'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ


సినీ ప‌రిశ్ర‌మ‌లో కాంబినేష‌న్ల‌ను ఎక్కువ‌గా న‌మ్ముతుంటారు. ఒక డైర‌క్ట‌ర్ తో ఆ హీరో తీసిన సినిమా విజ‌యం సాధించి, మ‌ళ్లీ పొర‌పాటున ఆ కాంబినేష‌న్ సెట్ అవ‌డం ఆల‌స్యం, అంతే ఇక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేసినంత ఆనందంలో మునిగిపోయి, అంచ‌నాల‌ను పెంచేసుకుంటారు సినీ అభిమానులు. ఈ మ‌ధ్య అలా కాంబినేష‌న్ లో వ‌చ్చి అంత హైప్ తెచ్చుకున్న సినిమా 'అజ్ఞాత‌వాసి'. ప‌వ‌న్ క‌ళ్యాణ్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో గ‌తంలో వ‌చ్చిన రెండు సినిమాలూ భారీ స‌క్సెస్ ను సాధించడంతో ఈ చిత్రం మొద‌లు పెట్టిన రోజే ప‌వ‌న్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డింద‌నుకున్నారు. మ‌రి అంద‌రి అంచ‌నాల‌ను ఈ సినిమా నిల‌బెట్టిందా లేదా స‌మీక్ష‌లో చూద్దాం..


క‌థః 

ఏబీ గ్రూప్ అధినేత గోవింద్ భార్గ‌వ్ అలియాస్ విందా(బొమ‌న్ ఇరానీ) ని, అత‌ని వార‌సుడిని వ్యాపార  లావాదేవీల కార‌ణంగా కొంత‌మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు చంపేస్తారు. వారిని ఎవ‌రు చంపేసారో తెలుసుకునేందుకు విందా భార్య ఇంద్రాణి(ఖుష్బూ) అస్సాం నుంచి బాల సుబ్ర‌హ్మ‌ణ్యం(ప‌వ‌న్ క‌ళ్యాణ్) ను పిలిపిస్తుంది. అస‌లు బాల సుబ్ర‌హ్మ‌ణ్యం ఎవ‌రు?  విందాను హ‌త్య చేసిన వాళ్ల‌ను అత‌డు ఎలా చేధిస్తాడు?  బాల సుబ్ర‌హ్మ‌ణ్యం అభిషిక్త్ భార్గ‌వ్ గా ఎలా మారాడు? అన్న‌దే క‌థ. 


న‌టీన‌టుల ప్ర‌తిభః 

కేవ‌లం ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని, వాళ్ల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డ‌మే ప‌నిగా అనుకున్న ప‌వ‌న్ త‌న మేన‌రిజమ్స్ తో మ‌రోసారి అభిమానుల‌ను ఆక‌ట్ట‌కుంటాడు. అయితే ఈ న‌ట‌న ప‌వ‌న్ ఫ్యాన్స్ కు స‌ర‌దాగా అనిపించినా, స‌గ‌టు ప్రేక్ష‌కుడికి మాత్రం కాస్త విసుగుగానే అనిపిస్తుంది. ఆడ‌వాళ్ల‌లా ప్ర‌వర్తించ‌డం, చిన్న పిల్లాడిలా గెంత‌డం లాంటివి ఏదో అప్పుడ‌ప్పుడు అంటే బాగానే ఉంటుంది. బాగా పేలుతుంది. కానీ సినిమా మొత్తం అలానే ఉంటే చూసే వారికి చిరాకు త‌ప్ప ఏం ఉండ‌దు. అయితే ఇలాంటి న‌ట‌న‌ను తీసుకొచ్చి త్రివిక్ర‌మ్ ప‌వ‌న్ ''న‌ట విశ్వ‌రూపం'' మీరు అజ్ఞాత‌వాసిలో చూస్తారు అన‌డ‌మే కాస్త హాస్యాస్ప‌దంగా  ఉంది. ప‌వ‌న్ బాడీ లాంగ్వేజ్, త‌న మేన‌రిజ‌మ్స్ త‌ప్ప ప‌వ‌న్ గొప్ప న‌టుడు, న‌ట విశ్వ‌రూపం చూపించాడు అనేంత గొప్ప‌గా న‌టిస్తాడు అని త‌న ఫ్యాన్స్ కూడా అనుకోరేమో. అలాంటిది  త్రివిక్ర‌మ్ ఈ న‌ట‌నను అలా ఎందుకు పోల్చాడో త‌న‌కే తెలియాలి. కానీ ప‌వ‌న్ అభిమానులు త‌న‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో, ప‌వ‌న్ నుంచి వారు ఆశించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ ను ఇవ్వ‌డంలో ప‌వ‌న్ త‌న కృషి తాను బాగా చేశాడ‌నే చెప్పాలి. ఫైట్స్ లోనూ, కొన్ని స‌న్నివేశాల్లోనూ త‌న మార్క్ మ్యాన‌రిజ‌మ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇక హీరోయిన్స్ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. వారి పాత్ర‌లు  కూడా ఎంత విచిత్రంగా ఉంటాయంటే.. ఒక హీరోయిన్ బాత్రూమ్ ద‌గ్గ‌ర త‌న బాధ‌ను  షేర్ చేసుకున్నాడ‌ని హీరోకి క్లోజ్ అయితే, మ‌రో హీరోయిన్ త‌న‌ను చూసి ఎందుకు ఏడ్చాడు అని త‌న‌కి ద‌గ్గ‌రవుతుంది. ఏదో ఫీమేల్ గ్లామర్ సినిమాకు అవ‌స‌ర‌మని అలా పెట్టారే త‌ప్పించి, హీరోయిన్స్ తో పెద్ద‌గా ప‌నేం లేదు ఈ సినిమాకి. కానీ హీరోయిన్స్ ఇద్ద‌రినీ ఒక విష‌యంలో అభినందించాల్సిందే. తెలుగు హీరోయిన్సే తమ డబ్బింగ్ తాము చెప్పుకోని ఈ రోజుల్లో అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు ఇద్ద‌రూ అజ్ఞాత‌వాసి కోసం త‌మ గొంతు విప్పి త‌మ పాత్ర‌ల‌కు తామే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. విల‌న్ గా ఆది పినిశెట్టి లుక్స్, న‌ట‌న బాగున్న‌ప్ప‌టికీ త‌న పాత్ర కూడా బ‌లంగా లేక‌పోవ‌డంతో ఆది తేలిపోయాడు. చాలా కాలం త‌ర్వాత తెర‌పై క‌నిపించిన ఖుష్బూ, ఇంద్రాణి పాత్ర‌లో బాగా చేసింది. క్లైమాక్స్ లో త‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌ర్మ‌, శ‌ర్మ పాత్ర‌ల్లో ముర‌ళీ శ‌ర్మ‌, రావు ర‌మేష్ కాస్త న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. వెన్నెల కిషోర్ కాసేపే ఉన్న‌ప్ప‌టికీ క‌నిపించే కాసేపు బాగా ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. త‌నికెళ్ల భ‌ర‌ణి, సంప‌త్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మిగిలిన వారు వారి ప‌రిధిలో ఓకే అనిపించారు. 


సాంకేతిక నిపుణులుః 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరోను పెట్టి సినిమా తీసేట‌ప్పుడే అంద‌రికీ అర్థ‌మ‌వుతుంది. క‌థంతా దాదాపు ప‌వ‌న్ చుట్టూనే తిరుగుతుంది అని. కానీ అజ్ఞాత‌వాసి ప‌వ‌న్ కోసం మాత్ర‌మే సినిమా తీసిన‌ట్ల‌నిపిస్తుంది. సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశంలో ప‌వ‌న్ దాదాపు ఉంటాడు. స‌రే ప‌వ‌న్ చుట్టూ స‌న్నివేశాల‌ను క్రియేట్ చేశాడు అనుకుందాం. ఆ స‌న్నివేశాల్లో మినిమం ప‌వ‌న్ స్థాయికి త‌గిన ఒక‌టి రెండు ఎలివేష‌న్ సీన్స్ అయినా సినిమాలో ఉన్న‌ప్పుడే క‌దా సినిమాలోని హీరోయిజం కాస్త క‌న‌బ‌డుతుంది. అలా ఏం లేకుండా ఈయ‌న హీరో, ఏం చెప్తే అది జ‌రిగిపోవాలి అంటే సినిమా రిజ‌ల్ట్ ఇలాగే ఉంటుందేమో. స‌రే హీరో తెలివైన‌వాడు కాబట్టి ఇవ‌న్నీ చేశాడ‌నుకుందాం. ఒక హీరో తెలివైన‌వాడు అని ఎలా డిసైడ్ చేయాలి.విల‌న్ వేసే ఎత్తుల‌ను తిప్పి కొట్టి విజ‌యం సాధించిన‌ప్పుడు. కానీ ఇక్క‌డ మాత్రం త్రివిక్ర‌మ్ అనుకున్నాడు కాబ‌ట్టి, ప‌వ‌న్ తెలివైనవాడు అయిపోయాడు. లార్గోవించ్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన అజ్ఞాత‌వాసి.. అస‌లు త‌ను ఏం దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెర‌కెక్కించాడో అర్థం కాకుండా చేస్తుంది. అస‌లు క‌థ ఇండియాలో జ‌రుగుతుందా, ఫారిన్ లొకేష‌న్స్ లో జ‌రుగుతుందా అన్న‌ది కూడా అర్థం కాకుండా సినిమాను తెర‌కెక్కించాడు మన మాట‌ల మాంత్రికుడు. చూసిన క‌థ‌ల‌నే, చెప్పిన క‌థ‌ల‌నే త‌న మార్క్ డైలాగ్స్ తో, స‌న్నివేశాలతో ర‌క్తికట్టించే త్రివిక్ర‌మ్ ఈ సినిమాలో త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. ఏదో నాలుగైదు డైలాగులు బాగున్న‌ప్ప‌టికీ ఇవిరా త్రివిక్ర‌మ్ డైలాగులంటే.. అనే రేంజ్ లో మాత్రం లేవు. ఇంట‌ర్వెల్ ముందు వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్, ప‌వ‌న్-ఖుష్బూల మ‌ధ్య అనుబంధాన్ని ఎలివేట్ చేసే సీన్స్ త‌ప్ప సినిమాలో ఆకట్టుకునే సీన్స్ పెద్ద‌గా ఏం లేవు. అస‌లు ఒక్క మాట‌లో చెప్పాలంటే ఏంటి మ‌నం మాట్లాడుకుంటుంది త్రివిక్ర‌మ్ సినిమా గురించేనా అని ఆలోచించుకునేంత‌. త్రివిక్ర‌మ్ కెరీర్ లోనే ఇలాంటి త‌క్కువ స్థాయి సినిమా రాలేందంటే అర్థం చేసుకోవ‌చ్చు. క‌థ‌ను స‌రిగ్గా ముందుగానే బేరీజు వేసుకుని ఉండుంటే.. త్రివిక్రమ్ ప్లాన్ బి అప్లై చేసినా త‌న కెరీర్ లో మ‌రో అత్తారింటికి దారేది లాంటి సినిమా త‌న ఖాతాలో ఉండేదేమో. 

క‌థ‌, క‌థ‌నాల ప్ర‌కారం వీక్ గా ఉన్న అజ్ఞాత‌వాసికి టెక్నిక‌ల్ ప‌రంగా మాత్రం ఏం లోటు లేద‌నే చెప్పాలి. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. త‌న కెమెరా కంటితో ప్ర‌తీ సీన్ ను చాలా రిచ్ గా చూపించాడు. ఇక అజ్ఞాత‌వాసి తో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అవుతున్న అనిరుధ్ సంగీతంలో వ‌చ్చిన పాట‌లు ట్యూన్స్ కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ పెద్ద‌గా క్యాచీ గా లేవు. క్యాచీగా ఉన్న రెండు పాట‌లు కూడా స్క్రీన్ మీదకి వ‌చ్చేస‌రికి అస్స‌లు బాలేవు. సంద‌ర్భం లేకుండా పాట‌లు రావ‌డం, పాట పిక్చ‌రైజేష‌న్ బాగా లేక‌పోవ‌డం బాగా మైన‌స్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాడిన కొడ‌కా పాట కూడా ఏదో ప‌వ‌న్ పాడాడు అని అక్క‌డ పెట్ట‌డం త‌ప్పించి, ఆ పాట అక్క‌డ అవ‌స‌రం ఉండ‌దు. అయితే అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్  బాగున్న‌ప్ప‌టికీ సినిమాలో చాలా అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు పంటికింద రాయిలా త‌గులుతుంటాయి. ఎడిట‌ర్ ఇంకాస్త శ్ర‌ద్ధ తీసుకుని ఉండాల్సింది. హారికా హాసిని క్రియేష‌న్స్ వారి నిర్మాణ విలువ‌లు చాలా రిచ్ గా ఉన్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

సినిమాటోగ్ర‌ఫీ

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్


మైన‌స్ పాయింట్స్ః 

తివిక్ర‌మ్ మార్క్ ద‌ర్శ‌క‌త్వం

క‌థ‌

లాజిక్ లేని సన్నివేశాలు


పంచ్‌లైన్ః సంక్రాంతికి ప్లాన్-B వెతుక్కోవాల్సిందే..

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5