'గృహం' మూవీ రివ్యూ


సిద్దార్థ్ తాను హీరోగా న‌టిస్తూ, క‌థా స‌హకారం, స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం గృహం. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో తెర‌కెక్కించిన ఈ సినిమా ముందుగానే త‌మిళ‌, హిందీ రిలీజ్‌లు అయి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ, తెలుగు వెర్ష‌న్ రిలీజ్ మాత్రం కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ, ఫైన‌ల్ గా న‌వంబ‌ర్ 17న రిలీజ్ కు నోచుకుంది. త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మంచి రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో తెలుగులో కూడా ఈ సినిమాకు రెండు రోజుల ముందుగానే మీడియాకు స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్ వేశారు గృహం టీమ్. మామూలుగా ఇలా చేయ‌డం చాలా అరుదు. సినిమా మీద ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే కానీ ఇలా మీడియాకు ప్రీమియ‌ర్స్ వేయ‌రు. మ‌రి గృహం టీమ్ కాన్ఫిడెన్స్ ను సినిమా నిల‌బెట్టిందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః

సంతోషంగా ఉన్న క్రిష్(సిద్దార్థ్), ల‌క్ష్మి(ఆండ్రియా) ల ప‌క్కింటికి పాల్ (అతుల్ కుల‌క‌ర్ణి) కుటుంబం వ‌స్తుంది. ఇద్ద‌రి కుటుంబాలు ఒకే దగ్గ‌ర ఉండ‌టంతో ఒకొరికొక‌రు ఆస‌రాగా ఉంటుంటారు. ఒక‌రోజు స‌డ‌న్ గా పాల్ కూతురు జెన్నీ(అనీషా) కు బావిలో ప‌డుతుంది. అలా బావిలో ప‌డిన‌ప్పుడు క్రిష్ ఆమెను కాపాడతాడు.  త‌ర‌చుగా జెన్నీకి ఆరోగ్య స‌మ‌స్య‌లు రావ‌డం, వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం చూసి పాల్ కుటుంబం బాధ ప‌డుతుంది. వృత్తిరీత్యా డాక్ట‌ర్ అయిన క్రిష్ జెన్నీకు ట్రీట్‌మెంట్ ఇస్తాడు. అస‌లు జెన్నీ అలా ప్ర‌వర్తించ‌డానికి కార‌ణ‌మేంటి?  జెన్నీకు, క్రిష్ కు ఏమైనా పాత సంబంధాలున్నాయా..? అన్న‌ది తెర‌మీదే చూడాలి. 


న‌టీన‌టుల ప్ర‌తిభః 

సిద్దార్థ్ ఈ సినిమా కోసం చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. ముందుగా సాఫ్ట్ లుక్ లో హ్యాండ్‌స‌మ్ గా క‌నిపించిన సిద్దార్థ్ క్లైమాక్స్ లో త‌న వికృత రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. క్లైమాక్స్ లో సిద్దార్థ్ నుంచి మెరుగైన న‌ట‌న‌ను చూడొచ్చు. సినిమాకు మేజ‌ర్ హైలైట్ అంటే అనీషా విక్ట‌ర్. త‌న న‌ట‌నతోనే భ‌య పెట్టిందంటే ఎంత‌టి న‌ట‌న క‌న‌బ‌రిచిందో అర్థం చేసుకోవ‌చ్చు. కేవ‌లం న‌ట‌న మాత్ర‌మే కాదు త‌న బాడీ లాంగ్వేజ్, చూపు ఇలా ప్ర‌తీ అంశంతోనూ త‌న స్టైల్ లో ఆక‌ట్టుకుంటుంది. అతుల్ కుల‌క‌ర్ణికి మంచి పాత్ర ద‌క్కింది. ఆండ్రియా త‌న పాత్ర‌కు న్యాయం చేసింది. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర బాగానే చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

క‌థ ప‌రంగా చెప్పుకోవాలంటే చాలా చిన్న క‌థే. దేవుడు, దెయ్యం అనే శ‌క్తుల మీద ఒక చిన్న పాయింట్ ను తీసుకుని ద‌ర్శ‌కుడు దాన్ని చివ‌ర వ‌ర‌కు స‌స్పెన్స్ క్రియేట్ చేయ‌డం, ఒక ప‌ది నిమిషాల్లో చెప్పే క‌థ‌ను దాదాపు రెండున్న‌ర గంట‌ల‌ పాటూ తీసి, దాన్ని ప్రేక్ష‌కుడు ఆస్వాదించేలా, ఆసాంతం వారిని సీట్ల‌లో కూర్చోబెట్టేలా చేయ‌డం అనేది మామూలు విష‌యం కాదు. ఒక క‌థ‌కు చాలా గొప్ప స్క్రీన్ ప్లే ఉన్న‌ప్పుడే అది సాధ్య‌మ‌వుతుంది. గృహం విష‌యంలో దాన్ని సాధ్య‌మ‌య్యేలా చేశాడు ద‌ర్శ‌కుడు మిలింద్. టైటిల్స్ లోనే దేవుడుకు, దెయ్యానికి థ్యాంక్స్ కార్డ్ లు వేసి త‌నకున్నభిన్న అభిప్రాయాన్ని చాటుకున్నాడు. సినిమాలో ఎక్క‌డా ఈ సీన్ ఎందుకు అనే ఆలోచ‌న లేకుండా సినిమాను పూర్తి చేయ‌గ‌లిగాడు అంటే ద‌ర్శ‌కుడిగా త‌న‌కు ఇంత‌కంటే పెద్ద స‌క్సెస్ ఏముంటుంది..? ఎక్క‌డా క‌థ‌ను డీవియేట్ చేయ‌కుండా, త‌ను అనుకున్న‌ది ప్రేక్ష‌కుల‌కు చూపించ‌డంలో మిలింద్ నూటికి నూరుపాళ్లు స‌క్సెస్ అయ్యాడనే చెప్పాలి. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో క్లారిటీగా, నీట్ గా చూపించ‌గ‌లిగాడు. గిరీష్ రీరికార్డింగ్ సినిమాను త‌ర్వాతి స్థాయికి తీసుకెళ్లింది. మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వ‌డంలో గిరీష్  బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎడిటింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

అనీషా, సిద్దార్థ్ న‌ట‌న‌

రీరికార్డింగ్

స్క్రీన్ ప్లే 


మైన‌స్ పాయింట్స్ః 

ఎంట‌ర్‌టైన్‌మెంట్


పంచ్‌లైన్ః గృహం చూడ‌టానికి అడ్వాన్స్ ఇచ్చేయొచ్చు! 

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25 /5