'కాట‌మ‌రాయుడు' సినిమా రివ్యూ


వీర‌మ్ సినిమా రీమేక్ చేస్తున్నాడ‌ని వార్త బ‌య‌ట‌కు రాగానే ప‌వ‌న్ ఫ్యాన్స్ నీరు కారిపోయారు. ఏదీ దొర‌క‌న‌ట్లు ఆ పాత క‌థే కావాలా అంటూ కామెంట్స్ కూడా చేశారు. ట్రోల్ చేశారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మానియా అనేది ష‌రా మామూలుగా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేస‌రికి మొద‌లు పెట్టేసింది. స‌ర్దార్ ఫ్లాప్ త‌ర్వాత ప‌వ‌న్ అభిమానుల్లో జోష్ పెంచేందుకు కాట‌మ‌రాయుడుగా వ‌స్తున్నాడు. ఆల్రెడీ వీరమ్ అనే సినిమా అజిత్ హీరోగా తెలుగుతలోనూ డ‌బ్ అయిన‌ప్ప‌టికీ, కేవ‌లం సినిమాను ప‌వ‌న్ ఇమేజ్ ను న‌మ్మి, రీమేక్ చేశారు. అదీకాక ప‌వ‌న్ పంచెక‌ట్టులో డిఫ‌రెంట్ గెట‌ప్ తో క‌నిపించ‌నున్నాడు. ఇక అంచ‌నాలు ఏ మాత్రం ఉంటాయో చెప్పాల్సిన ప‌ని లేదు. మ‌రి ఈ అంచ‌నాలన్నింటినీ కాట‌మ‌రాయుడు అందుకున్నాడా లేదా అన్న‌ది చూద్దాం.

క‌థ‌లోకి వెళితే,

సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడుగా క‌నిపిస్తాడు. ఊరంద‌రికీ పెద్ద‌గా నిలిచే కాట‌మ‌రాయుడుకు తన త‌మ్ముళ్లంటే ప్రాణం. అమ్మాయిల‌తో పెట్టుకుంటే లైఫ్ కే డేంజ‌ర్ అన్న ఫీలింగ్ కాట‌మ‌రాయుడుది. కానీ త‌మ్ముళ్లు మాత్రం ఎవ‌రికి వాళ్లు ప్రేమలో మునిగిపోయి ఉంటారు. అన్న‌య్య త‌మ ప్రేమ‌ను ఒప్పుకోవాలంటే ఆయ‌న కూడా ప్రేమ‌లో ప‌డాల‌ని అవంతిక (శృతి హాస‌న్)ను కాట‌మ‌రాయుడి జీవితంలోకి   తీసుకొస్తారు త‌మ్ముళ్లు. అస‌లు అమ్మాయిలంటేనే ప‌డ‌ని కాట‌మ‌రాయుడు అవంతిక ప్రేమ‌లో ఎలా ప‌డ‌తాడు, వాళ్లిద్ద‌రూ త‌మ ప్రేమ‌ను ఎలా పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్తారు, ఈ మ‌ధ్య అస‌లేం జ‌రిగింది.. ఇలాంటి అంశాల‌న్నింటితో తెర‌కెక్కిందే ఈ సినిమా.

న‌టీన‌టుల ప్ర‌తిభః

 సినిమా మొత్తం ప‌వ‌న్ వ‌న్ మ్యాన్ షో అని చెప్పాలి. త‌న చూపు, మేన‌రిజం, బాడీ లాంగ్వేజ్, ఆ పంచెక‌ట్టు ఒక‌టేమిటి అన్నీ అదిరిపోయాయి. కొన్ని సీన్స్‌లో ప‌వ‌న్ న‌ట‌న చాలా బాగుంది. కాట‌మ‌రాయుడుతో మ‌రోసారి ప‌వ‌న్ త‌న కామెడీ టైమింగ్ ను నిరూపించుకున్నాడు. శృతిహాస‌న్ త‌న న‌ట‌న‌తో, అందంతో ఆక‌ట్టుకుంటుంది. పాట‌ల్లో త‌న గ్లామ‌ర్ యువ‌త‌ను ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో చెప్పుకోవాల్సిన మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి రావు ర‌మేష్. ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్స్ చేయ‌డంలో ఎవ‌రైనా ఆయ‌న త‌ర్వాతే అనిపించేలా చేశాడు. ఈ పాత్ర‌కు ఆయ‌న త‌ప్ప వేరే ఎవ్వ‌రూ న్యాయం చేసేవారు కాదు. అలీ కామెడీ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా అజ‌య్, శివ‌బాలాజీ,క‌మ‌ల్ కామ‌రాజు, చైత‌న్య కృష్ణ బాగానే మెప్పించారు. న్యాయం కోసం పోరాడే జ‌డ్జిగా నాజ‌ర్ మెప్పిస్తాడు. మిగ‌తా వారు త‌మ త‌మ పాత్ర‌ల మేర బాగానే చేశారు. 

ఒక భాష‌లో విజ‌యం సాధించిన సినిమాల‌ను తెచ్చి రీమేక్ చేయ‌డం మ‌న‌వాళ్లకు అల‌వాటే. అయితే అలా చేసిన వారిలో ఒక‌రిద్ద‌రి ప్ర‌య‌త్నం త‌ప్ప మిగ‌తా వారిది ఎక్కువ భాగం వృధానే అయింది. రీమేక్ అంటే అస‌లు సినిమాలో ఏముందో అచ్చు ఈ సినిమాలో కూడా అదే దింపేయ‌డం కాదు. ఆ ఫీలింగ్స్ , ఎమోష‌న్స్ తో పాటూ క‌థ‌ను కూడా క‌రెక్ట్ గా క్యారీ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే వారు చేసిన ప్ర‌య‌త్నానికి ఓ ప్ర‌యోజ‌నం ఉంటుంది.ఇక్క‌డ డాలీ కూడా అదే చేశాడు.అదే సినిమాను ఇక్క‌డ చూపించ‌కుండా, కేవ‌లం మూల క‌థ‌ను మాత్ర‌మే తీసుకుని, దాన్ని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మెరుగులు దిద్ది, ప్రేక్ష‌కుల‌కు ప్రెజెంట్ చేశాడు డాలీ. 

 సినిమా ఫ‌స్టాఫ్ అంతా, ప్ర‌జ‌ల కోసం కాట‌మ‌రాయుడి ఆరాటం, త‌మ ల‌వ్ కోసం ఆడాళ్లంటే ప‌డ‌ని అన్న‌య్య‌ను ల‌వ్ లో ప‌డేలా చేయ‌డం, త‌ర్వాత వాళ్ల కంటికే క‌నిపించ‌కుండా ఆ అమ్మాయిని ప‌వ‌న్ ప్రేమించ‌డం మ‌ధ్య మ‌ధ్యలో కామెడీ సీన్స్, అక్క‌డ‌క్క‌డా ఎమోష‌న‌ల్ ట‌చ్ , ఫైట్స్ ఇలా ఫ‌స్టాఫ్ అంతా చాలా ఫాస్ట్ గా, స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది.ఇక సెకండాఫ్ మొత్తం హీరోయిన్ ఫ్యామిలీని విల‌న్ చంపాల‌నుకోవ‌డం, వారి నుంచి ఆ ఫ్యామిలీని కాపాడ‌టం, దానికోసం ఫైటింగ్ చేయ‌డంతోనే స‌రిపోతుంది. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే, సెకండాఫ్ లో కామెడీ చాలా త‌క్కువ‌. నెరేష‌న్ కూడా చాలా నెమ్మ‌దిగా ఉంటుంది. 

సాంకేతిక నిపుణులుః

ఆల్రెడీ తెలిసిన క‌థ‌ను మ‌ళ్లీ తీయ‌డం మామూలు విష‌యం కాదు. అదే క‌థ తీస్తే మ‌ళ్లీ అదే సినిమా తీశాడు అంటారు, ఒకవేళ ఏమైనా మార్పులు చేసి అవి ప్రేక్ష‌కుల‌కు ఎక్కక‌పోతే, ఏ న‌మ్మ‌కంతో ఈ సీన్స్ క‌ల్పించార‌నే మాట‌లూ వ‌స్తాయి. ఇన్నింటి మీద ఒక రీమేక్ చేయాలంటే క‌త్తి మీద సాములాంటిదే. కానీ ఆ విష‌యంలో డాలీ స‌క్సెస్ అయ్యాడ‌నే చెప్పాలి. వీర‌మ్ లో లేని సీన్స్ ను కొన్ని క‌ల్పించిన‌ప్ప‌టికీ, ఆ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ కు ప్ర‌పోజ్ చేసే సీన్ చాలా బాగుంటుంది. యాక్ష‌న్ ఎపిసోడ్స్ లో డాలీ మంచి ప‌నిత‌న‌మే చూపించాడు. డైలాగులు కూడా బాగా కుదిరాయి. ''అన్న చెయ్య‌ను అంటే చెయ్య‌నివ్వ‌ను అని అర్థం'' , ''చావుకే నేనంటే ఇష్టం, నేను ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ్ల‌మంటే వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్తుంది'', ''నువ్వు ఎవ‌రినీ ప్రేమించ‌లేదు క‌దా, ప్రేమిస్తే తెలిసేది నా కోపంలో ఉన్న ప్రేమ''  లాంటి డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. అనూప్ రూబెన్స్ సంగీతంలో వ‌చ్చిన పాటల్లో మిరా మిరా మీసం పాట త‌ప్పించి, మిగ‌తా ఏవీ అంత కిక్ ఇవ్వ‌వు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సెకండాఫ్ లో ఎడిటింగ్ మీద కాస్త దృష్టి పెట్టుంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


 ప్ల‌స్ పాయింట్స్ః 

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రావు ర‌మేష్ న‌ట‌న‌

యాక్ష‌న్ సీన్స్


మైన‌స్ పాయింట్స్ః 

సెకండాఫ్ 

మ్యూజిక్


పంచ్ లైన్ః రాయుడ్ని రెచ్చ‌గొట్ట‌కండ్రా

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.75/5