'లై' సినిమా రివ్యూ


నితిన్ చాకు లాంటి కుర్రాడు, స్పూర్తి దాయ‌క‌మైన హీరో. కండ‌లు పిండి చేసుకుని క‌ష్ట‌ప‌డిన‌ప్పుడు త‌న‌కు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర‌య్యాయి కానీ ఆ త‌ర్వాత ఆలోచించాడు ఆ క‌ష్టానికి కాస్త స‌మ‌య‌స్పూర్తిని జోడించాడు, ఇప్పుడు చెల‌రేగిపోతున్నాడు. రీసెంట్ గా నితిన్ సాధించిన స‌క్సెస్ 50కోట్ల హీరో అనిపించుకోవ‌డం. ఆ ఆనందంతోనే లై అనే సినిమాను థియేట‌ర్ల‌లోకి దింపాడు. ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

క‌థః 
మేరేజెస్ మేడిన్ హెవెన్ అన్నది ఇప్పటికీ అవునా కాదా అనే పిచ్చి సందేహం నారదుడికి. దానిని పనిగట్టుకుని భూలోకం వచ్చి మరీ ప్రూవ్ చేయాలన్న పిచ్చి తపన దేవేంద్రుడికి. దాంతో వాళ్లు భూమ్మీదకు వస్తారు. అప్పుడు హీరో ఎ సత్యం(నితిన్) హీరోయిన్ చైత్ర (మేఘా ఆకాష్) భూమ్మీద పడతారు. చైత్ర గురించి ఎల్ కే జి నుంచి పెళ్లి వయసు దాకా సుదీర్ఘ ఉపోద్ఘాతం. ఇక అ.సత్యం గురించి కూడా డిటో డిటో. ఈ కథ ఇలా వుంటే ది గ్రేట్ ఇండియన్ రోప్ ట్రిక్ ను ఆఖరి సారిగా తెలిసిన ఏకైక వ్యక్తి పద్మనాభన్ (సీనియర్ అర్జున్). ప్రేక్షకులకు మాత్రమే తెలిసి, పోలీసులకు తెలియనిది ఏమిటంటే తాము వెదుకుతున్న నొటోరియస్ క్రిమినల్ అతగాడే అన్నది. అతన్ని పట్టుకొవాలంటే, పద్మనాభన్ ముచ్చటపడి హైదరాబాద్ పాత బస్తీలో కుట్టించుకుంటున్న సూట్ ను ఫాలో అవ్వాలి. అందుకోసం ఓ ఇంటిలిజెన్స్ అధికారి (శ్రీరామ్) ను నియమిస్తారు. అదే సమయంలో చైత్ర, సత్యం కూడా అమెరికా చేరతారు. ఇలా అన్ని పాత్రలు ఒకే చోట చేరి, ఒకే విషయంతో అనుకోకుండానో, అనుకునో ముడిపడాయి. అప్పుడు ఏం జరిగింది అన్నది మిగిలిన కథ. 

 న‌టీన‌టుల ప్ర‌తిభః
నితిన్ మేకోవ‌ర్ కొత్త‌గా ట్రై అయితే చేశాడు కానీ, అత‌డికి ఆ మేకోవ‌ర్ కూడా  ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను కాపీ చేసిన‌ట్లే ఉంది. పంజా సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గెట‌ప్ ను పోలి ఉంది ఈ సినిమాలోని  నితిన్ మేకోవ‌ర్. కానీ న‌ట‌న‌లో మాత్రం మాంచి మెచ్యూరిటీనే క‌న‌పరిచాడు. మేఘా ఆకాష్ క్యూట్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. సీనియ‌ర్ హీరో అర్జున్ ను విల‌న్ గా అయితే తీసుకున్నారు కానీ ఆయ‌న‌ను డైర‌క్ట‌ర్ స‌రిగ్గా వాడుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. యాక్ష‌న్ కింగ్ అయిన అర్జున్ ను ఉంచుకుని, అర్జున్ తో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయించ‌డ‌మే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ త‌న పాత్ర ప‌రిధిలో అర్జున్ చాలా బాగా చేశాడు. నాజర్ కు మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. ర‌వికిష‌న్ కొత్త త‌రహా పాత్ర‌లో క‌నిపిస్తాడు. మిగిలిన వారిలో థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ, ప్ర‌భాస్ శీను, ఎవ‌రికి వారు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. 

 సాంకేతిక నిపుణులుః 
ఎప్పుడైనా థ్రిల్ల‌ర్, ఇంటిలెజెన్స్ జాన‌ర్ లో సినిమాలు తీసేట‌ప్పుడు స్క్రీన్ ప్లే ఎంత షార్ప్ గా ఉంటే అంత మంచిది. సోది అన్న‌ది అస్స‌లు ప‌నికిరాదు. కానీ లై సినిమాలో అది కావాల్సినంత దొర‌కుతుంది. దాదాపు సినిమా నిడివిలో పావు భాగం క‌థ‌తో సంబంధం లేని విష‌యాలే ఉన్న‌యంటే సినిమాలో ఎంత సోది ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎప్పుడైనా ప్రేక్ష‌కుల‌కు ఇంట్రెస్ట్ రావాలంటే, విల‌న్ కు హీరోకు మ‌ధ్య ఉన్న మైండ్ గేమ్ బాగా ఎస్టాబ్లిష్ చేయ‌గ‌ల‌గాలి కానీ ఇందులో అది కూడా కరువైపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కొన్ని కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నా, మొత్తంగా చూసుకుంటే ద‌ర్శ‌కుడుగా హ‌ను రాఘ‌వ‌పూడి ఈ సినిమాతో బాగా డిజ‌ప్పాయింట్ చేశాడ‌నే చెప్పాలి. సాంకేతిక ప‌రంగానూ లై ను బాగా రిచ్ గానే ప్రెజెంట్ చేశారు. యువ‌రాజ్ సినిమాటోగ్ర‌ఫీ, మ‌ణిశ‌ర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మేజ‌ర్ హైలైట్స్. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు బాగా ప‌దును పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  

ప్ల‌స్ పాయింట్స్ః 
క‌థ‌లో కొన్ని సీన్స్
న‌టీన‌టుల న‌ట‌న‌
రీరికార్డింగ్

మైన‌స్ పాయింట్స్ః 
స్క్రీన్ ప్లే
అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు
లాజిక్స్ మిస్ అవ‌డం

పంచ్‌లైన్ః అబ‌ద్ధం అబ‌ద్ధంలానే ఉంది
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5