'ద‌ర్శ‌కుడు' మూవీ రివ్యూ


టాలీవుడ్ లో త‌న‌కంటూ, ప్ర‌త్యేక పేరు తెచ్చుకున్న వైవిధ్య ద‌ర్శ‌కుడు సుకుమార్ , త‌న ఆలోచ‌న‌ల నుంచి పుట్టిన మరికొన్ని క‌థ‌ల‌ను కూడా త‌క్కువ బ‌డ్జెట్ లో తెర మీద చూపించాల‌న్న ఉద్యేశ్యంతో నిర్మాత‌గా మారి, సుకుమార్ రైటింగ్స్ అనే బ్యాన‌ర్ ను స్టార్ట్ చేసి, కుమారి 21ఎఫ్ సినిమా తీసి మంచి స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌న బ్యాన‌ర్ నుంచి వ‌స్తున్న రెండో సినిమాయే ఈ 'ద‌ర్శ‌కుడు'. ఈ సినిమాతో సుకుమార్ త‌న అన్న‌య్య కొడుకు అశోక్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సుకుమార్ చేసిన ప‌బ్లిసిటీ అంతా ఇంతా కాదు. బ‌న్నీ నుంచి ఎన్టీఆర్ వ‌ర‌కు త‌న హీరోలంద‌రినీ దాదాపుగా వాడేశాడు. దీంతో ఈ 'ద‌ర్శ‌కుడు' పై అంచ‌నాలు పెరిగిపోయాయి. మ‌రి ఈ 'ద‌ర్శ‌కుడు' అంద‌రి అంచనాల‌ను అందుకున్నాడా?  లేదా చూద్దాం.


క‌థః 
చిన్న‌ప్ప‌టి నుంచి ద‌ర్శ‌కుడు కావాల‌నే క‌ల ఉన్న మ‌హేష్‌(అశోక్)త‌న తండ్రి ప్రోత్సాహం మ‌రియు ప్యాష‌న్ తో రెండేళ్లు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేస్తాడు. ద‌ర్శ‌కుడు కావడానికి స్టోరీ సిద్ధం చేసుకుంటాడు. నిర్మాత‌కు చెప్పిన వెంట‌నే క‌థ న‌చ్చిన‌ప్ప‌టికీ, అందులో ల‌వ్ ట్రాక్ ను డెవ‌లప్ చేయ‌మ‌ని ప‌దిహేను రోజులు గ‌డువు ఇస్తాడు. ఈ లోగా మ‌హేష్ త‌న ఊరికి వెళ్లొస్తుండ‌గా ట్రైన్ లో న‌మ్ర‌త (ఈషా) తో ప‌రిచయం ఏర్ప‌డుతుంది. వాళ్లిద్ద‌రికీ మ‌ధ్య జ‌రిగే స‌న్నివేశాల‌నే మ‌హేష్ ల‌వ్ ట్రాక్ గా మ‌లుస్తాడు. న‌మ్ర‌త‌ట్రైన్ నుంచి వాట‌ర్ బాటిల్ కోసం దిగడం, ట్రైన్ మిస్ అవడం, మ‌హేష్ త‌న‌ను వెతుక్కుంటూ వెళ్లడం, అక్క‌డ న‌మ్ర‌త ఆప‌దలో ప‌డ‌టం, వారి నుంచి న‌మ్ర‌త‌ను మ‌హేష్ కాపాడ‌టం.. ఇలా ప్ర‌తీ సీన్ ను మ‌హేష్ త‌న క‌థ కోసం సీన్స్ గా మార్చుకుంటాడు. ఈ గ్యాప్ లో న‌మ్ర‌త మ‌హేష్ తో ప్రేమ‌లో ప‌డిన విష‌యాన్ని తెలుసుకున్న మ‌హేష్ దాన్ని కూడా సీన్ గా వాడేసుకుంటాడు. ఈలోగా అత‌డి మ‌న‌స్త‌త్వం తెలుసుకున్న న‌మ్ర‌త మ‌హేష్ కు దూర‌మ‌వుతుంది. తిరిగి వారిద్ద‌రూ ఎలా ద‌గ్గ‌ర‌య్యారు? ద‌ర్శ‌కుడు కావాల‌నే మ‌హేష్ క‌ల చివ‌ర‌కు నెర‌వేరిందా లేదా అన్న‌దే అస‌లు క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః 
డైర‌క్ట‌ర్ రాసుకున్న క‌థ‌కు అశోక్ న్యాయం అయితే చేయ‌గ‌లిగాడు కానీ, సినిమాకు ఇంకా తెలిసిన క్యాస్టింగ్ ఉంటే, సినిమా తీరు ఇంకా బాగుండేది. ఇషా త‌న న‌ట‌న‌తో మెప్పించింది. హీరోతో ల‌వ్ ను ఎక్స్‌ప్రెస్ చేసే విధానం, ప్రీ క్లైమాక్స్ లో హీరోతో త‌న ప్రేమ‌ను చెప్పే తీరు, క్లైమాక్స్ లో హీరోను తిట్ట‌డం, మ‌ళ్లీ చివ‌ర‌కు అత‌నికి ద‌గ్గ‌ర‌య్యే స‌న్నివేశాలు.. ఇలా ప్ర‌తి సీన్ లో మంచి అభిన‌యాన్ని క‌నబ‌రిచింది. మిగిలిన వారిలో అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా సుద‌ర్శ‌న్ కు మంచి పాత్ర ద‌క్కింది. కో-డైర‌క్ట‌ర్ గా జెమినీ సురేష్, నిర్మాత పాత్ర‌లో కేదారినాధ్, నోయ‌ల్ వారి వారి పాత్ర‌ల ప‌రిధి మేర‌ బాగా  చేశారు. 

సాంకేతిక నిపుణులుః
ద‌ర్శ‌కుడిగా హ‌రిప్ర‌సాద్ జ‌క్కాకు ఇది మొద‌టి సినిమా అయినా, స్క్రీన్ ప్లే తో క‌థ‌ను న‌డిపించిన విధానం చాలా బాగుంది. కొన్ని స‌న్నివేశాల‌ను చాలా ఫ్రెష్ గా తెర‌కెక్కించాడు. త‌న సీన్స్ ను లోనే కామెడీ ఉండేలా చూసుకున్నాడే త‌ప్పించి, కామెడీ కోసం ప్ర‌త్యేకంగా సీన్స్ ను రాసుకోలేదు. సాయి కార్తీక్ అందించిన థీమ్ మ్యూజిక్ సినిమాకే హైలైట్. పాట‌లు కూడా సంద‌ర్భానుసారంగా వ‌చ్చి, సినిమాను మంచి ఫీల్ తో న‌డిపిస్తాయి. ప్ర‌వీణ్ అనుమోలు సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా నీట్‌గా ఉంది. సుకుమార్ సినిమా రేంజ్ కు త‌గ్గ‌ట్లు సినిమాను బాగానే నిర్మించాడు. 

ప్ల‌స్ పాయింట్స్ః 
హీరో క్యారెక్ట‌రైజేష‌న్
హీరోయిన్ న‌ట‌న‌
కామెడీ
స్క్రీన్ ప్లే

మైన‌స్ పాయింట్స్ః 
వీక్ క్లైమాక్స్

పంచ్‌లైన్ః ద‌ర్శ‌కుడు బాగానే మెప్పించాడు
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5