‘మ‌న‌మంతా’ మూవీ రివ్యూటాలీవుడ్ ని ఎప్పుడూ ఒక రోగం వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడో వ‌చ్చిన సినిమాను తీసుకొచ్చి, ఇప్పుడు వ‌చ్చిన సినిమాతో పోల్చేయ‌డం. అదేదో అప్పుడో ఆ సినిమాను పొగిడితే, నాలుగు రోజుల పాటు థియేట‌ర్ లో ఉండేది, న‌లుగురు చూసేవాళ్లు. అలా చేయ‌డం మానేసి, అరె ఈ సీన్ ఎక్క‌డో చూసిన‌ట్లున్నామే, ఈ కాన్సెప్ట్ ఫ‌లానా సినిమాదే అని క‌బుర్లు చెప్తుంటారు. మ‌న‌మంతా సినిమా ట్యాగ్ లైన్, టీజ‌ర్ చూసిన వాళ్లు కూడా, ప్ర‌తి ఒక్క‌రూ.. ఈ సినిమా చంద‌మామ క‌థ‌లు సినిమాలానే ఉంటుందేమో, అలానే ఉంటుంది అన‌డం మొద‌లుపెట్టారు. డిసెంబ‌ర్ 31 నుంచి- జ‌న‌వ‌రి 1 కి ఎన్ని రోజులో, జ‌న‌వ‌రి 1నుంచి కూడా డిసెంబ‌ర్ 31 కి అన్నే రోజులు అనుకోవ‌డం ఎంత పొర‌పాటో ఇది కూడా అంతే. కాక‌పోతే మ‌నమంతా కూడా చంద‌మామ క‌థ‌లు సినిమా జోన‌ర్ లోకే వ‌స్తుంది అంతే.


సినిమా మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర‌నుంచి ఈ సినిమా ఏదొక రూపేణా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంది. సినిమా మొద‌లుపెట్టిన‌ప్పుడు, ఈ సినిమాలో మొద‌టి సారిగా మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ పూర్తి స్థాయిలో ఒక తెలుగు సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త‌తో అంద‌రి నోళ్ల‌లోనూ నానింది. దీనికి తోడు న‌టి గౌత‌మి రీఎంట్రీ. ఆ త‌ర్వాత సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్. ONE WORLD.. FOUR STORIES అంటూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ తోనే అంద‌రిలోనూ ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో అన్న ఆస‌క్తి మొద‌లైంది. దీని త‌ర్వాత విడుద‌ల చేసిన టీజ‌ర్. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ సినిమా మీద ఆశ‌లు రేపుతూ వ‌చ్చారు ద‌ర్శ‌కులు. అయితే సినిమా పోస్ట‌ర్, టీజ‌ర్, ట్రైల‌ర్, న‌టీన‌టులను చూసి సినిమా బాగుంటుంది అనే అంచ‌నా వేయ‌లేం. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌న‌మంతా, అంద‌రూ అనుకున్న‌విధంగా వారి అంచ‌నాల‌ను అందుకుందో లేదో చూద్దాం.


ఈ సినిమాలో అస‌లు క‌థేంటి అనే బ‌దులు క‌థ‌లేంటి అంటే బెట‌ర్. ద‌ర్శ‌కుడు ముందే చెప్పాడు క‌దా, ఒక ప్ర‌పంచం, నాలుగు క‌థలు అని. జీవితంలో హ్యాపీనే చూడాల‌నుకునే ఒక పాప‌, త‌ను ఎక్క‌డున్నా గౌర‌వం ద‌క్కాల‌ని కోరుకునే ఓ గృహిణి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌న‌స్థ‌త్వంతో ఏ ప‌నైనా త‌ర్వాత చూద్దాంలే.ఇప్పటికి దీనితో స‌ర్దుకుపోదాం అనుకునే ఒక వ్య‌క్తి, ఇష్ట‌మైన వారికోసం ఏదైనా అమ్మేసే అబ్బాయి.. ఈ న‌లుగురి క‌థ‌ల‌ను క‌లిపి ఒక ప్ర‌పంచంగా, ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చి మ‌న‌మంతా లా మార్చారు.


టాలీవుడ్ లో ఉన్న ద‌ర్శ‌క ఆణిముత్యాల్లో చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ఒక‌రు. ద‌ర్శ‌కుల్లో ఆయ‌న‌కున్న స్టైలే వేరు. సినిమా, సినిమాకు గ్యాప్ ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ, త‌న పాత సినిమా జ్ఞాప‌కాలు మాత్రం ఎప్ప‌టికీ గుర్తుండేలా జాగ్ర‌త్త తీసుకుంటాడు. సాహ‌సం సినిమా త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని, ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం మ‌న‌మంతా.కేవ‌లం కామెడీని న‌మ్ముకుని, సినిమాలు తీసేస్తున్న ఈ రోజుల్లో, ఏదో సినిమాలో కాసేపు కామెడీ ఉండాలి కానీ, కామెడీతోనే సినిమా తీయాలి అనే కాన్సెప్ట్ కు దూరంగా కొత్త క‌థ‌తో ముందుకొచ్చి, మంచి ప్ర‌య‌త్న‌మే చేశాడు ఏలేటి. అంతేకాదు, అస‌లు సినిమాలో స్టోరీ నే ఉండ‌ని ఈ రోజుల్లో.. ఒకే సినిమాలో నాలుగు క‌థ‌ల‌ను చూపించి త‌న ప్ర‌తిభ‌ను చాటాడు. ప్రతీ పాత్రకూ ప్రేక్ష‌కుడు ఎక్కడో ఒక చోట క‌నెక్ట్ అయ్యేవిధంగా తీర్చిదిద్దాడు. ప్ర‌తీ సాధార‌ణ‌ మధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తికీ ఉండే ఇబ్బందుల‌ను, త‌న కోరిక‌ల‌ను ఎంతో అద్భుతంగా తెర‌కెక్కించాడు. రాహుల్ శ్రీవ‌త్స‌వ్ కెమెరా ప‌నితీరు బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నేప‌థ్య సంగీతం సినిమాకు త‌గ్గ‌ట్టు కుదిరిన‌ప్ప‌టికీ, పాట‌ల విష‌యంలో కొంచెం జాగ్ర‌త్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


ఇక చెప్పుకోవాలంటే మోహ‌న్ లాల్. మ‌ల‌యాళంలో ఎంతో మంది ఆద‌రాభిమానం పొందిన ఈయ‌న తెలుగులో మొద‌టిసారి చేస్తున్న ఒక ఫుల్ లెంగ్త్ సినిమా మ‌న‌మంతా నే ఎంచుకోవ‌డంలోనే ఆయ‌న క‌థ‌ల ఎంపిక అర్థ‌మవుతుంది. మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తిగా, ఎప్పుడూ ఏదొక స‌మ‌స్య త‌నను వెంటాడుతుంది. దాని నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలి అనే క్యారెక్ట‌ర్ మోహ‌న్ లాల్ కు బాగా న‌ప్పింది. దీనికితోడు త‌న క్యారెక్ట‌ర్ కు స్వ‌యంగా తానే డ‌బ్బింగ్ చెప్పుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.చూస్తుంటే మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ తెలుగులో చ‌క్రం తిప్ప‌డం ఖాయమ‌నే అనిపిస్తుంది. ఎప్పుడూ గౌర‌వం కోరుకునే గృహిణిగా, త‌న స‌హ‌జ న‌ట‌న‌తో మెప్పించింది. త‌నకి ఇష్ట‌మైన వారి కోసం, ఏదైనా అమ్మేసే అబ్బాయిగా విశ్వంత్ త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకునే అమ్మాయిగా రైనా రావు, అంద‌రికీ కంట‌త‌డి పెట్టించేలా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కానీ, తార‌క‌ర‌త్న ఈ సినిమాలో ఎందుకు న‌టించాడో అర్థ‌మే కాదు. త‌ను చేస్తున్న‌ది పాజిటివ్ క్యారెక్ట‌ర్ అయినా, స్క్రీన్ మీద త‌న‌ను చూస్తుంటే మాత్రం, నెగిటివ్ షేడ్ లోనే క‌నిపిస్తాడు. విశ్వంత్ గ‌ర్ల్ ఫ్రెండ్ గా అనీషా త‌న న‌ట‌న‌తో పాటూ, గ్లామ‌ర్ ప‌రంగానూ మెప్పించింది. వెన్నెల కిషోర్, నాజ‌ర్, ఊర్వ‌శి, న‌వీన్, ధ‌న‌రాజ్,బ్ర‌హ్మాజీ.. త‌మ త‌మ పాత్ర‌ల‌కు బాగానే న్యాయం చేశారు.


దేవుడికి మ‌న న‌మ్మ‌కంతో ప‌న్లేదు, ఆయ‌న ప‌ని ఆయ‌న చేసుకుంటూ పోతాడు అని పూజారి, గౌత‌మి తో చెప్పిన సీన్ కు, క్లైమాక్స్ లో విశ్వంత్, పోయిన బ్యాగ్ ను తీసుకొచ్చిన‌ప్పుడు, ఇదంతా దేవుడి వ‌ల్లే, నువ్వు దేవుడిని న‌మ్మ‌క‌పోయినా ఈ అమ్మ‌ని న‌మ్ము అని చెప్పే సీన్ కి సింక్ చేయ‌డం బాగుంది. బ్ర‌త‌క‌డం నేర్చుకుంటున్నా అనుకున్నా కానీ, మ‌నిషిలా బ్ర‌త‌క‌డం మ‌ర్చిపోతున్నా అని మోహ‌న్ లాల్ చెప్పే డైలాగ్ సూప‌ర్బ్. నువ్వు చేసిన ప‌ని త‌ప్పు కాదు, దానిని స‌రైన ప‌ద్ధ‌తిలో చెయ్ అని నాజ‌ర్, రైనా రావుతో చెప్పే సీన్ బాగుంటుంది.


సినిమాలో చివ‌ర‌కు వాళ్ల క‌ష్టాల‌న్నీ తీరిపోతాయి అనే విష‌యం సినిమా చూసే ప్ర‌తీ ప్రేక్ష‌కుడికీ తెలుసు. అంద‌రూ అనుకున్న‌ట్లే వాళ్ల క‌ష్టాలు తొలిగిపోయి, చివ‌ర‌కు సంతోషంగా ఉంటారు. కానీ త‌ను ఇష్ట‌ప‌డే అమ్మాయిని పొంద‌డంలో మాత్రం విశ్వంత్ విజ‌యం కాలేక‌పోవ‌డంతో, చూసే ప్రేక్ష‌కుల‌కు ఏదో వెలితి.వారానికి ఒక‌సారి ఖాళీ ఉన్న‌ప్పుడు ఏదో ఎంట‌ర్ టైన్ మెంట్ కోసం సినిమాకి వ‌స్తే, దానిలోనూ ఎప్పుడూ ఈ సెంటిమెంట్స్ యేనా, కొంచెం కూడా ఎంట‌ర్ టైన్ మెంట్ లేకుండా అనుకునే వాళ్ల కోస‌మైనా కొంచెం కామెడీ జోలికి వెళ్లాల్సింది.


క‌థ ఉన్న సినిమా చూసి చాలా రోజులైంది అని ఫీల‌వుతున్న అంద‌రూ వెళ్లి త‌ప్ప‌క చూడాల్సిన సినిమా మ‌న‌మంతా. ఒక్క క‌థ‌నే హ్యాండిల్ చేయ‌డం క‌ష్టంగా భావించి, దాన్ని ప‌క్క దోవ ప‌ట్టించే వాళ్లున్న ఈరోజుల్లో నాలుగు క‌థ‌ల‌ను ఒకేసారి హ్యాండిల్ చేసి, డైర‌క్ట‌ర్ మంచి సాహ‌స‌మే చేశాడు.


పంచ్ లైన్ః ఒకే సినిమా-నాలుగు క‌థ‌లు


Filmjalsa Rating: 3.75/5