'జై సింహా' మూవీ రివ్యూ


గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణిని 100వ సినిమాగా ఎంచుకుని, విజ‌యం సాధించిన బాల‌కృష్ణ‌.. ఆ త‌ర్వాత త‌న 101వ చిత్రంగా పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌కత్వంలో పైసా వ‌సూల్ అంటూ తేడా సింగ్ గా ప‌లక‌రించి, బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాడు. పైసా వ‌సూల్ ప‌రాజ‌యం త‌ర్వాత బాల‌య్య కె.ఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 102వ సినిమాగా' జై సింహా' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆల్రెడీ త‌న తండ్రి 'జ‌య సింహా' అనే టైటిల్ కు దగ్గ‌ర‌గా ఉండే టైటిల్ ను పెట్టుకోవ‌డం, దానికి తోడు టైటిల్ లో సింహా అని ఉండ‌టంతో మ‌రోసారి బాల‌య్య జై సింహా అంటూ సెంటిమెంట్ ను వ‌ర్క‌వుట్ చేస్తాడా అని అంద‌రూ అంచ‌నాలు పెట్టేసుకున్నారు. మ‌రి వారి అంచ‌నాల‌ను బాల‌య్య అందుకున్నాడా?  బాలయ్య సెంటిమెంట్ ను జై సింహా నెర‌వేరుస్తుందా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః

త‌న చుట్టూ ఉన్న స‌మాజంలో త‌ప్పులు జ‌రుగుతుంటే చూస్తూ ఊరుకోని వ్య‌క్తి న‌ర‌సింహా(బాల‌కృష్ణ‌).  గౌరి(న‌య‌న‌తార‌)తో ప్రేమ‌లో ప‌డతాడు న‌ర‌సింహా. కానీ కొన్ని సంఘ‌ట‌న‌ల వ‌ల్ల వారిద్ద‌రూ విడిపోతారు. అస‌లు వారు విడిపోవ‌డానికి కార‌ణ‌మేంటి? అన్న దాని చుట్టూనే క‌థంతా తిరుగుతూ ఉంటుంది. 


న‌టీన‌టుల ప్ర‌తిభః 

సినిమా అంతా బాల‌య్య వ‌న్ మ్యాన్ షో అనే చెప్పాలి. త‌న ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్, డ్యాన్సుల‌కు కుర్ర హీరోలు సైతం వాట్ ఏ ఎన‌ర్జీ అన‌క మానరు. ప్ర‌తీ  సీన్ లోనూ త‌న యాక్టింగ్, ఎనర్జీ, కామెడీ టైమింగ్ అన్నింటిలోనూ బాల‌కృష్ణ ది బెస్ట్ అనిపించుకున్నాడు. అంతేకాదు అమ్మ‌కుట్టి పాట‌లో త‌న డ్యాన్స్ చూస్తే బాల‌య్య‌కు ఏడాదికి ఏడాదికి అస‌లు వ‌య‌సు పెరుగుతుందా అన్న అనుమానం రాకుండా ఉండ‌దు. సెంటిమెంట్ సీన్స్ లోనూ బాల‌య్య న‌ట‌న మ‌న‌సును హ‌త్తుకుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లాడికి, బాల‌య్య‌కు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ చాలా ట‌చింగ్ అనిపిస్తాయి. హీరోయిన్ల‌లో న‌య‌న‌తార , హ‌రిప్రియ, న‌టాషా తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. బాల‌య్య‌- న‌య‌న‌తార జంట ఎప్ప‌టిలాగానే బాగున్న‌ప్ప‌టికీ వారిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క‌వుట్ అయింది అనుకునేంత సీన్లేమీ లేవు. సెకండాఫ్ లో న‌య‌న‌తార న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ప్ర‌కాష్ రాజ్ ఎప్ప‌టిలాగానే బాగా చేశాడు. ముర‌ళీ మోహ‌న్ గెస్ట్ రోల్ కే ప‌రిమిత‌మ‌య్యాడు. బ్ర‌హ్మానందం అక్క‌డ‌క్క‌డా న‌వ్వించ‌గ‌లిగాడు. మిగిలిన వారిలో కాల‌కేయ ప్ర‌భాక‌ర్,ప్రియ‌, జెపి త‌దిత‌రులు వారు వారి ప‌రిధిలో బాగా చేశారు.


సాంకేతిక నిపుణులుః

నిన్న కాక మొన్న పైసా వ‌సూల్ వ‌చ్చినట్లుంది. అప్పుడే ఇంకో సినిమాను బాల‌య్య ఈ వ‌య‌సులో రిలీజ్ చేయ‌డం.. తన స్పీడ్ చూస్తుంటే యంగ్ హీరోలు కూడా ఇంత హుషారుగా ఉండ‌రేమో అనిపిస్తుంది. బాల‌య్య లాంటి స్టార్ హీరోతో ఇంత త‌క్కువ స‌మ‌యంలో సినిమా తీయ‌డమంటే మామూలు విష‌యం కాదు. ఇంత త‌క్కువ సమ‌యంలో సినిమా అంటే క్లారిటీ మిస్ అయుంటుందా అని అనుకున్నారు కానీ క్లారిటీ విష‌యంలోనూ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా జై సింహా తెర‌కెక్కింది. అయితే రొటీన్ క‌థ‌ను తీసుకున్న కె.ఎస్ ర‌వికుమార్ దాన్ని ఆస‌క్తిగా మ‌ల‌చ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. ప్రేమించిన అమ్మాయి సంతోషంగా ఉండ‌టం కోసం త‌న జీవితాన్నే త్యాగం చేసే వ్య‌క్తి గురించి గతంలో చాలానే సినిమాలు వ‌చ్చాయి. అందులో జై సింహా కూడా ఒక‌టిగా ఉంటుందే త‌ప్పించి, ఈ సినిమాకంటూ ప్ర‌త్యేక స్థానం అయితే ఉండ‌దు. ఇక సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. చిరంత‌న్ భ‌ట్ అందించిన పాట‌లు బాల‌య్య అభిమానులను ఉర్రూత‌లూగించేలా ఉన్నాయి. బాల‌య్య డ్యాన్సులు కూడా బాగున్నాయి. పాట‌లు స్క్రీన్ మీద కూడా చూడ్డానికి బావున్నాయి. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ఎడిట‌ర్ ఇంకాస్త త‌న క‌త్తెర‌కు ప‌ని చెప్పాల్సింది.  నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లు బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

బాలకృష్ణ న‌ట‌న‌, డ్యాన్సులు

బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్


మైన‌స్ పాయింట్స్ః  

సంద‌ర్భానుసారంగా వ‌చ్చే కామెడీ

రొటీన్ క‌థ‌


పంచ్‌లైన్ః 'జై సింహా'కు అంతే తెలుసు..!

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5