'నేనో ర‌కం' సినిమా రివ్యూ


డైర‌క్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాధ్ త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి రాం శంక‌ర్ స‌రైన హిట్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు, ప్ర‌యోగం లేదు. కెరీర్ మొద‌ట్లో ఫ‌ర్వాలేద‌నిపించినా, త‌ర్వాత్త‌ర్వాత అదే ఫామ్ లో నిల‌బ‌డ‌లేక‌పోయాడు.న‌టుడిగా త‌న‌ను తాను నిరూపించుకుని మంచి మార్కులు కొట్టేస్తున్నా, ఒక ఈజ్ ఉన్న హీరోగా మాత్రం నిల‌బ‌డ‌లేక‌పోతున్నాడు. ఇప్పుడు సాయిరాం శంక‌ర్ ఆశ‌ల‌న్నీ త‌న కొత్త చిత్రం నేనో ర‌కం మీదే ఉన్నాయి. అన్న‌య్య పూరీతో పాటూ, చాలా మంది ప్ర‌ముఖులతో ఈ సినిమాని ప్ర‌మోట్ చేయించ‌డంతో నేనోరకం మీద అంచ‌నాలు పెరిగాయి. మ‌రి వీరంద‌రి ప్ర‌య‌త్నం ఫలించిందా లేదా సాయిరాం కు ఈ సినిమా అయినా విజ‌యాన్ని చేకూరుస్తుందా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.

 

క‌థ‌లోకి వెళితే, అనాథ అయిన గౌత‌మ్(సాయిరాం శంక‌ర్) స్వేచ్ఛ‌(రేష్మీ మీన‌న్)తో మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌ని గౌత‌మ్ ను స్వేచ్ఛ కూడా ప్రేమిస్తుంది. అనుకోని సంఘ‌ట‌న‌ల్లో స్వేచ్ఛ‌ను కిడ్నాప్ చేస్తాడు శ‌ర‌త్ కుమార్. త‌న‌ని వ‌ద‌లేయాలంటే అత‌ను చెప్పింద‌ల్లా చేయాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తాడు, అస‌లు శ‌ర‌త్ కుమార్ స్వేచ్ఛ‌ను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు, శ‌ర‌త్ కుమార్ బారి నుంచి స్వేచ్ఛ‌ను గౌత‌మ్ ఎలా కాపాడాడు అన్న‌దే క‌థ‌.


న‌టీన‌టుల విష‌యానికొస్తే, ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సాయిరాం శంక‌ర్ ఈసినిమాలో గౌత‌మ్ పాత్ర‌లో స‌రిగ్గా స‌రిపోయాడు. అటు ల‌వ‌ర్ బాయ్ గా, ఇటు ప్రేయ‌సి కోసం ప్రాణ‌త్యాగానికైనా వెనుకాడ‌ని వాడిగా బాగా చేశాడు. హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీని మెయింటైన్ చేసిన సాయిరాం సెకండాఫ్ లోని కొన్ని సీన్స్ లో మంచి ఎమోష‌న్స్ ను క్యారీ చేశాడు.హీరోయిన్ ర‌ష్మి మీన‌న్ లుక్స్ ప‌రంగా బాగానే ఉంది కానీ, ఇంకా బాగా చేసి ఉండాల్సింది. ఇక చెప్పుకోవాల్సింది కీల‌క పాత్ర పోషించిన శ‌ర‌త్ కుమార్. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం బాగుంది. ఈయ‌న న‌ట‌నలోని కోణాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఎమ్మెస్ నారాయ‌ణ చేసిన ఆఖ‌రి చిత్రాల్లో ఇది కూడా ఒక‌టి. పృథ్వీ, వైవా హ‌ర్ష న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. మిగ‌తా వారు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.


 

ప్ర‌స్తుతం స‌మాజంలో జ‌రుగుతున్న స‌న్నివేశాల‌ను తీసుకుని దాన్ని క‌థ‌గా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు సుద‌ర్శ‌న్ విజ‌యం సాధించాడ‌నే చెప్పాలి. దానికి అంతే విభిన్న‌మైన స్క్రీన్ ప్లే ను కూడా రాసుకున్న డైర‌క్ట‌ర్ సినిమాను ఆద్యంతం ఆసక్తి క‌లిగించేలా తెర‌కెక్కించాడు. చ‌క్రి త‌మ్ముడు మ‌హిత్ అందించిన పాట‌లు బాగ‌లేవు. నేప‌ధ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా సంద‌ర్భానుసారంగా వ‌చ్చే పాట‌లు క‌థను ప‌క్క‌దారి ప‌ట్టించేలా ఉంటాయి. సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. సినిమాకు మంచి థ్రిల్ ఫీల్ ను క‌లిగిస్తుంది. ఎడిట‌ర్ ఇంకొంచెం త‌న క‌త్తెర‌కు ప‌నిచెప్పి ఉంటే, సినిమా వేరే స్థాయిలో ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

సాయిరాం శంక‌ర్, శ‌ర‌త్ కుమార్ ల న‌ట‌న‌

స్క్రీన్ ప్లే


మైన‌స్ పాయింట్స్ః 

హీరోయిన్ న‌ట‌న‌

పాట‌లు

స్లో నెరేష‌న్

 

పంచ్‌లైన్ః అదో ర‌కం 

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5