హైప‌ర్ రివ్యూ : రెడ్ బుల్ తాగొచ్చిన హైప‌ర్ టీమ్..‘నేను.. శైల‌జ’ విజ‌యం త‌ర్వాత రామ్ ‘హైప‌ర్’ తో మ‌రో విజ‌యం సాధించాల‌ని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాడు. త‌న‌కు గ‌తంలో ‘కందిరీగ’ వంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ని ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాపై మొద‌టి నుంచి అంచ‌నాలు బాగానే ఉన్నాయి. 14 రీల్స్ నిర్మించిన ఈ సినిమా ఇవాళే ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చింది. మ‌రి ప్రేక్ష‌కుల అంచ‌నాలను హైప‌ర్ అప్రోచ్ అయిందా లేదా చూద్దాం..
నిజాయితికి నిలువెత్తు రూపంలో ఉంటూ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు నారాయణ మూర్తి (సత్యరాజ్‌). ఆ తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకే సూరి (రామ్‌). సూరికి తండ్రి అంటే ఎనలేని గౌరవం మరియు అమితమైన ప్రేమ. తండ్రి కోసం ఏదైనా చేయడానికి సిద్దంగా ఉంటాడు సూరి. ఆఖ‌రికి త‌న‌కు ప్రేమ క‌ల‌గ‌డానికి కార‌ణం కూడా త‌న తండ్రి మీదున్న ప్రేమే. ఇలా జీవితం సాఫీగా సాగుతుండగా తన తండ్రికి ఒక మినిస్టర్‌ నుంచి సమస్య తలెత్తుతుంది.
మంత్రి చిన్న రాజప్ప(రావు రామేష్‌) వైజాగ్‌లో తన బిల్డింగ్‌కు పరిమిషన్‌ కావాలని నారాయణ మూర్తిని ఒత్తిడి చేస్తాడు. నిజాయితీకి మారు పేరుగా త‌న కెరీర్ లో ఎటువంటి లూప్ హోల్ లేని ప్ర‌భుత్వోద్యోగిగా బ్రతుకుతున్న నారాయణ మూర్తి మాత్రం పర్మిషన్‌ అసలు ఇవ్వనంటాడు. దాంతో ఆ మినిస్టర్‌ నుంచి వీరికి అస‌లు తలనొప్పి మొదలవుతుంది. రామ్‌ తన తండ్రి సమస్యను ఎలా ప‌రిష్క‌రిస్తాడు. ఆ మినిస్టర్ భారీ నుంచి త‌న కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు అన్న‌దే మిగిలిన కథాంశం.
‘నేను.. శైల‌జ’ త‌ర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాపై మొద‌టి నుంచి అంద‌రికీ భిన్నాభిప్రాయ‌మే ఉంది. ఆ భిన్నాభిప్రాయం కూడా ఎలా ఉంది అంటే ఈ సినిమా రిజ‌ల్ట్ చూశాక కానీ రామ్ జ‌డ్జ్ మెంట్ ను ఒక అంచ‌నా వేయ‌లేం అనేంత‌..  ‘కందిరీగ’ వంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ ను సంతోష్ శ్రీనివాస్ అందించిన‌ప్ప‌టికీ, త‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ర‌భ‌స’ చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ అదే ఫార్మాట్ లోనే హైప‌ర్ ను తెర‌కెక్కించారేమో అన్న అనుమానాలు కోటలు క‌ట్టుకున్నాయి. కానీ ఆ అనుమానాల‌న్నింటినీ హైప‌ర్ తో కూల్చేశాడు డైర‌క్ట‌ర్. ఈ సినిమాతో రామ్-సంతోష్ శ్రీనివాస్ కాంబినేష‌న్ లో మ‌రోసారి విజ‌యం సాధించారు.
హైప‌ర్ కు సినిమా ఫ‌స్టాఫ్ యే మేజ‌ర్ హైలైట్. డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో ఫ‌స్టాఫ్ ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేస్తుంది. రామ్ ఎన‌ర్జీ, రాశీ ఖ‌న్నా అందాలు, వారి మ‌ధ్య ల‌వ్ ట్రాక్.. స‌త్య రాజ్ న‌ట‌న, అక్క‌డ‌క్క‌డా కామెడీ.. ఇవ‌న్నీ ఉండ‌టంతో ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌ర‌దా గా గ‌డిచిపోతుంది. త‌న తండ్రిని కాపాడాడ‌ని, విల‌న్ తో సైతం హీరో ఫ్రెండ్ షిప్ చేసే సీన్ ఒక్క‌టి చాలు. త‌న తండ్రి మీద కొడుకు కి ఎంత పిచ్చ ఉందో చెప్ప‌డానికి. ఇక ఇంట‌ర్వెల్ బాంగ్ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంది. ”ఇప్ప‌టి వ‌ర‌కు నా తండ్రి కాబ‌ట్టి నాకెక్కువ అనుకున్నా.. కానీ ఎవ‌రి తండ్రి వాళ్ల‌కు ఎక్కువే క‌దా..” అని రామ్ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ”నా తండ్రి విష‌యానికి వ‌స్తే ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌ను..” అని త‌ను అప్ప‌టి వ‌ర‌కు ఫ్రెండ్ షిప్ చేసిన వ్య‌క్తితోనే ఛాలెంజ్ చేయ‌డం ఇవన్నీ సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి.
ఇక సెకండాఫ్ లో మినిస్ట‌ర్ గా రావు ర‌మేష్ ప‌రిచ‌యం అవ‌డం, హీరో-విల‌న్ల మ‌ధ్య యాక్ష‌న్ గేమ్.. రావు ర‌మేష్ న‌ట‌న ఆక‌ట్టుకుంటాయి. ఫ‌స్టాఫ్ లో అంతా లవ్ ట్రాక్ చూడ‌టంతోనో ఏమో, సెకండాఫ్ లో రాశీ అప్పుడ‌ప్పుడే మెర‌వ‌డంతో, హీరోయిన్ కేవ‌లం పాట‌ల కోస‌మే వ‌స్తుందేమో అనే ఫీలింగ్ వ‌స్తుంది. ఫ‌స్ట్ హాఫ్ లో ప్ల‌స్ అయిన ల‌వ్ సీన్స్ సెకండాఫ్ లో మైన‌స్ అయ్యాయి. పాట‌ల‌న్నీ సంద‌ర్భం లేకుండా రావ‌డంతో, ముఖ్యంగా సెకండాఫ్ లో ఇబ్బందిగా అనిపిస్తుంది. రావు ర‌మేష్ కు, రామ్ కు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌న్నీ అదిరిపోయాయి.
హైప‌ర్ అనే టైటిల్ కి, ప్ర‌తీ ఇంట్లో ఒక‌డుంటాడు అనే ట్యాగ్ లైన్ కి క‌రెక్ట్ గా స‌రిపోయాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్. త‌న ఎన‌ర్జీ, లుక్స్, న‌ట‌న‌తో మెప్పించాడు. ‘నేను.. శైల‌జ’ సినిమాలో చేయ‌లేక పోయిన డ్యాన్సులు, యాక్ష‌న్ సీన్స్ ఇందులో చేసి మెప్పించాడు. ట్రైల‌ర్ లో చెప్పిన‌ట్లే రెడ్ బుల్ తాగిన బుల్ లాగా సినిమా అంతా ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపించాడు. ఇటు ఎమోష‌నల్ సీన్స్ లోనూ త‌న‌దైన న‌ట‌న క‌న‌బ‌రిచి ఆక‌ట్టుకున్నాడు. రాశీఖ‌న్నా త‌న గ్లామ‌ర్ తో, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది. కొడుకు అతి ప్రేమ‌ను భ‌రించ‌లేని తండ్రిగా, నిజాయితీ గ‌ల ప్ర‌భుత్వోద్యోగిగా గొప్ప న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. ఓవైపు విల‌న్, మ‌రో వైపు హీరోకు ఫ్రెండ్ గా ముర‌ళీ శ‌ర్మ బాగా చేశాడు. ఇక సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్ట‌ర్ అంటే రావు ర‌మేష్. త‌న‌ను విల‌క్ష‌ణ న‌టుడు అని ఎందుకు అంటారో ఈ సినిమాతో మ‌రోసారి నిరూపించుకున్నాడు. ఎలాంటి పాత్ర‌లోనైనా త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆక‌ట్టుకోగ‌ల‌డు అని ప్రూవ్ చేసుకున్నాడు. పేరు, ప‌ర‌ప‌తి గ‌ల మంత్రిగా త‌న‌కు కావాల్సిన దానికోసం ఎంత వ‌ర‌కైనా వెళ్లగ‌ల పాత్ర‌లో అటు సీరియ‌స్ గా ఉంటూనే కామెడీ చేసి క‌డుపుబ్బా న‌వ్వించ‌గ‌లిగాడు. పోసాని క్యారెక్ట‌ర్ సినిమాకు అంతగా ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని చెప్పాలి. మిగ‌తా పాత్ర‌ధారులు త‌మ త‌మ ప‌రిధిలో బాగానే చేశారు.
డైర‌క్ట‌ర్ గురించి చెప్పాలంటే..గుర్తింపు, విజయంలో ఉన్న‌ హీరోతో సినిమాను చేస్తున్నప్పుడు దర్శకుడిపై చాలా ఒత్తిడి ఉంటుంది. హీరోను సరికొత్తగా చూపించటంతోపాటు.. అతని ఫ్యాన్స్ ను అలరిస్తూనే.. ప్రేక్షకులు మెచ్చేలా సినిమా తీయటం అంత చిన్న విషయం కాదు. దానికి తోడు ఆ డైరక్ట‌ర్, హీరో కాంబినేష‌న్ లో ఆల్రెడీ ఒక సినిమా వ‌చ్చి అది మంచి హిట్ అయి ఉంటే.. ఈ సినిమా ఇంత‌కుముందు వ‌చ్చిన సినిమాలా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాలి, మ‌ళ్లీ దానిలో ఉన్న ఏ యాంగిల్ ఈ సినిమాలో ట‌చ్ అవకూడ‌దు. అంటే అలా జ‌ర‌గాలంటే ద‌ర్శ‌కుడు అనేవాడు ఎంత క‌ష్ట‌ప‌డాలి..?మ‌రోవైపు ఇటు నిర్మాతనూ మర్చిపోకూడదు. పరిమితుల‌కు లోబడే సినిమా పూర్తి చేయాల్సి ఉంటుంది. అందరూ నడిచే దారిలోనే దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కూడా తూచా తప్పకుండా నడిచాడు. కాకపోతే.. అలా న‌డిచే క్ర‌మంలో మంచి దారి లో వెళ్ల‌డం వ‌ల‌న ఈ సినిమా ‘హైప‌ర్’ కాస్తా ”హై ప‌వ‌ర్” గా మారింది.
ఫ‌స్టాఫ్ లోనే త‌న డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే, నెరేష‌న్ తో ఆడియ‌న్స్ ను క‌ట్టిప‌డేశాడు. రెగ్యుల‌ర్ గా వ‌చ్చే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ఏయే అంశాలు కావాలో వాటిన్నింటినీ చూసుకుంటూ, ఏ అంశం మిస్ అవ‌కుండా జాగ్ర‌త్త‌గా డీల్ చేశాడు. కావాల‌ని కామెడీ కోసం క్యారెక్ట‌ర్స్ ను సృష్టించ‌కుండా, ఉన్న క్యారెక్ట‌ర్స్ తోనే కామెడీ చేయించ‌డంలో ఆయ‌న ప‌నిత‌నాన్ని మెచ్చుకోవాలి. కాక‌పోతే సెకండాఫ్ లో కొంచెం ల‌వ్ ట్రాక్ పెట్టి ఉండాల్సింది. ముఖ్యంగా ఒక ప్ర‌భుత్వోద్వోగి సంత‌కం స‌మాజం మీద ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుంది అని చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. అబ్బూరి రవి అందించిన ”నీ బ‌ల‌గం కంటే నా బ‌లం గొప్ప‌ది, రోజూ మందు పోసి పెంచే మీ అన్నని అంటుంటేనే మీక‌లా ఉంటే, నాకు ప్రాణం పోసి పెంచిన మా నాన్న తో పెట్టుకుంటే నాకెలా ఉంటుందిరా”… లాంటి మాట‌లు కూడా సినిమాకు ప్రాణం పోశాయి.
టెక్నిక‌ల్ గా స‌మీర్ అందించిన సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. వైజాగ్ అందాలను త‌న కెమెరా క‌న్నుతో ఎంతో చక్క‌గా చిత్రీక‌రించాడు. ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా ప్రెజెంట్ చేయ‌గ‌లిగాడు. జిబ్రాన్ అందించిన పాటల్లో ఒక‌టి రెండు బాగున్నాయి అంతే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కింగ్ అయిన మ‌ణిశ‌ర్మ ఈసారి సినిమాకు ఏమాత్రం ప్ల‌స్ కాలేక‌పోయాడు. పైగా వేరే ఏదో సినిమాలో ఆర్ ఆర్ ఇక్క‌డ వాడిన‌ట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. 14రీల్స్ వారి నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. ఇలాంటి సినిమాకు ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టి, ఎక్క‌డా రాజీప‌డ‌లేద‌ని సినిమాలోని ప్ర‌తీ ఫ్రేమ్ లో తెలుస్తుంది.
చివ‌ర‌గా.., క‌థ పాత‌దే అయినా దానికి ఒక మంచి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్ జత చేసి ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఒక మంచి స‌బ్జెక్ట్ తో కుటుంబ విలువ‌లు క‌లిగిన ఈ చిత్రంలో, త‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ తో మంచి న‌ట‌న క‌న‌బ‌రిచి నేను శైల‌జ చిత్రం త‌ర్వాత మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్.

పంచ్ లైన్ః రెడ్ బుల్ తాగొచ్చిన హైప‌ర్ టీమ్..

Filmjalsa Rating : 3.5/5