'గుంటూరోడు' మూవీ రివ్యూ


మంచు మ‌నోజ్. కెరీర్ మొద‌ట్లో స‌క్సెస్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డినా, ఒక‌సారి విజ‌యం అందుకున్నాక.. ఆ విజ‌యాల ప‌రంప‌ర‌ను బిందాస్, క‌రెంటు తీగ‌, పోటుగాడు లాంటి సినిమాల‌తో కొన‌సాగించాడు. పోనీలే ఈ మంచు కుర్రాడు మంచి దారిలో ప‌డ్డాడు అనుకునే టైమ్ లో స‌రిగ్గా.. శౌర్య‌, ఎటాక్ లాంటి ప్ర‌యోగాల‌తో దారుణ‌మైన ప‌రాజ‌యాల్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఈ సొట్ట‌బుగ్గ‌లోడి ఆశ‌ల‌న్నీ స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'గుంటూరోడు' మీదే ఉన్నాయి. సినిమాను ఏ ముహుర్తాన మొద‌లుపెట్టారో కానీ, ఫ‌స్ట్ లుక్ నుంచే ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను రేకెత్తించిన ఈ సినిమా ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ ను క్రియేట్ చేసింది. దానికి తోడు మెగాస్టార్‌తో వాయిస్ ఓవ‌ర్ చెప్పించి, మ‌రోసారి చిత్రంపై అంచ‌నాలను అమాంతం పెంచేశారు. మ‌నోజ్ కు జోడీగా ప్ర‌గ్యా జైస్వాల్ న‌టిస్తున్న ఈ సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.మ‌రి ఈ సినిమాపై మ‌నోజ్ పెట్టుకున్న ఆశ‌లు నెర‌వేరుతాయా, ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా మెప్పించిందా లేదా మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థ‌లోకి వెళితే, ఉద్యోగం స‌ద్యోగం లేని క‌న్నా( మ‌నోజ్)కు ఎవ‌రైనా త‌ప్పు చేస్తే, అత‌డికి ఎక్క‌డ లేని కోపం వ‌స్తుంది. కొడుకు ఇలా గొడ‌వ‌లు ప‌డుతున్నాడ‌ని తెలిసిన తండ్రి సూర్య నారాయ‌ణ ( రాజేంద్ర ప్ర‌సాద్) మ‌నోడికి పెళ్లి సంబంధాలు చూస్తాడు.అందులో భాగంగానే పెళ్లి చూపుల‌కు వెళ్లిన క‌న్నా కు అమృత అలియాస్ అమ్ము ( ప్రగ్యా జైస్వాల్) ని చూసి మొద‌టి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె క్రిమిన‌ల్ లాయ‌ర్ శేషు(సంప‌త్) చెల్లి. శేషు జోలికి ఎవ‌రైనా వ‌స్తే త‌న అంతు చూడ‌కుండా ఊరుకోడు. అలాంటిది అనుకోకుండా క‌న్నాకు, శేషుకు మధ్య గొడ‌వ జ‌రుగుతుంది. అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ ఎందుకు జ‌రుగుతుంది. క‌న్నా ను దెబ్బ తీయ‌డానికి శేషు ఎలాంటి క్రిమిన‌ల్ ప్లాన్ వేస్తాడు, చివ‌ర‌కు క‌న్నా ఎలా త‌న ప్రేమ‌ను పొందాడు అన్న‌ది క‌థ‌.


క్యారెక్ట‌ర్స్ ప‌రంగా చెప్పుకోవాలంటే, ముందుగా మ‌నోజ్ గురించి.. అస‌లు ఆడియ‌న్స్ మ‌నోజ్ నుంచి ఏదైతే ఆశిస్తారో ఆ అంశాల‌న్నీ ఇందులో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు మ‌నోజ్. యాక్టింగ్ ప‌రంగా మ‌నోజ్ త‌న‌లోని మాస్ యాంగిల్ ను మ‌రోసారి చూపించాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ ప‌ర్ఫెక్ట్ గా ఉన్నాయి.ఒక్క మాట‌లో చెప్పాలంటే గుంటూరోడు మ‌నోజ్ వ‌న్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక ప్ర‌గ్యా జైస్వాల్, మ‌నోజ్ చెప్పిన‌ట్లే ఇది ప్ర‌గ్యాకి మొద‌టి సినిమాలానే ఉంటుంది. కంచె, ఓం న‌మో వేంక‌టేశాయ లో చూసిన ప్ర‌గ్యా కి, ఈ సినిమాలో చూసే ప్ర‌గ్యాకి అస‌లు పోలికే ఉండ‌దు. త‌న అందాల‌తో సినిమాలో హీరోను, థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిపడేసింది. టైటిల్ సాంగ్ లో ప్ర‌గ్యా డ్యాన్సులు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటాయి.ఇక సంప‌త్ రాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విల‌న్ గా మ‌రోసారి సంప‌త్ ది బెస్ట్ అని నిరూపించుకున్నాడు. విల‌న్ గా సంప‌త్ ఈ సినిమాతో మ‌రో మెట్టు ఎక్కాడ‌నే చెప్పుకోవాలి. మ‌నోజ్‌కు తండ్రిగా రాజేంద్ర ప్ర‌సాద్ బాగా చేశాడు. హీరో ఫ్రెండ్స్ గా ప్ర‌వీణ్, స‌త్య అక్క‌డ‌క్క‌డా న‌వ్వించారు. సాంకేతిక ప‌రంగా, ద‌ర్శ‌కుడు స‌త్య మొద‌టి సినిమాకు, ఈ సినిమాకు అస‌లు పోలికే లేకుండా, కేవ‌లం మాస్ అంశాల‌ను మాత్ర‌మే తీసుకుని, ఎటువంటి ప్ర‌యోగాల జోలికి పోకుండా బాగా తెర‌కెక్కించాడు.ఇన్ని రోజులుగా మ‌నోజ్ నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే మ‌నోజ్ ను ప్రెజెంట్ చేశాడు. కాక‌పోతే కొంచెం ఎంటర్‌టైన్ మెంట్ మీద కూడా దృష్టి పెట్టి ఉంటే కాస్త బాగుండేది.వ‌సంత్ అందించిన సంగీతం చాలా బాగుంది. టాలీవుడ్ లో ఉన్న దుర‌దృష్టం ఏంటంటే, ఏ రంగంలో నైనా పేరున్న ఆ నలుగురే రాజ్యాన్ని ఏలుతారు త‌ప్పించి, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే నాధులు చాలా త‌క్కువ‌. వ‌సంత్ ను సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంచుకున్నందుకు ముందుగా ద‌ర్శ‌కుడు స‌త్య‌కు, మ‌నోజ్ కు అభినంద‌న‌లు చెప్పాల్సిందే. వ‌చ్చిన ఛాన్స్ ను వ‌సంత్ చాలా బాగా ఉప‌యోగించుకున్నాడు. సినిమాలోని ప్ర‌తి పాట చాలా బాగుంది. రీరికార్డింగ్ కూడా అదిరిపోయింది. సినిమాటోగ్ర‌ఫీ చాలా క్లీన్ గా, నీట్ గా ఉంది. ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ, కొన్ని సీన్స్ కు క‌త్తెర ప‌డి ఉంటే, ఇంకా బెస్ట్ అవుట్ పుట్ వ‌చ్చేది. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి ఈ సినిమా మొద‌టిదే అయిన‌ప్ప‌టికీ, ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ్వ‌కుండా నిర్మించారు. ప్ల‌స్ పాయింట్స్ః 


మ‌నోజ్ న‌ట‌న‌


ప్ర‌గ్యా జైస్వాల్ గ్లామ‌ర్


యాక్ష‌న్ సీన్స్


 వ‌సంత్ మ్యూజిక్


సంప‌త్ న‌ట‌న‌మైన‌స్ పాయింట్స్ః 


కొన్ని అన‌వ‌స‌ర స‌న్నివేశాలు


కామెడీ మిస్ అవ‌డంచివ‌ర‌గా, మనోజ్ ప‌వ‌ర్ ఫుల్ మాస్ యాక్షన్, ప్ర‌గ్యా గ్లామ‌ర్, సంప‌త్ విల‌నిజంతో తెర‌కెక్కిన ఈ సినిమా మాస్ ఆడియ‌న్స్ కు క‌న్నుల పండ‌గే.


పంచ్ లైన్ః  గుంటూరు మిర్చి ఒరిజిన‌ల్ బ్రీడే..


ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5