చెలియా మూవీ రివ్యూ


ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం కోసం అన్వేషిస్తూ,ప్రేమ‌క‌థ‌లు తెర‌కెక్కించ‌డంలో త‌నదైన ముద్ర వేసిన ద‌ర్శ‌కుల్లో మ‌ణిరత్నం ఒక‌రు. రోజా, బొంబాయి, సఖీ లాంటి చిత్రాలతో దేశంలోని టాప్ ద‌ర్శ‌కుల్లో మణిరత్నం పేరు సంపాదించుకొన్నారు. ఈ రోజుల్లో ప్రేక్ష‌కుల‌ను ల‌వ్ స్టోరీస్ తో మెప్పించాలి అంటే మామూలు విష‌యం కాదు. వారి ఆలోచ‌న‌ల‌కు, అల‌వాట్ల‌కు, అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉండాలి. అప్పుడే ఆ సినిమావైపు ఆడియ‌న్స్ చూస్తున్నారు. లేదంటే ఇలాంటివి ఇంత‌కుముందు చాలానే చూశాంలే అని వాటి వైపు కూడా చూడ‌ట్లేదు. ఈ విష‌యంలో ఇప్ప‌టి ట్రెండ్ కు త‌గ్గ‌ట్లు సినిమా తీయ‌డంలో బాగానే అప్‌డేట్ అయ్యాడ‌నే చెప్పాలి. అయితే గ‌త కొంత కాలంగా విజ‌యం అనేది ఆయ‌న దరిదాపుల్లోకి కూడా రావట్లేదు. రావ‌ణ్, క‌డ‌లి చిత్రాల ఘోర ప‌రాజ‌యం తర్వాత మ‌ణిర‌త్నం సినిమాల మీద చాలా మందికి హోప్స్ కూడా త‌గ్గిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కార్తీ, అదితి రావు హైదారి జంట‌గా చెలియా అనే అంద‌మైన ప్రేమ‌క‌థ‌ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. మ‌రి ఈ చిత్రం ద్వారా అయినా మ‌ణిర‌త్నం త‌న మ్యాజిక్ ను చూపించ‌గ‌లిగాడా, మణిర‌త్నం ఈజ్ బ్యాక్ అని ప్రేక్ష‌కుల‌తో అనిపించుకోగ‌ల‌డా లేదా అన్న‌ది మన స‌మీక్షలో చూద్దాం. 


క‌థ‌లోకి వెళితే, 

చెలియా కథ 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో జరుగుతుంది. ఓ యుద్ధవిమాన ప్రమాదంలో గాయపడిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ వరుణ్ అలియాస్ వీసీ(కార్తీ) పాకిస్తాన్ ఆర్మీకి చిక్కుతాడు. రావల్పిండిలోని జైల్లో వరుణ్ ను చిత్రహింసలకు గురిచేస్తారు. అలా చీకటి గదిలో బందిగా ఉండగా వరుణ్ కి గతం గుర్తుకు వస్తుంది. వరుణ్, శ్రీనగర్ ఎయిర్ బేస్ లో ఫైటర్ పైలెట్. తన సుపీరియర్ ఆఫీసర్ కూతురు గిరిజ( శ్రద్దా శ్రీనాథ్) ప్రేమలో ఉంటాడు. ఆమెతో కలిసి లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన వరుణ్ కు యాక్సిడెంట్ అవుతుంది. మిలటరీ హాస్పిటల్ కు తీసుకెళ్లేంత సమయం లేకపోవటంతో దగ్గర్లోని హాస్పిటల్ లో చేరుస్తారు. అక్కడ డ్యూటి డాక్టర్ లేకపోవటంతో అప్పుడే డ్యూటిలో చేరిన లీలా అబ్రహం(అదితి రావ్ హైదరీ) వరుణ్ ని ట్రీట్ చేస్తుంది. తొలి చూపులోనే లీలాతో ప్రేమలో పడిన వరుణ్, గిరిజ వాళ్ల పేరెంట్స్ కు నో చెప్పేస్తాడు.

హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన దగ్గరనుంచి లీలా వెంట పడటం స్టార్ట్ చేస్తాడు. లీలా అన్న వరుణ్ బ్యాచ్ మెట్ కావటంతో వరుణ్ గురించి ముందే తెలుసుకున్న లీలా వరుణ్ కి దగ్గరవుతుంది. అయితే తన మాటే గెలవాలన్న నెగ్గలన్నట్టుగా ఉండే వరుణ్, తన ఇండివిడ్యూవాలిటీ తనకు ఉండాలనుకునే లీలాల మధ్య తరుచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవల మధ్యే లీలా గర్భవతి అని తెలుస్తుంది. వరుణ్ పెళ్ళికి నో చెప్పటంతో లీలా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. అప్పటికే కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వటంతో లీలాను వెయిట్ చేయమని చెప్పి వరుణ్ వెళ్లిపోతాడు. అలా వెళ్లిన వరుణ్ ఫైటర్ ప్లేన్ ప్రమాదం కారణంగా కూలిపోతుంది. వరుణ్ పాక్ ఆర్మీకి బంధీ అవుతాడు. పాక్ జైల్ ఉన్న వరుణ్ ఎలా బయటపడ్డాడు.? తిరిగి లీలాను కలుసుకున్నాడా..? లీలా వరుణ్ ను ఎలా రిసీవ్ చేసుకుంది..? అన్నదే మిగతా కథ.


 

న‌టీన‌టుల ప్ర‌తిభః

ముందుగా చెప్పుకోవాల్సింది కార్తీ గురించి. అస‌లు ఈ సినిమాలో కార్తీని త‌ప్ప మ‌రెవ్వ‌ర్నీ ఊహించుకోలేం.అటు ఎయిర్ ఫోర్స్ అధికారిగా, ఇటు ప్రేమికుడిగా చాలా బాగా చేశాడు. అదితిరావు హైదారి త‌న న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంది. త‌ను ప్రేమించిన అబ్బాయి క‌రెక్ట్ కాద‌ని త‌ను ప‌డే బాధ‌ని, ఎమోష‌న్స్ ను బాగా ప‌లికించ‌గ‌లిగింది. రుక్మిణి విజ‌య కుమార్ అదితి స్నేహితురాలిగా మెప్పించింది.ఢిల్లీ గ‌ణేష్ కూడా త‌న  న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. మిగ‌తా వారు త‌మ త‌మ ప‌రిధిలో బాగానే చేశారు.

సాంకేతిక వ‌ర్గంః 

కార్గిల్ యుద్దం, జైల్లో ఉండటం ఇదంతా కేవ‌లం హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ కోసమే అన్న‌ట్లు ఉంటుంది త‌ప్పించి, చెలియా అనేది పూర్తి ప్రేమ క‌థా చిత్రం. స్వార్థం లేకుండా త‌న‌కంటే ఎక్కువ‌గా ప్రేమించే అమ్మాయికి, త‌న‌కోసం ఒక అమ్మాయిని ప్రేమించే అబ్బాయికి మ‌ధ్య సాగే ల‌వ్ స్టోరీ. మ‌ణిర‌త్నం సినిమాల్లో ఎలాంటి ప్రేమ‌క‌థ‌ల‌ను చూస్తామో, ఈసారి కూడా అలాంటి ప్రేమ‌క‌థ‌నే తెర‌కెక్కించారు మ‌ణి సార్. హీరో అనేవాడు ఎప్పుడూ ప‌ర్ఫెక్ట్ గా ఉండ‌కూడదు, అమ్మాయి ఎప్పుడూ ప‌ర్ఫెక్ట్ గా ఉండే అబ్బాయిని ప్రేమించ‌దు అనే విష‌యాన్ని మ‌రోసారి మ‌ణిర‌త్నం చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న గ‌త సినిమాల్లాగానే ఈ సినిమా కూడా ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లో ఉంటుంది. సినిమా స్లో గా ఉన్న‌ప్ప‌టికీ,  చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కులకు ఎమోష‌న‌ల్ ట‌చ్ బాగానే ఇచ్చాడు మ‌ణిర‌త్నం.


మ‌ణిర‌త్నం సినిమా అంటే టెక్నీషియ‌న్స్ అంద‌రూ దాదాపు పేరుమోసిన వారే ఉంటారు. ర‌వి వ‌ర్మ‌న్ కెమెరా ప‌నితీరు చాలా బాగుంది. ఏ ఆర్ రెహ‌మాన్ సంగీతంలోని పాటలు చెప్పుకోద‌గినంత ఏమీ బాలేవు. నేప‌థ్య సంగీతం చాలా బావుంది. కిర‌ణ్ రాసిన మాట‌లు కూడా బావున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః  

సినిమాటోగ్ర‌ఫీ

కార్తీ, అదితిరావు హైదారి


మైన‌స్ పాయింట్స్ః 

ఎంట‌ర్ టైన్ మెంట్ లేక‌పోవ‌డం

స్లో నెరేషన్


చివ‌ర‌గా, ఈ సినిమాకు ఎవ‌రైతే క‌నెక్ట్ అవుతారో వారు ఈ సినిమాతో ప్రేమ‌లో ప‌డ‌తారు. క‌నెక్ట్ కాక‌పోతే, సినిమాను ఇంకెంతసేపు భ‌రించాల్రా బాబోయ్ అనుకుంటారు. 


పంచ్‌లైన్ః మ‌ణిర‌త్నం మార్క్ లవ్ స్టోరీ

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5