'నేనే రాజు నేనే మంత్రి' మూవీ రివ్యూ


బాహుబ‌లి  త‌ర్వాత డైన‌మిక్ హీరో రానా ద‌గ్గుబాటికి ఇమేజ్ మ‌రింత పెరిగింది. దీంతో అత‌ని సినిమాల‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు  కూడా భారీగానే నెల‌కొంటున్నాయి. తాజాగా ఆయ‌న హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో చాలా రోజుల త‌ర్వాత సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన చిత్రం నేనే రాజు నేనే  మంత్రి. గ‌త కొన్ని సినిమాలుగా హిట్లు లేక ప‌రాజయాల‌తో ఫ్రెండ్ షిప్ చేస్తున్న తేజ క‌ల‌ల‌న్నీ ఈ సినిమాపైనే పెట్టుకుని మ‌రీ ఈ చిత్రాన్ని నిర్మించాడు. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ఏంటో చూద్దాం

క‌థః 
వ‌డ్డీ వ్యాపారాలు చేసుకునే జోగేంద్ర‌(రానా)కు , భార్య రాధ‌(కాజ‌ల్) అంటే ప్రాణం. ఏం చేసినా త‌న కోస‌మే అనుకుని బ్ర‌తుకుతున్న జోగేంద్ర కొన్ని కార‌ణాల వ‌ల్ల రాజకీయాల్లోకి వ‌స్తాడు. అస‌లు త‌ను రాజ‌కీయాల్లోకి రావాల్సిన ప‌నేంటి?  రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా రాధ‌ను అంతే ప్రేమిస్తాడా? మ‌ధ్య‌లో దేవికారాణి(కేథ‌రిన్) ఎవ‌రు?  జోగేంద్ర చివ‌ర‌కు రాజ‌కీయాల్లో నెగ్గుతాడా లేదా అన్న‌దే అస‌లు క‌థ‌.

నటీన‌టుల ప్ర‌తిభః 
అస‌లు ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ ఏంట‌య్యా అంటే అది రానాయే. సినిమా మొత్తాన్ని త‌న భుజాలపై నడిపించాడు.  బాహుబ‌లి, ఘాజీ సినిమాల త‌ర్వాత వాటికి ధీటైన న‌ట‌న‌తో మ‌రోసారి మెప్పించాఉ రానా. జోగేంద్రా ఆయ‌న ఒదిగిపోయాడు.  స్టార్ లీగ్ కు వెళ్లే క్వాలిటీస్ రానాలో బాగానే ఉన్న‌య‌ని ఈ చిత్రంలో ఆయ‌న న‌ట‌న చెబుతుంది. కాజ‌ల్ రాధ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోయింది. త‌న హూందాత‌నం, భావోద్వేగాల‌తో కూడిన న‌ట‌న సినిమాకు ప్ల‌స్.కేథ‌రిన్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర‌లో ఎంత కావాలో అంత చేసింది. అశుతోష్ రానా, ప్ర‌దీప్ రావ‌త్, పోసాని, న‌వ‌దీప్, అజ‌య్ త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగా ఎఫెక్టివ్ గా న‌టించారు.  మిగ‌తావారిలో శివాజీ రాజా, జ‌బ‌ర్ధ‌స్త్ వేణు త‌మ త‌మ పాత్ర‌ల పరిధిలో బాగా చేశారు.

సాంకేతిక నిపుణులుః 
తేజ క‌థ‌కుడిగా, ద‌ర్శ‌కుడిగా ఈ సినిమాతో త‌న సత్తాని చాటాడు. అక్క‌డ‌క్క‌డా కొన్ని లాజిక్స్ మిస్ అవ‌డం అయితే జ‌రిగింది కానీ ఆయ‌న ప్ర‌తీ క్యారెక్ట‌ర్ డిజైన్ చేసిన విధానం, ముఖ్యంగా జోగేంద్ర పాత్ర‌ను ఆయ‌న తెర‌పై మ‌లచిన తీరు, రాధ జోగేంద్ర ల ప్రేమను న‌డిపిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. ల‌క్ష్మీ భూపాల్ రాసిన మాట‌లు విన‌డానికి బావున్నాయి కానీ,  ఏదో సామెత‌ల పుస్త‌కం ప‌క్క‌న పెట్టుకుని మాట‌లు రాసిన‌ట్ల‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు బావున్నాయి. రీరికార్డింగ్ సినిమా స్థాయిని మ‌రోస్థాయికి తీసుకెళ్లింది. మొద‌టిసారిగా కొడుకుతో సినిమాను నిర్మించిన సురేష్ బాబు, ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా సినిమాకు ఎంత అవ‌స‌ర‌మో అంత ఖ‌ర్చు పెట్టారు. 

ప్ల‌స్ పాయింట్స్ః 
రానా న‌ట‌న‌
కాజ‌ల్,రానా కెమిస్ట్రీ 
మాట‌లు
సంగీతం

మైన‌స్ పాయింట్స్ః 
లాజిక్స్ మిస్ అవ‌డం
ఎడిటింగ్

పంచ్‌లైన్ః రాధా జోగేంద్ర న‌చ్చేస్తారు
ఫిల్మ్‌జల్సా రేటింగ్ః 3/5