'అదిరింది' మూవీ రివ్యూ


త‌మిళంలో మెర్స‌ల్ పేరిట సంచ‌ల‌న విజ‌యం సాధించిన క‌థను తెలుగులో అదిరింది పేరుతో తెర‌కెక్కించారు. విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుందో లేదో చూద్దాం.

క‌థః
వృత్తిరీత్యా వైద్యుడైన భార్గ‌వ్ (విజ‌య్), డ‌బ్బుకు ఆశ‌ప‌డ‌కుండా 5 రూపాయ‌లు మాత్రమే తీసుకుని ఎంత‌టి వైద్య‌మైనా చేసేవాడు. అత‌ని సేవ‌ల‌ను గుర్తించిన విదేశీ ప్ర‌భుత్వం అత‌నికి అవార్డు కూడా ఇస్తుంది. ఈ నేప‌థ్యంలో అక్క‌డికి వెళ్లిన భార్గ‌వ్ మెజీషియ‌న్ గా మారి, ఒక డాక్ట‌ర్ ను చంపి, మ‌రికొంద‌రిని కిడ్నాప్ చేస్తాడు. భార్గ‌వ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ తీరా వెళ్లి చూస్తే అక్క‌డ భార్గవ్ బ‌దులు వేరే వ్య‌క్తి ఉంటాడు. అస‌లు భార్గ‌వ్ ఎవ‌రు?  పోలీసులు అరెస్ట్ చేసింది ఎవరిని?  డాక్ట‌ర్ల‌ను  ఆ వ్య‌క్తి ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు అనేది మ‌నం తెర‌పైనే చూడాలి.

న‌టీన‌టుల ప్ర‌తిభః 
విజ‌య్ న‌ట‌న మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఉంటుంది. కానీ ఈ సినిమాతో విజ‌య్ ఇక్క‌డ తిష్ట వేసుకుని పోయేలా అనిపించే చిత్ర‌మైతే కాదు. హీరోయిన్ల‌లో నిత్యా మీన‌న్ పాత్రే కీల‌కం కాబ‌ట్టి, ఆమెనే హీరోయిన్ గా అనుకోవ‌చ్చు. కాజల్, స‌మంత‌లు ఏదో స్పెష‌ల్ క్యామియో లు చేసినట్లుంది. ఇక ఎస్‌.జె.సూర్య ఈ సినిమాతో మరోసారి త‌నను తాను మాంచి న‌టుడిగా, విల‌న్ గా నిరూపించుకున్నాడు. లుక్ ప‌రంగా అయినా, యాక్టింగ్ ప‌రంగా అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో అయినా ఈ సినిమా విష‌యంలో అంద‌రి కంటే ఎక్కువ మార్కులు సూర్య‌కే ప‌డ‌తాయి. మిగిలిన వారిలో స‌త్య‌రాజ్, వ‌డివేలు ఎవ‌రి పాత్ర‌ల ప‌రిధిలో వారు చేశారు. 

సాంకేతిక నిపుణులుః 
ద‌ర్శ‌కుడు అట్లీ ఎంచుక‌న్న క‌థ మామూలుదే అయినా స్క్రీన్ ప్లే బావుండ‌టంతో సినిమా కొంచెం బ‌లంగా సాగింది. ఎమోష‌నల్ సీన్స్ లో అట్లీ ప‌నిత‌నం బాగా క‌నిపిస్తుంది. కాక‌పోతే అస‌లే క‌థ రొటీన్ గా ఉండ‌టం, దానికితోడు ప్ర‌తీ స‌న్నివేశాన్ని సుదీర్ఘంగా చెప్ప‌డంతో సినిమా సాగ‌దీసిన‌ట్లు అనిపిస్తుంది. ఇక ఎ.ఆర్. రెహ‌మాన్ సంగీతం ఈ సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ. పాట‌లు మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా క‌నెక్ట్ కావు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా కొత్త‌గా, చాలా బావుంది. జె.కె విష్ణు సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు చాలా రిచ్ గా ఉన్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్ః 
ఎస్.జె సూర్య‌
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే

మైన‌స్ పాయింట్స్ః 
స్లో నెరేష‌న్
రొటీన్ స్టోరీ
పాట‌లు

పంచ్‌లైన్ః త‌మిళ వాస‌న‌లు అదిరే..
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5