'గురు' సినిమా రివ్యూ


కొంత‌మంది హీరోలు కొన్ని ప‌రిమిత‌మైన క్యారెక్ట‌ర్స్ చేయ‌డంలోనే ఉత్సాహం చూపుతుంటారు. కొంత‌మంది వాస్త‌వ ప‌రిస్థితులను అర్థం చేసుకుని ఎలాంటి ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా నిజంలో బ్ర‌తుకుతూ త‌మ స్టామినా ఏంటో తెలుసుకుని వాళ్ల‌కు వాళ్లు కొత్త‌గా త‌యారై కొత్త‌ద‌నం కోసం పరిత‌పిస్తుంటారు. అలాంటి హీరోల్లో ముందు స్థానంలో ఉంటాడు విక్ట‌రీ వెంక‌టేష్. ఈ నేప‌థ్యంలో త‌న‌ను తాను కొత్త‌గా ఆవిష్క‌రింప‌చేసుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా హిందీ, త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన 'సాలా కడూస్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. త‌నకు రీమేక్  లు కొత్త కాక‌పోయినా త‌న వ‌య‌సుకు తగ్గ క్యారెక్ట‌ర్‌తో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబ‌ట్టి, సినిమాపై అంచ‌నాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫ‌స్ట్ లుక్ తోనే అంద‌రినీ త‌న‌వైపుకు తిప్పుకున్నాడు గురు.పైగా రిలీజ్ కు ముందే ప్రీమియ‌ర్స్ వేయడంతో సినిమా మీద చాలా ధైర్యంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఈ శుక్ర‌వారం విడుద‌ల కానున్న ఈ సినిమా అంద‌రి అంచ‌నాలను అందుకుందా లేదా అనేది మ‌న స‌మీక్షలో చూద్దాం.

క‌థ విష‌యానికొస్తే,

చెప్పాలంటే చాలా సింపుల్ క‌థ‌. ఎలాంటి రాజ‌కీయాల‌కు త‌లొగ్గ‌కుండా దేశానికి మ‌హిళా బాక్స‌ర్ ఛాంపియ‌న్‌షిప్‌ను తేవాల‌ని ఆరాట‌ప‌డే ఒక కోచ్, ఒక స్ల‌మ్ ఏరియాలో అమ్మాయిని చూసి, త‌న‌లో ఉన్న టాలెంట్ ను గుర్తించి, త‌న‌కు కోచింగ్ ఇచ్చి ఎలా ఛాంపియ‌న్ ను చేశాడు, ఆ క్ర‌మంలో ఎదురైన ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్న‌దే క‌థ‌. 


న‌టీన‌టుల ప్ర‌తిభః 

వెంక‌టేష్ విష‌యంలో న‌ట‌న  గురించి మాట్లాడితే, చేప‌కు ఈత నేర్పిన‌ట్లే. కానీ ఈ చిత్ర విష‌యంలో త‌ప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే టాలెంట్ ను గుర్తించి, ఆ టాలెంట్ ను ఛాంపియ‌న్ ను చేసే వర‌కు ఆ కోచ్, ఎంత తాప‌త్ర‌య‌ప‌డ‌తాడో, ఆ కోచ్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతారో త‌న న‌ట‌న‌తో ప్రాణం పోశాడ‌నే చెప్పాలి. కోచ్ అనేవాడు ఎందుకు కఠినంగా ఉంటాడో ఈ సినిమాలో ఆయ‌న న‌ట‌న చూస్తే తెలుస్తుంది. తాను న‌మ్మిన టాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయాల‌ని త‌ప‌న పడే కోచ్ గా వెంకీ న‌ట‌న ను వావ్ అనాల్సిందే. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆయ‌న పాత్ర‌తో ప్ర‌యాణం అయ్యేలా చేసి క‌ళ్ల‌ల్లో నీళ్లు తెప్పించాడు. ఇక రితికా సింగ్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా త‌క్కువే. స్ల‌మ్ ఏరియాలో పెరిగిన అమ్మాయి, బాక్స‌ర్ గా ట‌ర్న్  అవుతున్న స‌మ‌యంలో ఎదుర్కొనే ఇబ్బందుల్ని ఎక్క‌డా త‌న న‌ట‌న‌తో కాకుండా, పాత్ర‌తోనే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌చేసింది. రాముడు(రామేశ్వ‌రి) పాత్ర‌లో వైజాగ్ యాస‌లో ఒక అమ్మాయిలా బాగా మెప్పించింది. నిజంగా ఆ పాత్ర కోసం త‌ను ప‌డిన క‌ష్టం మ‌న‌కు తెర‌మీద క‌న‌ప‌డుతుంది. ఈ క్యారెక్ట‌ర్ చేయ‌డంలో త‌ను 100% స‌క్సెస్ సాధించింది. మిగ‌తా పాత్ర‌ల్లో త‌నికెళ్ల భ‌ర‌ణి, నాజ‌ర్, ర‌ఘుబాబు, ముంతాజ్ వారి ప‌రిధిలో వారు బాగానే చేశారు. 


సాంకేతిక నిపుణులు:

ఇక ద‌ర్శ‌కురాలు సుధ కొంగ‌ర మ‌న తెలుగు అమ్మాయి కావ‌డం మ‌న అదృష్టం. ఇంట గెలిచి ర‌చ్చ గెలుస్తారు కానీ ఈ ద‌ర్శ‌కురాలు ముందు ర‌చ్చ గెలిచి, ఇప్పుడు ఇంట గెలిచింద‌నే చెప్పాలి. కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న సమాహారం అని చెప్పిన ద‌ర్శ‌కురాలు చాలా నేచుర‌ల్‌గా క్యారెక్ట‌ర్స్ ను తీర్చిదిద్ద‌డంలో స‌క్సెస్ అయింది. వెంకటేష్ కోచ్ గా క‌ఠినంగా వ్య‌వ‌హరించ‌డం, ట్రైనింగ్ లో భాగంగా వెంక‌టేష్, రితికా సింగ్  మ‌ధ్య  వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ చాలా బాగా అల‌రిస్తాయి. అలాగే సెల‌క్ష‌న్స్ లో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల‌తో టాలెంట్ ఉన్న అమ్మాయిలు కూడా ఎందుకు వెనుక‌డుగు వేస్తున్నారో కాస్త ధైర్యంగానే చెప్పింది. అలాగే క‌థ చిన్న‌గా ఉన్నా, త‌న స్క్రీన్ ప్లే తో మ‌న‌కు ఎక్క‌డా బోర్ లేకుండా మ్యాజిక్ చేసింది. కథ కాస్త దారి త‌ప్పుతున్న‌ట్లుందే అనిపించే స‌మ‌యానికి స‌రిగ్గా క్లైమాక్స్ తో మళ్లీ త‌న మ్యాజిక్ ను ఉప‌యోగించి, ఒక్క‌సారిగా మ‌న మ‌న‌సుల్ని ట‌చ్ చేసింది. సంతోష్ నారాయ‌ణ్ సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. పాట‌లు అంత‌గా ఎక్క‌క‌పోయిన‌ప్ప‌ట‌కీ, రీరికార్డింగ్ తో ఆక‌ట్టుకున్నాడు. జింగిడి జింగిడి అంటూ వెంక‌టేష్ తో పాట పాడించి ఆయ‌న అభిమానులను ఆకట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఎడిట‌ర్  ఇంకాస్త ప‌ని చెప్పి ఉంటే సినిమా మ‌రో స్థాయిలో ఉండేది. శ‌క్తివేల్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


చివ‌ర‌గా, ఇలాంటి క‌థ‌ల‌తో మ‌న‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి, గ‌తంలో అశ్వ‌ని నాచ‌ప్ప‌, మొన్న వ‌చ్చిన దంగ‌ల్ ఇలాంటి కోవ‌లో వ‌చ్చిన‌వే.. అయితే వాటికి దీనికి ఎక్క‌డా పోలిక లేకుండా వెంక‌టేష్, రితికా సింగ్ త‌మ న‌ట‌న‌తో సినిమాను గ‌ట్టెక్కించార‌నే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇలాంటి క‌థ‌లు ఎన్నుకొన్న‌ప్పుడు కొన్ని నిజాలు చెప్పే ధైర్యం కావాలి. ఈ ద‌ర్శ‌కురాలు ధైర్యంగా చెప్పడంలో స‌క్సెస్ అయింది. సెల‌వులు మొద‌ల‌య్యాయి కాబ‌ట్టి క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువే  . కాపోతే వెంక‌టేష్ సినిమాలు ఎప్పుడూ కూడా నెమ్మ‌దిగా ప్రేక్ష‌కుల‌ను చేరుతుంది. 


పంచ్‌లైన్ః గురువును మించిన శిష్యురాలు 

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5