'ఆనందోబ్ర‌హ్మ' మూవీ రివ్యూ


టాలీవుడ్ లో హ‌ర్ర‌ర్ కామెడీ చిత్రాల‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌ర్వాత హ‌ర్ర‌ర్ కామెడీ సినిమాలు చాలానే వ‌చ్చాయి కానీ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిని చేరుకోలేదు. ఆ స్థాయేంటి? ఆ సినిమా స్థాయికి ద‌గ్గ‌ర‌గా కూడా వెళ్లింది లేదు. ఆ జాన‌ర్ లో వ‌చ్చిన ఎక్కువ శాతం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు మ‌ళ్లీ అదే జోన‌ర్ లో మ‌రో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాలో శ్రీనివాస‌రెడ్డి కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. మామూలుగా దెయ్యాల‌ను చూసి మ‌నుషులు భ‌య‌ప‌డ‌తారు కానీ మ‌నుషుల‌ను చూసి దెయ్యాలు భ‌య‌ప‌డితే ఎలా ఉంటుంద‌నే లైన్ పై తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః

ఒక ఇంట్లో కొన్ని దెయ్యాలు తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఆ ఇంటికి శ్రీనివాస్ రెడ్డి అండ్ టీమ్ ఎంట్రీ ఇస్తుంది.ఆ ఇంట్లో దెయ్యం ఉంద‌నే విష‌యం గుర్తించి వారు ధైర్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటారు. దాంతో దెయ్యాలు భ‌య‌ప‌డుతూ ఉంటాయి. అస‌లు ఆ ఇంటికి దెయ్యాల‌కు సంబంధం ఏంటి? దెయ్యాలు ఉన్నాయ‌ని తెలిసీ, శ్రీనివాస్ రెడ్డి అండ్ టీమ్ ఎందుకు ఆ ఇంట్లోకి వెళ్తుంది అన్న‌దే అస‌లు క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః

ఈ సినిమా రిలీజ్ కు ముందు తాప్సీ చేసిన హ‌డావిడి చూసిన త‌ర్వాత సినిమా మొత్తం తాప్సీ భుజాల‌పై వేసుకుని మ‌రీ న‌డిపిస్తుందేమో అనుకున్న వారంద‌రికీ, సినిమా చూశాక మాత్రం ఈ పాత్ర కోసమా తాప్సీ ఇంత‌గా హ‌డావిడి చేసింది. అస‌లు ఇలాంటి రోల్స్ చేయ‌డం వ‌ల్ల ఆమెకు కొత్త‌గా ఒరిగేందేంటో త‌న‌కే తెలియాలి. శ్రీనివాస్ రెడ్డి త‌న క్యారెక్ట‌ర్ కు న్యాయం చేయ‌గ‌లిగాడు కానీ, అంత గొప్ప‌గా చెప్పుకోవాల్సిందేమీ లేదు. సినిమాలో చెప్పుకోవాల్సింది అంటే ష‌క‌ల‌క శంక‌ర్ గురించి. సినిమా ఏమైనా నిల‌బ‌డే ఛాన్సుందా అంటే అది కేవ‌లం ష‌క‌ల‌క శంక‌ర్ వ‌ల‌నే. వెన్నెల కిషోర్ మ‌రోసారి త‌న కామెడీ టైమింగ్ తో న‌వ్వించ‌గ‌లిగాడు. రాజీవ్ క‌న‌కాలకు మంచి పా్త్ర ద‌క్కింది. తాగుబోతు ర‌మేష్ త‌న క్యారెక్ట‌ర్ లో భాగంగానే బాగా చేశాడు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే చేశారు.


విశ్లేష‌ణః

హ‌ర్ర‌ర్/కామెడీ జోనర్‌లో లో బడ్జెట్‌లో ఎంత ఎఫెక్టివ్‌గా సినిమా తీయవచ్చో, దాంతో ఎంత పెద్ద విజయాన్ని సాధించవచ్చో కొంత కాలం క్రితమే వచ్చిన ‘ప్రేమకథాచిత్రమ్‌’తో చూసాం. హారర్‌కి కామెడీ టచ్‌ ఇస్తే నవ్వించడం చాలా ఈజీ అయిపోతుంది. అయితే అందుకోసం తెలివిగా సన్నివేశాలు రాసుకోవాలి. అవే సీన్లని తిప్పి తిప్పి తీస్తే కాసేపటి తర్వాత అవి నవ్వించలేవు. ఈ విషయాన్ని ‘ఆనందోబ్ర‌హ్మ’ లో విస్మరించారు. ఒకటే సీన్‌ని అదే పనిగా అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తూ చాలా టైమ్‌ వేస్ట్‌ చేసారు.


ఇక హారర్‌ సీన్స్‌తో భయపెట్టడానికి కూడా ప్రయత్నం జరగలేదు. ప్రధానంగా దృష్టి మొత్తం నవ్వించడం మీదే పెట్టారు. ఆ కామెడీ ఏమో సినిమా మొదలైన పావుగంటకే బోర్ కొట్టేస్తుంది. ఫ‌స్టాఫ్ అయిపోయే వ‌ర‌కు సినిమా అస‌లు క‌థ‌లోకి వెళ్ల‌దు అంటే ఎంత బోరింగ్ అనేది అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ఇక‌ సినిమాను ఆసక్తికరంగా మార్చే భారం మొత్తం గురించిన ఫ్లాష్‌బ్యాక్ పై పడుతుంది. అదేమో రొటీన్‌ తంతుగా మారింది. ఎలాంటి కొత్తదనం లేని ఒక మామూలు సినిమా అనే సంగతి ఫ్లాష్ బ్యాక్ తో అర్థం అయి, చివ‌ర‌కు క్లైమాక్స్ తేలిపోయింది.


సాంకేతిక నిపుణులుః

భ‌యానికి న‌వ్వంటే భ‌యం అని కొత్త కాన్సెప్ట్ ను తీసుకుని, దాంతోనే ప్రేక్ష‌కుల దృష్టిని ఆకర్షించ‌డంలో స‌క్సెస్ అయిన డైర‌క్ట‌ర్, దాన్ని ప్రెజెంట్ చేయ‌డంలో మాత్రం విఫ‌లమ‌య్యాడు. ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ మీద ఇంకాస్త గ్రిప్ తో తీసి ఉంటే, సినిమా నిజంగా మంచి స్థాయిలో ఉండేది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. రీరికార్డింగ్ సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లు ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః

సెకండాఫ్ లో కామెడీ

వెన్నెల కిషోర్, ష‌క‌ల‌క శంక‌ర్


మైన‌స్ పాయింట్స్ః

క్లైమాక్స్

అన‌వ‌స‌ర‌మైన సీన్స్

చివ‌ర‌గా, కామెడీ, హారర్‌ ఏదీ సరిగా పండని ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు చాలా చాలా తక్కువ. కాసేపు కాలక్షేపమైనా కానీ కేవలం రెండు గంటలే ఉన్న ఈ చిత్రాన్ని ఆసాంతం విసుక్కోకుండా చూడడం అసాధ్యం. నటీనటుల అభినయం, కొన్ని కామెడీ దృశ్యాలు మినహా ఆనందోబ్ర‌హ్మ కు సంబంధించి స్కోర్‌ చేసినవి ఏమీ లేవు. కొన్ని అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌తో ఆనందోబ్ర‌హ్మ విసుగు పుట్టిస్తుంది. అతి తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సేఫ్‌ జోన్‌లోకి రావడానికి ఆ తక్కువ ఖర్చే కారణమవ్వాలి.


పంచ్‌లైన్ః భ‌య‌మూ లేదూ..నవ్వూ లేదు

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5