'న‌క్ష‌త్రం' మూవీ రివ్యూ


సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏవీ అనుకున్న‌వి అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌వు. అందులోనూ టాలీవుడ్ లో అలాంటివి చాలా అరుదు. అనుకున్న డేట్ కి సినిమాలు రావ‌డం అంటే ఈ మ‌ధ్య మ‌హా క‌ష్టంగా మారింది. ఎప్ప‌టిక‌ప్పుడు అలాంటి సినిమాలు ఉంటూనే ఉంటాయి. ఆ కోవ‌కు చెందిన సినిమా ఒక‌టి ఇప్పుడు ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఎప్పుడో రావాల్సిన సినిమా ఈ న‌క్ష‌త్రం. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఎప్పటిక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డుతూనే వ‌చ్చింది. సందీప్ కిష‌న్, సాయి ధ‌ర‌మ్ తేజ్, రెజీనా, ప్ర‌గ్యా జైస్వాల్, శ్రియ ఇలా కాస్టింగ్ కూడా బాగుండ‌టంతో న‌క్ష‌త్రం మీద బాగానే అంచ‌నాలున్నాయి. పైగా క్రియేటివ్ డైర‌క్ట‌ర్ కృష్ణ వంశీ నుంచి వ‌స్తున్న మ‌రో ఆణిముత్యం అని సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంతో హైప్ బాగా పెరిగిపోయింది. మ‌రి న‌క్ష‌త్రం ఆ స్థాయి అంచ‌నాల‌ను అందుకుందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం. 

 క‌థః
తాత‌ల కాలం నుంచి పోలీసు కుటుంబం కావ‌డంతో, తాను కూడా పోలీసు కావాల‌ని చిన్న‌ప్ప‌టి నుంచి అనుకుంటాడు రామారావు (సందీప్ కిష‌న్). త‌న మావ‌య్య‌(శివాజీరాజా) కూతురు రెజీనాతో ప్రేమ‌లో ఉంటాడు రామారావు. ఐస్ఐ అయితే పెళ్లి చేసుకోవాల‌ని పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకుంటుంది రెజీనా. స్వ‌త‌హాగా పోలీసుల‌ను  ఇష్ట‌ప‌డే రామారావు ఒక‌రోజు పోలీస్ క‌మీష‌న‌ర్ కొడుకు రాహుల్ (త‌నీష్)తో గొడ‌వ ప‌డ‌తాడు. రామారావు మీద ప‌గ తీర్చుకోవ‌డం కోసం అత‌ని చివ‌రి ఛాన్స్ అయిన ఎస్ ఐ ఫిజిక‌ల్ ఎగ్జామ్‌కు వెళ్ల‌నీయ‌కుండా అడ్డుప‌డ‌తాడు రాహుల్. అయినా చివ‌రికి రామారావు ఎస్ ఐ అవుతాడు. ఈ క‌థ‌లో మ‌ధ్య‌లో అలెగ్జాండ‌ర్ (సాయిధ‌ర‌మ్‌తేజ్‌), అత‌ని ప్రేయ‌సి (ప్ర‌గ్యా జైశ్వాల్‌) కూడా ఉంటారు. వారిద్ద‌రు ఎవ‌రు? వారికీ రామారావుకు సంబంధం ఏంటి? క‌మిష‌న‌ర్ (ప్ర‌కాష్‌రాజ్‌), హోమ్ మినిస్ట‌ర్ (జె.డి.చ‌క్ర‌వ‌ర్తి) మంచివారా? చెడ్డ‌వారా? అలెగ్జాండ‌ర్‌, అత‌ని ప్రేయ‌సి ఏమ‌య్యారు? ముక్తార్ భాయ్ ఎవ‌రు? వంటివ‌న్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.

న‌టీన‌టుల ప్రతిభః 
సినిమాలో ఎంత‌మంది న‌టీన‌టులున్నా, ఎవ‌రికి వారు వారి ప‌రిధిని మించే చేశారు. దీంతో వారి న‌ట‌న న‌ట‌న‌లా కాకుండా, ఓవ‌రాక్ష‌న్ లా అనిపిస్తుంది. ఇంత మంది న‌టీనటుల్లో కాస్త సెటిల్ గా పెర్ఫార్మ్ చేసిందంటే సాయి ధ‌ర‌మ్ తేజ్ నే. మిగ‌తా అంద‌రూ, త‌మ స‌హ‌జ న‌ట‌న‌ను వ‌దిలేసి ఎవ‌రికి వారు హై పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆఖ‌రికి స‌హ‌జ న‌టుడైన ప్ర‌కాష్ రాజ్ కూడా ఉన్న‌దానికంటే  ఎక్కువ న‌టించాల్సి వ‌చ్చిందంటే, ఇది ఆర్టిస్ట్ ల త‌ప్పు కాదు, సినిమా త‌ప్పు, క‌థ త‌ప్పు అని స్ప‌ష్టంగా అర్థ‌మైపోతుంది. 

సాంకేతిక నిపుణులుః 
నిజానికి న‌క్ష‌త్రం అనే సినిమా త‌న కెరీర్ కు ఎంతో కీల‌క‌మైన సినిమా. అంతటి కీల‌క‌మైన సినిమా గురించి క‌నీస జాగ్ర‌త్త కూడా తీసుకోకుండా కృష్ణ‌వంశీ ఈ సినిమా విష‌యంలో బాగా నిరాశ‌ప‌రిచాడు. ఎప్ప‌టిలాగా త‌న గ‌త చిత్రాల మాదిరిగానే క్రైమ్, ల‌వ్, దేశ‌భ‌క్తి లాంటి అంశాల‌ను క‌లిపి చూపించే ప్ర‌య‌త్నం చేసిన కృష్ణ‌వంశీ, ఈ సారి త‌న క్రియేటివిటీని మ‌రీ అతిగా వాడి, ఆక‌ట్టుకోలేక‌పోయాడు. క్లారిటీ లేని క్యారెక్ట‌రైజేష‌న్స్, ఎమోష‌న్స్ లేని సీన్స్ వెర‌సి, స‌గ‌టు ప్రేక్ష‌కుడిని క‌థ‌లో ఇన్వాల్వ్ చేయ‌లేక‌పోయాయి. అస‌లు ఫ‌స్ట్ హాఫ్ అయిపోయేవ‌ర‌కు సినిమా క‌థ‌ను స్టార్ట్ చేయ‌క‌పోవడం, కేవ‌లం గ్లామ‌ర్ షో తో సినిమా న‌డ‌వ‌డంతో సినిమా ప‌ర‌మ బోరింగ్ గా ఉంటుంది. దానికి తోడు మ‌ధ్య మ‌ధ్య‌లో ప్రేక్ష‌కుడికి చుక్క‌లు చూపించ‌డానికి పాట‌లు. పాట వ‌స్తుంది అంటే ప్రేక్ష‌కుడికి మ‌ళ్లీ టార్చ‌ర్. ఇంట‌ర్వెల్ త‌ర్వాత అస‌లు కథ మొద‌లైన‌ప్ప‌టికీ, అది కూడా చివ‌ర‌కు రొటీన్ క‌థలా తేలిపోతుంది. పాట‌లు అస్స‌లు బాలేవు. ఇక స్క్రీన్ పై చూస్తుంటే టికెట్ కొనుక్కుని మ‌రీ, న‌ర‌కానికి వ‌చ్చామా అన్న ఫీలింగ్ క‌లుగుతుంది. రీరికార్డింగ్ ఫ‌ర్వాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ అస్స‌లు బాలేదు. నిర్మాణ విలువ‌లు సినిమా తీరుకు త‌గ్గ‌ట్లున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః 
ఈ సినిమా వ‌ర‌కు అలాంటి వాటి గురించి ప‌ట్టించుకోకుండా ఉంటేనే బెట‌ర్

మైన‌స్ పాయింట్స్ః 
క‌థలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
డైర‌క్ట‌ర్ క్రియేటివిటీ ఎక్కువ‌గా వాడ‌టం
ఎడిటింగ్
పాట‌లు

పంచ్‌లైన్ః నేల‌కొరిగిన న‌క్ష‌త్రం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 1.75/5