ఘాజీ సినిమా రివ్యూ


మామూలుగానే టాలీవుడ్ లో ప్ర‌యోగాలు చాలా త‌క్కువ‌గా చేస్తుంటారు. అందులోనూ యుద్ధ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఏదో ఒక వార్ సీన్ క్రియేట్ చేయ‌డం త‌ప్ప‌, కంప్లీట్ యుద్ధ వాతావ‌ర‌ణంలో అయితే సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆ ప్ర‌య‌త్న‌మే చేశాడు డైర‌క్ట‌ర్ సంక‌ల్ప్ రెడ్డి. 1971 లో భార‌త్-పాక్ మ‌ధ్య స‌ముద్ర గ‌ర్భంలో జ‌రిగిన క‌థ‌ను అంద‌రికీ తెలియ‌చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే 'ఘాజీ'.

1971వ సం.లో పాకిస్థాన్.. తూర్పు పాకిస్థాన్, ప‌శ్చిమ పాకిస్థాన్ లుగా విడిపోయి, తూర్పు పాకిస్థాన్ స్వాతంత్య్రం కోసం చేస్తున్న పోరాటంలో భార‌త‌దేశ ప్ర‌మేయం ఉంద‌ని అనుకున్న ప‌శ్చిమ పాకిస్థాన్ భారత్ ను భౌగోళికంగా దెబ్బ‌తీయాల‌నుకుంటుంది. ఈ నేప‌థ్యంలో భార‌త నావికాద‌ళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ విక్రాంత్ ను స‌ముద్రంలో క‌లిపేయ‌డ‌మే టార్గెట్ గా పాకిస్థాన్ నేవీ చేపట్టిన మిష‌నే ఘాజీ. ఈ ఘాజీ స‌బ్ మెరైన్ భార‌త్ స‌బ్ మెరైన్స్ కంటే ఎన్నో రెట్లు బ‌ల‌మైన‌ది. అంత బ‌ల‌మైన పాకిస్థాన్ టార్గెట్ నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది. ఘాజీపై మ‌న నేవీ చేసిన పోరాటం ఏంటి అన్న‌దే క‌థ‌.

ఇక న‌టీన‌టుల విష‌యానికొస్తే ఎవ‌రికి వారే రెచ్చిపోయి న‌టించారు. తామే స్వ‌యంగా యుద్ధంలో పాల్గొంటున్నామంత ఆవేశంతో త‌మ‌ను తామ‌ను తెర‌పై ప్రెజెంట్ చేసుకున్నారు. లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ గా అర్జున్ వ‌ర్మ పాత్ర‌లో రానా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. రూల్స్ ను బ్రేక్ చేస్తుంటే కెప్టెన్ ను కూడా ఎదిరించే క్యారెక్ట‌ర్ ను రానా బాగా పండించాడు. యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలర్పించ‌డం కాదు, శత్రువు ప్రాణాలు తీసి గెల‌వ‌డం అనే నినాదాన్ని న‌మ్మే కెప్టెన్ గా ర‌ణ్‌వీర్‌సింగ్ పాత్ర‌లో కేకే మీన‌న్ జీవించేశాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే సినిమా మొత్తానికి హైలైట్ కేకే మీన‌న్. కెప్టెన్ మాట‌ను వినే పాత్ర‌లో అతుల్ కుల‌క‌ర్ణి చాలా బాగా చేశాడు. తాప్సీ పాత్ర చాలా చిన్న‌ది. ఏదో హీరోయిన్ ఉండాలి కాబ‌ట్టి తాప్సీని తీసుకున్నారు త‌ప్ప‌, అస‌లు క‌థ‌తో ఆమెకు ఏం సంబంధం ఉండదు.మిగ‌తా వారిలో ఓం పురి, నాజ‌ర్ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బాగానే మెప్పించారు.


అస‌లు ఘాజీకి మ‌రియు ఎస్21కు మ‌ధ్య జ‌రిగిన అండ‌ర్ వాట‌ర్ వార్ ను తెర‌కెక్కించాలి అన్న ఆలోచ‌న వ‌చ్చినందుకే ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ ను ప్రశంసించాలి. ఈ యుద్ధం గురించి ఇరు దేశాల మ‌ధ్య భిన్నాభిప్రాయం ఉన్న‌ప్ప‌టికీ, ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాలే రాలేదు. దేశంలోనే ఇలా ఒక అండ‌ర్ వార్ కు సంబంధించిన సినిమా తీయ‌డం ఇదే ప్ర‌థ‌మం. ఇప్ప‌టిఇ వ‌ర‌కు యుద్ధ నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌కు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ఇరికించాలి అప్పుడే ప్రేక్ష‌కులు సినిమాను ఆద‌రిస్తారు అన్న ఆలోచ‌న లేకుండా క‌థ‌ను తెర‌కెక్కించ‌డంతో సినిమాను మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు గ్రిప్పింగ్ గా తీయ‌గ‌లిగారు. అన‌వ‌స‌రంగా కామెడీ, పాట‌ల జోలికి పోకుండా మంచి ప‌ని చేశాడు. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కుడు ఎంతగా క‌ష్ట‌ప‌డ్డాడో, ఎంత రీసెర్చ్ చేశాడో సినిమాలో ప్ర‌తీ సీన్ లో క‌న‌బ‌డుతుంది. ముఖ్యంగా కొన్ని స‌న్నివేశాల‌ను వెంట్రుక‌లు నిక్క‌బొడుచుకునేలా తెర‌కెక్కించాడు ద‌ర్శకుడు.


సాధార‌ణంగా పాకిస్థాన్ వాళ్ల‌కు ఇండియా ప‌గ‌. కానీ సినిమాలో ఎక్క‌డా వాళ్ల‌ను మ‌రీ అరాచ‌కంగా, దుర్మార్గులుగా చూపించ‌కుండా, మ‌న దేశం కోసం భార‌తీయులు ఎలా ప‌నిచేస్తున్నారో, పాకిస్థాన్ కోసం వాళ్లు కూడా అంతే శ్ర‌మిస్తున్నార‌నేలా ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేయ‌డంలోనే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌ను మెచ్చుకోవాలి. సినిమాలో నెగిటివ్స్ లేవా అంటే ఉంటాయి.ఎంతో అంద‌మైన చంద‌మామకు కూడా పేర్లు పెట్టేంత గొప్ప‌వాళ్లం మ‌నం. కాబట్టి ఇలాంటి సినిమాల్లో కూడా అలాంటి అంద‌మైన లోపాలే ఉంటాయి త‌ప్ప చెప్పుకోద‌గినంత ఏమీ అనిపించ‌వు. 

ఇక మాథీ సినిమాటోగ్ర‌ఫీ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఆయ‌న స‌బ్ మెరైన్ ను త‌న కెమెరా కంటితో చూపించిన విధానం సూప‌ర్బ్. స‌ముద్ర గ‌ర్భంలో జ‌రిగే యుద్ధాన్ని విజువ‌ల్ ఎఫెక్స్ట్ తో చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ చాలా బాగుంది. స‌బ్ మెరైన్ ను, దాని లోప‌ల పార్ట్స్ ను అద్భుతంగా క్రియేట్ చేయ‌డంలో ఆర్ట్ డైర‌క్ట‌ర్ స‌క్సెస్ అయ్యాడు. కె రీ రికార్డింగ్ చాలా బాగుంది. పివిపి వారి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః

క‌థ‌

గ్రాఫిక్స్

ద‌ర్శ‌క‌త్వం

డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్ః

డ్రామా మిస్ అవ‌డం

అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాలు నెమ్మ‌దిగా సాగడం

తాప్సీ రోల్

పంచ్ లైన్ః భార‌త జాతికి 'సంక‌ల్పం'తో అందించిన చిత్రం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/ 5