. ఇద్ద‌రి జంట‌ల జీవితాలు ఒకేలా ఎలా సాగాయి?  అస‌లు ఇద్ద‌రి జీవితాలు ఒకే మాదిరిగా సాగుతుంటాయా..?  అనే దానికి ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చాలా బాగా చూపించాడు. త‌ను రాసుకున్న క‌థ‌లో నుంచే కామెడీని కూడా పుట్టించాడు. స్క్రీన్ ప్లే లో కూడా త‌న మార్క్ చూపించాడు. కానీ సీన్స్ మాత్రం అనుకున్నంత బ‌లంగా తీయ‌లేక‌పోయాడు. ఏదో ఒక‌టి రెండు సీన్లు త‌ప్పించి, మిగిలినవ‌న్నీ స‌రైన ఎమోష‌న్ క్యారీ చేయ‌లేక‌పోయాడు. అదే ఇంకొంచెం ఎమోష‌న్ ను క్యారీ చేసుంటే సినిమా రిజ‌ల్ట్ త‌ర్వాతి స్థాయిలో ఉండేది. సాంకేతిక ప‌రంగా కూడా సినిమాకు అన్నీ బాగా కుదిరాయి. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతంలో పాటలు చెప్పుకునే లెవల్ లో లేక‌పోయిన‌ప్ప‌టికీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. ఛోటా కె ప్ర‌సాద్ ఎడిటింగ్ చాలా నీట్ గా, క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

క‌థ‌

స్క్రీన్ ప్లే

న‌టీన‌టుల  న‌ట‌న‌


మైన‌స్ పాయింట్స్ః 

బ‌లహీనమైన స‌న్నివేశాలు

ముందుగానే త‌ర్వాతి స‌న్నివేశాలు కూడా తెలియ‌డం

పాట‌లు


పంచ్‌లైన్ః ఒక్క క్ష‌ణం.. విధినే గెలిచేశారే..

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5