Jakkanna Movie Review


 బ్ర‌హ్మానందం త‌ర్వాత అంత‌టి క‌మెడియ‌న్ గా క్రేజ్ తెచ్చుకున్న సునీల్ అందాల రాముడితో హీరోగా మారి, మర్యాద రామ‌న్న‌, పూల‌రంగ‌డుతో విజ‌యాల్ని అందుకుని, ఫుల్ ప్లెడ్జ్‌డ్ హీరోగా మారాక ఎందుకో ఈ మ‌ధ్య వ‌స్తున్న సినిమాలు విజ‌యం వ‌రించ‌లేక పోయాయి. కానీ ఈసారి త‌న‌కు ఇంత‌టి వైభ‌వాన్ని తీసుకువ‌చ్చిన కామెడీని న‌మ్ముకుని, బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్ అనే ట్యాగ్ లైన్ వేసుకుని జ‌క్క‌న్న‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సునీల్. ప్రేమ క‌థా చిత్రం సినిమాతో మంచి క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ అందుకున్న RPA క్రియేష‌న్స్ అధినేత సుద‌ర్శ‌న్ రెడ్డి నిర్మాత‌గా, ర‌క్ష సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన వంశీ ఆకెళ్ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన చిత్రం జ‌క్క‌న్న‌.

మ‌రి వాళ్లు చెప్పిన‌ట్టుగా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిందా, లేక మ‌ళ్లీ విజ‌యం దోబూచులాడిందా అనేది మ‌న స‌మీక్ష‌లో తెలుసుకుందాం..


క‌థ విష‌యానికి వ‌స్తే,
ఓ పెద్దగా చెప్పుకోవ‌డానికేమీ లేదు. ద‌ర్శ‌కుడు సింపిల్ క‌థ‌నే సెలెక్ట్ చేసుకున్నాడు. స్కూల్లో మాస్ట‌ర్ చెప్పిన క‌థ‌లో నీతిని త‌ప్పకుండా ఆచ‌రిస్తుంటాడు హీరో. ఎవ‌రైనా మ‌న‌కు స‌హాయం చేస్తే, వాళ్ల‌కు మ‌నం త‌ప్ప‌కుండా తిరిగి సాయ‌ప‌డాల‌నేదే ఆ నీతి. కానీ హీరో ఆ నీతిని కొంచెం ఎక్కువ‌గానే ఒంట ప‌ట్టించుకుంటాడు. త‌న కాలికి దెబ్బ త‌గిలినప్పుడు క‌ట్టు క‌ట్టాడ‌ని, త‌న ఫ్రెండ్ కు ఏదంటే అది వ‌ద్దన్నా ఇచ్చేంత హెల్ప్ చేస్తుంటాడు. అలాగే చిన్న‌ప్పుడు త‌న ప్రాణాలు కాపాడ‌డ‌ని బైరాగి అనే రౌడీని కంటికి రెప్ప‌లా కాపాడుతూ ఆ రౌడీతో వ‌చ్చే స‌మ‌స్య‌లు, వాటి ప‌రిణామాల‌ను ఎలా ఎదుర్కొని, త‌ను ప్రేమించిన అమ్మాయి ప్రేమను ఎలా ద‌క్కించుకున్నాడు, ఆ రౌడీని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ చిత్ర క‌థ‌.


దర్శ‌కుడు..
వంశీ ఆకెళ్ల ర‌క్ష లాంటి సినిమాతో ఒక డిఫ‌రెంట్ సినిమాను మ‌న‌కు చూపించినా, సునీల్ లాంటి స్టార్ వాల్యూ ఉన్న హీరో డేట్స్ దొరికిన‌ప్పుడు కొంచెం క‌థ మీద శ్ర‌ద్ధ వ‌హించి ఉంటే బాగుండేది.


లాజిక్ లేని క‌థ‌..
సినిమా అంటేనే లాజిక్ ఉండ‌దు బ‌ట్ లాజిక్ లేకున్నా, లాజిక‌ల్ గా ప్రేక్ష‌కుల్ని ఎంత కన్విన్స్ చేశాడ‌నేది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌. డైలాగ్స్ విష‌యంలో ప్రాస కోసం ప్రాకులాడిన దాంట్లో స‌గం అయినా క‌థ మీద దృష్టి పెట్టుంటే ఇంకా బాగుండేది. ఎంత‌గా అంటే ” హెల్ప్ చేయ‌డానికి నేను మోడీని కాదురా రౌడీని ” ఇలాంటి ప్రాస డైలాగ్ లు కోకొల్ల‌లు.


సెకండాఫ్ లో పృధ్వీతో బాల‌కృష్ణలా ఇమిటేట్ చేస్తూ న‌డిపించిన విధానం చిరాకు పుట్టిస్తుంది. ఎందుకంటే ఇమిటేష‌న్ ఒక‌సారి, మ‌హా అయితే రెండు సార్లు బాగుంటుంద త‌ప్ప ఎప్పుడూ ఇమిటేష‌నే అయితే చూసే ప్రేక్ష‌కుడికి కూడా ఇరిటేష‌న్ వ‌స్తుంది. అలాగే స‌ప్త‌గిరి కామెడీ ఫ‌స్ట్ హాఫ్ లో మాస్ట‌ర్ గా త‌న పిచ్చి చేష్ట‌ల‌తో మ‌న‌కు వెగ‌టు పుట్టించినా, సెకండాఫ్ లో మాత్రం భ‌లే భ‌లే మాగాడివోయ్ కాన్సెప్ట్ తో కాస్త న‌వ్వించ‌గ‌లిగాడు.


ప్ర‌తి ఒక్కరి నుంచి మెరుగైన న‌ట‌న‌ను రాబ‌ట్టుకోవ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. కానీ, వైజాగ్ సిటీని త‌న రూపం తెలియ‌కుండా, అంద‌రిలో పేరుతోనే భ‌య‌పెట్టిన రౌడీ త‌ను ఎవ‌రో తెలిసేలా చేసిన హీరో ముందు మ‌రీ బ‌ఫూన్ లా అవ‌డం ఏంటో ద‌ర్శ‌కుడికే తెలియాలి. సీన్ల‌ను బ‌ట్టి కామెడీతో వెళ్తే బాగుంటుంది త‌ప్ప కామెడీ కోసం సీన్ల‌ను పెడితే ఇలాగే ఉంటుంది.


పెర్ఫామెన్సెస్..
సునీల్ ఎప్ప‌టికంటే కొంచెం ఎక్కువ‌గా కామెడీని న‌మ్ముకున్నాడు. త‌న‌కు తెలిసిన కామెడీతో పాటు, హీరోయిజం కూడా మిస్ కాకుండా జాగ్ర‌త్త ప‌డ్డాడు. డాన్స్‌ల విష‌యంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. కొంచెం పొట్ట వ‌చ్చినందుకేమో, విల‌న్ త‌న సిక్స్ ప్యాక్ చూపిస్తే, అక్క‌డ ఒక క్యారెక్ట‌ర్ ను పెట్టి మ‌రీ, అన్న సిక్స్ ప్యాక్ ఎప్పుడో చేసి వ‌దిలేశాడు అని చెప్పించాడు. హీరోయిన్ మ‌న్నారా ని మాత్రం పాట‌లకే ప‌రిమితం అయింది త‌ప్ప‌, న‌టించ‌డానికి పెద్దగా స్కోప్ లేదు. మిగ‌తా ఆర్టిస్టుల్లో స‌ప్త‌గిరి, అదుర్స్ ర‌ఘు, పృథ్వీ త‌మ పాత్ర‌ల‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు.


దినేష్ ఇచ్చిన మ్యూజిక్ లో లింగా లింగా అనే సాంగ్ మాత్రం కొంచెం మాస్ కు గుర్తుండేలా ఉంది. మిగ‌తా సాంగ్స్ అన్నీ సో సో గా ఉన్నాయి. మ్యూజిక్ ప‌రంగా సునీల్ కు తగిన సాంగ్స్ ఇవ్వ‌లేద‌నే చెప్పుకోవాలి. కెమెరా ప‌నితీరు చాలా బాగా చేశాడు. అలాగే పాపం ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు బాగానే ప‌నిచెప్పాడు కానీ క‌థ‌లో విష‌యం లేక‌పోతే త‌ను మాత్రం ఏం చేస్తాడు. నిర్మాత ద‌ర్శ‌కుడి అడిగిన‌వ‌న్నీ చేశాడు అని సినిమా క్వాలిటీనే చెప్తుంది. నిర్మాత‌గా త‌న బాధ్య‌త స‌క్ర‌మంగానే నిర్వ‌ర్తించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


చివ‌ర‌గా, సీన్లు సీన్లుగా చూడ‌టానికి కామెడీ ఛానెల్స్ ఉన్నాయి. సినిమాగా చూడాలంటే సినిమాకు ప్రాణం అయిన క‌థ కావాలి. జ‌క్క‌న్న పేరు పెట్టినంత మాత్రాన అన్నీ జ‌క్క‌న్న తీసిన అంత‌టి సినిమాలు కావు, కాలేవు. ఇక అంతా బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కుల ద‌య‌.


పంచ్ లైన్ః జ‌క్క‌న్న కూడా కాపాడ‌లేక‌పోయాడు


Film Jalsa Rating : 2.5/5