'జై ల‌వ‌కుశ' మూవీ రివ్యూ


ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఏం చేసినా ఒక ప్ర‌యోగం లాగే క‌న‌బ‌డుతుంది. ప్ర‌తీ ద‌ర్శ‌కుడికి ఎన్టీఆర్ ఓ ప్ర‌యోగ‌శాల‌గా మారాడు. ఏ డైర‌క్ట‌ర్ కు ఆ డైర‌క్ట‌ర్ ఎన్టీఆర్ స్టామినాకు త‌గ్గ‌ట్లు క‌థ‌లు అల్లుకుని ప్రేక్ష‌కుల్ని మెప్పించారు. దీనికి సాక్ష్యాలే టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాలు. మూడు వ‌రుస విజ‌యాల త‌ర్వాత ఏం సినిమా చేయాలా అని కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్న ఎన్టీఆర్ చివ‌ర‌కు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. సినిమకు ఏమంటూ ఆ పేరు పెట్టారో కానీ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర నుంచి అన్నీబాగా కుదిరాయి. ఫ‌స్ట్ లుక్ ద‌గ్గ‌ర‌నుంచి మూడు టీజ‌ర్స్, ట్రైల‌ర్, పాట‌లు ఇలా ఒక‌టేమిటి జై ల‌వ‌కుశ‌కు సంబంధించి ప్ర‌తీదీ హాట్ టాపిక్ అయింది. దానికితోడు ఎన్టీఆర్ మొద‌టిసారి త‌న హోమ్ బ్యాన‌ర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా చేస్తుండ‌టం, జై పాత్ర‌లో మొద‌టిసారిగా నెగిటివ్ రోల్ లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలియ‌డంతో అంచ‌నాలు భారీగా పెరిగిపోయాయి. ఇన్ని అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన జై ల‌వ‌కుశ ఎలా ఉందీ మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః  

ఒకే త‌ల్లికి పుట్టిన ముగ్గురు కొడుకులు జై, ల‌వ మ‌రియు కుశ‌. ల‌వ‌కుశ‌లిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి నాట‌కాల్లో ఆరితేరిపోతారు. జై కు న‌త్తి ఉండ‌టంతో నాట‌కాల్లో పాత్ర ఇవ్వ‌కుండా చిన్న‌బుచ్చుతాడు త‌న మామ‌య్య పోసాని. ప్ర‌తీ విష‌యంలోనూ ల‌వ‌కుశ‌ల‌కు ప్ర‌శంస‌లు, పొగ‌డ్త‌లు వ‌స్తుంటే జై కు మాత్రం విమ‌ర్శలు, ఎత్తిపొడుపులు, అవ‌మానాలే. ఈ నేప‌థ్యంలో ల‌వ‌కుశ‌ల మీద ప‌గ పెంచుకున్నజై వారు నాట‌కం వేస్తున్న స‌మయంలో స్టేజ్ ను గ్యాస్ సిలిండ‌ర్ లీక్ చేసి పేలుస్తాడు. 20 ఏళ్ల త‌ర్వాత విడివిడిగా పెరిగిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఎలా క‌లుస్తారు?  జై రావ‌ణుడిగా ఎలా మారాడు? ల‌వ‌కుశ‌ల మీద జై ఎలా ప‌గ తీర్చుకున్నాడు?  చివ‌ర‌కు రావ‌ణుడు రాముడిగా మార‌తాడా అన్నదాని మీద క‌థ న‌డుస్తుంది. 


న‌టీన‌టుల ప్ర‌తిభః 

మామూలుగా సినిమా మొత్తంలో ఒక క్యారెక్ట‌ర్ చేయ‌డానికి నానా క‌ష్టాలు ప‌డేవారున్న ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఒకే సినిమాలో మూడు పాత్ర‌లు వేసి, మూడింటిలోనూ డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ చూపించాడు. సీన్ డ‌ల్ గా ఉన్న‌చోట సైతం త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుడిని క‌ద‌ల‌కుండా చేశాడు. ల‌వ, కుశ త‌రహా పాత్ర‌లు ఎన్టీఆర్ ఇదివ‌ర‌కు చేశాడు, మ‌నం చూశాం. కొత్త‌గా మ‌నం చూడాల్సింది జై లాంటి క్యారెక్ట‌ర్ లో ఎన్టీఆర్ న‌ట‌న‌. సినిమా మొత్తానికి బ‌ల‌మైన పాత్ర ఇదే. జై పాత్ర‌లో త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు ఎన్టీవోడు. జై పాత్ర‌తో ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటూ స‌గ‌టు ప్రేక్ష‌కుడి మ‌న‌సుని కూడా దోచుకున్నాడు. అస‌లు జై పాత్రను ఎన్టీఆర్ త‌ప్ప వేరే ఏ న‌టుడు చేసినా కూడా ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో. అస‌లు ఆ పాత్ర ఎన్టీఆర్ కోస‌మే పుట్టినట్లు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు జై క్యారెక్ట‌ర్ తో తెలియ‌కుండా ప్రేమ‌లో పడిపోతారు.  ఎన్టీఆర్ జై పాత్ర కోసం ఎంత కష్ట‌ప‌డ్డాడు అన్న‌ది తెర‌పై చాలా స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది. జై గా త‌న బాడీ లాంగ్వేజ్, ఆ న‌త్తి, క‌ళ్ల‌లో ఆ ఇంటెన్సిటీ అన్నీ ప్ర‌తీ దాంట్లోనూ ఎన్టీఆర్ బాగా వేరియేష‌న్ చూపించాడు. అస‌లు సినిమా మొత్తాన్నిఎన్టీఆర్ త‌న భుజాల‌పై న‌డిపించేశాడు. హీరోయిన్స్ పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్పించి పెద్ద‌గా న‌టించ‌డానికి స్కోప్ ఏమీ లేదు. సాయి కుమార్ కు మ‌రోసారి మంచి పాత్ర ద‌క్కింది. పోసాని న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. హంసా నందిని, నందితల పాత్ర‌లు చెప్పుకునే పాత్ర‌లేమీ కాదు. మిగ‌తా పాత్ర‌ధారులు ఎవ‌రెవ‌రి పాత్ర‌కు వారు న్యాయం చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

కేవ‌లం మాస్ హీరోగానే కాకుండా,  ఎన్టీఆర్ లోని న‌ట‌నా ప్ర‌తిభ‌ను దృష్టిలో ఉంచుకుని ద‌ర్శ‌కుడు బాబీ అల్లుకున్న క‌థను ముందుగా ప్ర‌శంసించాలి. మూడు పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాల‌తో పాటూ, ఒక్కొక్క క్యారెక్ట‌ర్ ను క‌థ‌లో భాగంగా న‌డిపించిన తీరు, ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా చెప్పాల‌నుకున్న క‌థ‌ను నీట్ గా ప్రెజెంట్ చేయ‌గ‌లిగాడు బాబీ. దానికి స్క్రీన్ ప్లే అందించిన కోన వెంకట్ ను , చ‌క్ర‌వ‌ర్తిల‌ను కూడా మెచ్చుకోవాలి. జై క్యారెక్ట‌ర్ ను మ‌లిచిన తీరు, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య జ‌రిగే సీన్స్ అన్నీ చాలా ఎమోష‌న‌ల్ గా తెర‌కెక్కించాడు. ప్రీ క్లైమాక్స్ లో వ‌చ్చే డ్రామా సీన్ లో తార‌క్ నుంచి ప్రేక్ష‌కులు ఎంత ఆశిస్తారో, ఏం ఆశిస్తారో బాగా తెలుసుకున్న బాబీ, ఆ ఒక్క ఎమోష‌న‌ల్ సీన్ తో ప్రేక్ష‌కుల‌కు క‌న్నీళ్లు తెప్పించేశాడు. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌తీ సీన్ ను బాగా ఎలివేట్ అయ్యేలా చాలా బాగుంది. దేవీ శ్రీ ప్ర‌సాద్ అందించిన పాట‌లు ఆల్రెడీ మంచి హిట్ అయ్యాయి. తెర‌మీద అవి ఇంకా బాగా కుదిరాయి. రావ‌ణా, నీ క‌ళ్ల లోన పాట‌లు స్క్రీన్ మీద చాలా బావున్నాయి.  స్వింగ్ జ‌రా అంటూ త‌మ‌న్నాపై తెర‌కెక్కించిన స్పెష‌ల్ సాంగ్ ఊహించినంత కిక్కేమీ ఇవ్వ‌దు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవీశ్రీ అందించిన నేప‌థ్య సంగీతం గురించి. ప్ర‌తీ సీన్ ను త‌న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లాడు. ఎడిటింగ్ బాగుంది. త‌మ్ముడు హీరో కాబ‌ట్టి, ఎక్క‌డా ఖ‌ర్చుకు ఢోకా లేకుండా క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని బాగా నిర్మించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన సినిమాల్లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా మిగిలిపోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాడు క‌ళ్యాణ్ రామ్. 


ప్ల‌స్ పాయింట్స్ః 

ఎన్టీఆర్ 

ఎమోష‌న‌ల్ సీన్స్ 

ఛోటా కె. నాయుడు సినిమాటోగ్ర‌ఫీ

దేవీ శ్రీ ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్


మైన‌స్ పాయింట్స్ః 

హీరోయిన్స్ పాటల‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డం

ఫ‌స్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్


పంచ్ లైన్ః అభిమానుల‌కు ఎన్టీఆర్ ఇచ్చిన పండుగ కానుక‌

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5