ఒక మ‌న‌సు రివ్యూచిన్న‌ప్పుడు అమ్మ న‌డ‌క నేర్ప‌డానికి వాడికి ఇష్ట‌మైన వ‌స్తువు ను కొంచెం దూరం గా పెట్టి ఆశ చూపించి, రా నాన్నా.. రా నాన్నా అంటూ పిలుస్తుంది. అయితే వాడు దానిమీద ఇష్టంతో ఆ వ‌స్తువును అందుకోవ‌డానికి బుడి బుడి న‌డ‌క‌లు వేసుకుంటూ మెల్లిగా వ‌స్తాడు. అయితే అమ్మ‌కు ఇక్క‌డ త‌న పిల్ల వ‌చ్చిందో లేదో మాత్ర‌మే క‌న‌ప‌డుతుంది త‌ప్ప ప‌రిగెత్తుకు వ‌చ్చాడా, మెల్లిగా న‌డిచి వ‌చ్చాడా లేక వ‌చ్చే దారిలో పడుతూ లేస్తూ వ‌చ్చాడా అన్న‌ది అమ్మ‌కు అన‌వ‌స‌రం.


అదేంటి ఏదో విష‌యం గురించి ప్ర‌స్తావిస్తున్నారు అనుకోకండి. ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు తెస్తున్నామంటే ఒక మ‌న‌సు ద‌ర్శ‌కుడు రామ‌రాజు తీసిని ముందు సినిమా మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లె పువ్వు చిత్రం చాలా నెమ్మ‌దిగా ఉంది కాబ‌ట్టి ఈ చిత్రం కూడా అలాగే ఉంటుంది అని ఎంతో మంది అనుకున్నారు, అనుకుంటున్నారు. కానీ ఇక్క‌డ ఈ సినిమా స్లో గా ఉంది అని అనుకునే వారికి ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న పాయింట్ రీచ్ అయ్యే క్ర‌మంలో్ నెమ్మ‌దనం అనేది ప్రేక్ష‌కుడికి క‌న‌బ‌డ‌క పోవ‌డం ద‌ర్శ‌కుడి ప్ర‌తిభే అని చెప్ప‌వ‌చ్చు. అమ్మ‌కు కొడుకు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి త‌న‌కు ఇష్ట‌మైంది అందుకున్న‌ప్పుడు ఎంత ఆనంద ప‌డుతుందో ప్రేక్ష‌కుడు సినిమా చూస్తున్నంత సేపు అలాంటి ఎమోష‌న‌ల్ జ‌ర్నీలోనే ఉంటాడు.


ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలొచ్చారు. వారిలో ఎక్కువ మంది తమ టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుని మంచి పొజిషన్‌కొచ్చారు. ఇంకొందరు ఫ్యూచర్‌ ఉంటుందనే కాన్ఫిడెన్స్‌ కలిగించారు. ఇప్పుడు కొత్తగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి మొట్ట‌మొద‌టి సారి ఒక హీరోయిన్ వ‌స్తుంది. నాగబాబు గారాల త‌న‌య నిహారిక ఒకమ‌న‌సుతో వెండితెర‌పై తొలి సంతకం చేసింది. మ‌ల్లెల తీరంలో సిరిమ‌ల్లెపువ్వు  వంటి కొత్త ప్రేమ‌క‌థ‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన రామ‌రాజు ఒక‌మ‌న‌సు ను ముస్తాబు చేశాడు. ఒక గొప్ప‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న కుటుంబం నుంచి, అసంఖ్యాక అభిమానులు ఆదరించే ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వ‌స్తుందంటే, అది కూడా మొట్ట‌మొద‌టి సారిగా అమ్మాయి రావ‌డం అంటే దానిపై అంచనాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకించి చెప్పన‌క్కర్లేదు. సేఫ్‌గా కమర్షియల్ సినిమాల‌ను నమ్ముకుని ఫస్ట్‌ ఎటెంప్ట్‌లో పాస్‌ అయిపోవాలనే చూస్తున్న ఈ కాలంలో ఒక మ‌న‌సు చిత్రం దీనికి భిన్నంగా కొత్త మార్గంలో సాగింది. ఈ ప్రయత్నానికి దర్శకుడు ని, రిస్క్‌ అని తెలిసినా కానీ ఎటెంప్ట్‌ చేసిన నిర్మాతలని అభినందించాలి. అయితే ప్రయత్నం ఎలాంటిది అని పక్కన పెడితే అంతిమంగా ఒక మ‌న‌సు ఎంత మందికి చేరువ‌యింది, ఎంత మేర‌కు అంద‌రి మ‌న‌సుల‌ను హ‌త్తుకోగ‌లిగింది అన్న‌దే కౌంట్ అవుతుంది.


రాజ‌కీయ నాయ‌కుడిగా చూడాలన్న త‌న తండ్రి కోరిక‌ను తీర్చ‌డ‌మే ధ్యేయంగా ఉన్న యువ‌కుడికి ఒక సాధార‌ణ యువ‌త ప్రేమ‌కు ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరో పొలిటీషియ‌న్ అవ్వాల‌న్న కోరికను హీరోయిన్ ఎందుకు వ‌ద్దంటుంది. ఈ త‌రుణంలో వారిద్ద‌రి మ‌ధ్య ఉండే గొడ‌వ‌లు, కాంప్ర‌మైజ్ లు.. అంతా బాగానే ఉంది అనుకున్న స‌మ‌యంలో హీరో అనుకోని కార‌ణాల వ‌ల్ల జైలు కు వెళ్ల‌డం, వీరి ప్రేమ‌కు దూరం ఏర్ప‌డ‌టం.. అస‌లు హీరో ఎందుకు జైలుకు వెళ్లాల్సి వ‌చ్చింది. త‌న తండ్రి కోరిక‌ను హీరో తీరుస్తాడా లేదా అన్న‌దే మిగ‌తా క‌థ‌.


ఇప్ప‌టివ‌ర‌కు ఓన్లీ ల‌వ‌ర్ బాయ్ గానే క‌నిపించిన నాగ‌శౌర్య కు ఇందులో ఒక క్లాస్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. శౌర్య ఇలా న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అని చెప్పొచ్చు. ఒక రాజ‌కీయ నాయకుడిగా ప‌రిణితి చెందిన పాత్ర‌లో అంద‌రినీ మెప్పించాడు. ఒక న‌టుడిగా త‌నను తాను ప్రూవ్ చేసుకునే అవ‌కాశాన్ని నాగ‌శౌర్య బాగా స‌ద్వినియోగం చేసుకున్నాడు.ఇప్ప‌టికే ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ్ వెబ్ సిరీస్ తో త‌న న‌ట‌న‌ను క‌న‌బ‌రిచిన నిహారిక ప్రేమ‌ను నిజాయితీగా న‌మ్మే అమ్మాయి పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. స్ర్కీన్ ప్రెజెన్స్ కి అస‌లు ఏ విధంగానూ లోటు లేదు. మొద‌టి సినిమానే ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ ను ఎంచుకోవ‌డంలో నిహారిక స‌క్సెస్ అయింది అని చెప్పొచ్చు. రావుర‌మేష్, అవ‌స‌రాల‌, కృష్ణ భ‌గ‌వాన్, వెన్నెల కిషోర్, ప్ర‌గ‌తి.. మిగ‌తా న‌టీన‌టులు త‌మ త‌మ పాత్ర‌ల‌కు పూర్తిగా న్యాయం చేశారు.


”రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, శరీరాలు కాలిపోతాయి.క‌ట్ట‌డాలు కూలిపోతాయి. కానీ మ‌న‌సులో రాసుకున్న క‌థ‌లు శాశ్వ‌తంగా ఉండిపోతాయి”, ”నీ మీద ప్రేమ చావ‌దు, మ‌రొక‌రి మీద ప్రేమా పుట్ట‌దు”, ”ఇష్టం గ‌ట్టిగా ఉంటుందేమో క‌దా సూర్య”, ”ప్రేమ‌ను బంధించకూడ‌దు”, ”రాజ‌కీయ నాయ‌కులంటే రాక్ష‌స జాతేమీ కాదు, ప్రతీ ఇంట్లోనూ రాజ‌కీయం ఉంటుంది, ర‌క్త సంబంధంలోనూ కుట్ర‌లు, కుతంత్రాలు, మోసాలు జ‌రుగుతున్నాయి. అవే రాజ‌కీయాలంటే”, ”ఎన్నో రంగుల‌ను లోప‌లే దాచుకుని, తెల్ల‌రంగును చూపించేవాడే రాజ‌కీయ‌నాయ‌కుడంటే..”
అంటూ అద్భుత‌మైన డైలాగ్స్ తో మాట‌ల ర‌చ‌యిత‌గా కూడా రామ‌రాజు స‌క్సెస్ అయ్యాడు.


సినిమాలోని ప్ర‌తి ఫ్రేమ్ ఎంతో గ్రాండ్ గా, రిచ్ లుక్ తో సినిమాటోగ్ర‌ఫీ, ఆర్ట్ డైర‌క్ట‌ర్ ప‌నితీరు ఎంతో బాగుంది. సాధార‌ణంగా ప్రేమ క‌థ‌ల‌కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యే ఆయువు ప‌ట్టు. ఆ విష‌యంలో సునీల్ క‌శ్య‌ప్ పూర్తి విజ‌యం సాధించాడు. ఇప్ప‌టి వ‌ర‌కు పాట‌లు అంటే పాట‌లు లాగే ఉండే సినిమాల్లో, ఈ సినిమాలో మాత్రం పాట‌ల్లోనే మాట‌లు కూడా క‌లిపి కొత్త ట్రెండ్ కి పునాది వేశారు. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.రామ‌రాజు గ‌త సినిమాతో పోల్చితే, ఈ సినిమా ఎడిటింగ్ ను చాలా కంట్రోల్ చేసి, ఫాస్ట్ గానే న‌డిపించాడు ఎడిట‌ర్ ధ‌ర్మేంద్ర‌.


కేవ‌లం కామెడీనే న‌మ్ముకుని సినిమాలు తీస్తున్న ఈ రోజుల్లో ఇంకొంచెం ఎంటర్‌టైన్ మెంట్ సినిమాలో ఉంటే బాగుండేది. కిషోర్ తో కామెడీ సీన్స్ ఇంకొంచెం రాసుకుని ఉండాల్సింది.


తెలుగులో మ‌రో చ‌రిత్ర‌, గీతాంజ‌లి లాంటి చిత్రాలు మ‌ళ్లీ ఎప్పుడు వ‌స్తాయా అని ఎదురుచూస్తున్న వారికి నిస్వార్థ‌మైన ప్రేమ ఎలా ఉంటుందో, ప‌రిస్థితులు ఎంతటి వారినైనా ఎలా మారుస్తుందో మ‌న జీవితాల్లోంచి మ‌న‌లో మ‌న‌కు తెలియ‌ని వాస్త‌విక‌త‌కు నిద‌ర్శ‌న‌మే ఈ ఒక‌మ‌న‌సు. నిజంగా మేధావులు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోరో, వాళ్ల‌కు తెలియని విష‌యాల‌ను మ‌న‌కంటే ఎక్కువ తెలిసిన‌ట్టు ఎలా చూపిస్తారో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. ప్రేమ‌, పెళ్లి తెలియని ద‌ర్శ‌కుడు రామ‌రాజు ఇంత‌టి అద్భుత ప్రేమ‌కావ్యం మ‌న‌కు చూపించ‌డం హ్యాట్సాఫ్ అని చెప్ప‌వ‌చ్చు.


ఇప్ప‌టి యువ‌త‌రం మ‌ధ్య ఉన్న ప్రేమ ఎలా ఉంటుందో ప్ర‌తి ఒక్క‌రూ చెప్ప‌గ‌ల‌రు. నిజంగా ఈ జ‌న‌రేష‌న్ లో ఇలాంటి ప్రేమ ఉంటుందా… ఉంటే ఎంత బాగుంటుంది అని ప్ర‌తి ఒక్క అబ్బాయి అనుకునేలా క‌నెక్ట్ అవుతారు. క్లైమాక్స్ ముందు హీరోయిన్ ఏదో చేయ‌బోతుంది అని సంకేతాలు పంపిస్తూ ప్రేక్ష‌కుడి మ‌న‌సులో తెలియ‌ని భావోద్వేగం నింప‌డంలోనే ద‌ర్శ‌కుడి గొప్ప‌త‌నం అర్థ‌మ‌వుతుంది. ఇప్ప‌టి జ‌న‌రేస‌న్ లో అస‌లు ప్రేమ అంటే ఇదా.. ఇలాంటి ప్రేమ ఒక‌టుంటుందా అని ప్ర‌తి ప్రేమికుడికి ఒక పాఠ్య‌పుస్త‌కం లాగా ఈ సినిమాను తీర్చిదిద్దారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.


ఈచిత్రంలో ఇప్ప‌టి సినిమాల్లో ఉన్న పాత చింత‌కాయ ప‌చ్చ‌డి లాంటి సీన్లు క‌నిపించ‌క పోవ‌డం నిజంగా ప్రేక్ష‌కుల‌కు ఎంతో కొత్త‌ద‌నం.. కొన్ని చిత్రాలు స‌ర‌దాగా చూస్తాం. కొన్ని చిత్రాలు మ‌నం మ‌న అభిమానం కోసం చూస్తాం.. మ‌రికొన్ని చిత్రాలు త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో కూడా చూస్తాం కాని కొన్నిమాత్ర‌మే మ‌న‌సుతో చూసేలా ఉంటాయి. అలాంటి కోవ‌లోకి వ‌చ్చే చిత్రాల్లో ఒక మ‌న‌సు కూడా ఒక‌టి అనడంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు.


 


పంచ్ లైన్ః మ‌ల్లెల తీరంలో ఒక‌మన‌సు మాయ‌


ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్: 3.5/5