సాహ‌సం శ్వాస‌గా సాగిపో మూవీ రివ్యూ, రేటింగ్ఎప్పుడో ఆరు నెల‌ల ముందు రిలీజ్ కావాల్సిన సినిమా. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఎప్ప‌టిక‌ప్పుడు సినిమా వాయిదా ప‌డుతూనే వ‌చ్చింది. అయినా సినిమా మీద క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందుకు త‌గ్గుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివ‌ర‌కు జనాలకు పరిచయం చేసిన ప్రతి విశేషం ఆకట్టుకునేలా ఉంటుంటే. దీనికి తోడు గౌత‌మ్ మీన‌న్, నాగ‌చైతన్య‌,ఎ ఆర్ రెహ్మాన్ వీరి ముగ్గురి క్రేజీ కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఏ మాయ చేశావే వీరి కాంబినేష‌న్ పై ఆస‌క్తి మ‌రింత పెరిగింది. మ‌రి ఇన్ని అంచ‌నాల మ‌ధ్య ఇవాళ విడుద‌లైన సాహ‌సం శ్వాస‌గా సాగిపో ఆ స్థాయి అంచ‌నాల‌కు చేరుకుందా లేదా చూద్దాం..

ర‌జ‌నీకాంత్(నాగ‌చైత‌న్య‌) ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి అబ్బాయి. చ‌దువు పూర్తయి, ఒక చిన్న ట్రిప్ త‌ర్వాత త‌న కెరీర్ ను మెల్లిగా ప్లాన్ చేసుకోవాల‌నే సాదా సీదా కుర్రాడు.. లీల‌(మంజిమా మోహ‌న్) హీరో చెల్లికి ఫ్రెండ్. చ‌దువు కోసం వాళ్లింట్లోనే ఉంటుంది. ర‌జ‌నీకాంత్, లీల చాలా కొద్ది రోజుల్లోనే బాగా ద‌గ్గ‌ర‌వుతారు. ఇద్ద‌రూ క‌లిసి రోడ్ ట్రిప్ కు వెళ్తారు. అక్క‌డ ఒక యాక్సిడెంట్. అయితే అది యాక్సిడెంట్ కాద‌ని, లీల‌ను చంప‌డానికి చేసిన ప్లాన్ అని త‌ర్వాత తెలుస్తుంది. అస‌లు లీల‌ను చంప‌డానికి ప్ర‌య‌త్నించిందెవ‌రు..? లీల‌ను ఎందుకు చంపాల‌నుకుంటున్నారు..? అక్క‌డి నుంచి ర‌జ‌నీకాంత్, లీల ఎలాంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు..? చివ‌ర‌కు ఎలా బ‌య‌ట‌ప‌డ్డార‌నేది అస‌లు క‌థ‌.

గౌత‌మ్ మీన‌న్ సినిమా అంటే ఆయ‌న టేకింగ్ లోనే కొత్త ద‌నం ఉంటుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో కూడా మొద‌లుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో క‌థ‌ను న‌డిపించాడు. ఫ‌స్టాఫ్ అంతా హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్, హీరో-హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్, దానికి రోడ్ ట్రిప్ ను ఎంచుకున్న విధానం బాగుంది. ఫస్టాఫ్ లో హీరో ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర వ‌చ్చే సీన్స్ కొన్ని బాగున్నాయి. సినిమా అంతా ఇక ట్రిప్ యేనా అనుకునే స‌మ‌యానికి యాక్సిడెంట్. అక్క‌డ వెళ్లిపోమాకే అంటూ సాగే పాట‌. ఆ పాటను అలా తీయాలి అని ఆలోచ‌న వ‌చ్చినందుకు ముందుగా మెచ్చుకోవాలి. త‌ర్వాత ఆస‌క్తిక‌ర‌మైన ఇంట‌ర్వెల్.

ఇక సెకండాఫ్ అంతా యాక్ష‌న్ వైపే సాగుతుంది. అస‌లు హీరోయిన్ ని ఎవ‌రు చంపాల‌నుకున్నారు అనే ప్ర‌శ్న జ‌వాబు కోసం హీరో చేసే సాహసం చుట్టూ తిరుగుతుంది. కానీ క్లైమాక్స్ విష‌యంలో మాత్రం సినిమా నిరుత్సాహ ప‌రుస్తుంది. కేవ‌లం వాళ్ల‌ను ఎందుకు చంపారో ఏంట అని తెలుసుకోవడానికే అయితే అంత సేపు ఎదురుచూడాల్సిన ప‌ని లేదు. కానీ క్లైమాక్స్ వ‌ర‌కు విల‌న్ అయిన బాబా సెహ‌గ‌ల్ ని ఏమీ చేయ‌కుండా, త‌ర్వాత‌నే చంపుతాడు. అప్ప‌టి వ‌ర‌కు అటు ఫ‌స్టాఫ్ లో రొమాంటిక్ లుక్ తోనూ, ఇటు సెకండాఫ్ లో యాక్ష‌న్ లుక్ తోనూ ఉన్న నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ చివర‌లో ఒక్క‌సారిగా, అలా చూపించ‌డం పెద్ద‌గా క‌నెక్ట్ కాలేదు. ఫ‌స్టాఫ్ అంతా రొమాంటిక్ స‌న్నివేశాలు చూసి, సెకండాఫ్ లో ఆ జోలికి కూడా వెళ్ల‌క‌పోవ‌డంతో కొంచెం నిరుత్సాహ ప‌డ‌తారు. అంతేకాదు, స్లో నెరేష‌న్, సినిమా నిడివి కూడా కాస్త ఇబ్బందికి గురి చేస్తాయి. ఫ‌స్టాఫ్ లో వ‌చ్చే కొన్ని సీన్స్ ‘ఏ మాయ చేశావె..’ ను అలా గుర్తు తెస్తాయి. ”త‌న పేరు లీలా జోసెఫ్ ..ఫ్ర‌మ్ అలెప్పీ, కేర‌ళ” అని హీరోకి త‌న చెల్లి చెప్పే సీన్, హీరో త‌న ఫ్రెండ్స్ ద‌గ్గ‌ర హీరోయిన్ ను గురించి చెప్పేట‌ప్పుడు .. ”రేయ్ త‌న‌ను అలా చూస్తుంటే ఏఆర్ రెహ్మాన్ పాట గుర్తొస్తుందిరా అని అంటే.. దానికి హీరో ఫ్రెండ్స్ ఏంటి హోస‌న్నా పాటేనా అని అన‌డం,, కాదురా.. అక్క‌డ ఆ అమ్మాయి మా ఇంటి పైన ఉండేది, ఇక్క‌డ ఈ అమ్మాయి మా ఇంట్లోనే ఉంటుంది” అని చెప్పే సీన్స్ బాగున్నాయి.

త‌న‌కు ల‌వ్ స్టోరీస్ బాగా సెట్ అవుతాయని నాగ‌చైత‌న్య చెప్పిన మాట మ‌రోసారి రుజువైంది. రీసెంట్ గా ప్రేమ‌మ్ లో త‌నలోని ల‌వ‌ర్ బాయ్ ని చూపించి మెప్పించిన‌ నాగ‌చైత‌న్య ఈ సినిమాలో మంజిమా మోహ‌న్ తో క‌లిసి మంచి బాడీ లాంగ్వేజ్, కెమిస్ట్రీనే మెయింటైన్ చేశాడు. కొన్ని కొన్ని ఎమోష‌నల్ సీన్స్ లో చైతూ క‌న‌బ‌రిచిన న‌ట‌న‌ను మెచ్చుకోవాల్సిందే. ఇక హీరోయిన్ మంజిమా మోహ‌న్ కి ఇది మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ, ఎంతో అనుభ‌వం గ‌ల న‌టిగా త‌న స్రీన్ ప్రెజెన్స్ తో పాటూ, న‌టిగానూ మెప్పించింది. ఇలా చైతూ, మంజిమా అని వేర్వేరుగా చెప్పే బ‌దులు ఇద్ద‌రి గురించి క‌లిపి చెప్తే బాగుంటుందేమో. వారిద్ద‌రి జంట స్క్రీన్ పై చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. విల‌న్ గా బాబా సెహ‌గ‌ల్ పోలీస్ గెట‌ప్ లో బాగా చేశాడు. వీళ్లు కాక సినిమాలో చెప్పుకోద‌గిన క్యారెక్ట‌ర్ అంటే హీరో ఫ్రెండ్ మ‌హేష్‌( రాకేందు మౌళి). త‌న కామెడీ టైమింగ్ తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించ‌గ‌లిగాడు.

ల‌వ్ స్టోరీస్ కు కొంచెం యాక్షన్ ను మేళ‌వించి, భిన్న‌మైన స్క్రీన్ ప్లే రాసుకుంటాడు దర్శకుడు గౌతమ్ మీనన్. ఈ సినిమాలో కూడా అలాంటి ప్ర‌య‌త్నాలు కొన్ని చేశాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే పాట‌, పాట‌లో యాక్సిడెంట్ ను చూపించ‌డం , హీరో హీరోయిన్ కు ప్ర‌పోజ్ చేయ‌డం లాంటివి ఆ ప్ర‌యోగంలోని భాగ‌మే. ఇంట‌ర్వెల్ లో ప్రేక్ష‌కుల‌ను స‌స్పెన్స్ గురిచేసిన డైర‌క్ట‌ర్, దాన్ని చివ‌ర వ‌ర‌కు అంతే క్యూరియాసిటీని క్రియేట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. కానీ క‌థ‌ను మాత్రం సాగ‌దీశాడు. ఎవ‌రికైనా ఎప్పుడైనా ఏమైనా జ‌ర‌గొచ్చు అనే ఒక చిన్న లైన్ తో మొద‌లెట్టిన కాన్సెప్ట్ అయితే బాగుంది కానీ క‌థ ఎంత‌సేప‌టికే అక్క‌డ‌క్క‌డే జ‌రుగుతుండంతో బోర్ కొట్టించింది. కానీ అటు ల‌వ్ స్టోరీని, ఇటు యాక్ష‌న్ డ్రామాను గౌత‌మ్ మీన‌న్ న‌డిపించిన తీరు చాలా బాగుంది.

ఇక సాంకేతిక ప‌రంగా చెప్పాలంటే, సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ప్ర‌తీ ఫ్రేమ్ చాలా క్లీన్ గా, నీట్ గా ఉంది. సంగీతం గురించి చెప్పాలంటే, ఎ.ఆర్. రెహ‌మాన్. ఎంతో సూప‌ర్బ్ ఆల్బ‌మ్ ఇచ్చాడు. ఎంత మంచి ఆల్బ‌మ్ అంటే స్క్రీన్ మీద ఒక్క గొంతు పాడుతుంటే, థియేటర్లో ఉన్న గొంతుల‌న్నీ క‌దిలేంత మంచి ఆల్బ‌మ్. దానికి తోడు క‌థ కు కూడా పాట‌లు స‌రిగ్గా సరిపోయాయి. బాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఎడిటింగ్ బాగుంది కానీ కొన్ని అన‌వ‌స‌ర‌మైన సీన్స్ ను క‌ట్ చేసి ఉంటే ఇంకా బాగుడేంది.

చివ‌ర‌గా.. ఎన్నో వాయిదాల త‌ర్వాత సాహ‌సం చేసి విడుద‌ల చేసిన ఈ సినిమా, డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే కోరుకునే వారికి ఈ చిత్రం బాగా న‌చ్చుతుంది. కేవ‌లం సినిమా పోస్ట‌ర్లు, పాట‌లు, టీజ‌ర్స్ చూసి ఇది ల‌వ్ స్టోరీ మాత్ర‌మే అనుకునే వెళ్తే మాత్రం నిరుత్సాహ ప‌డ‌తారు.

పంచ్ లైన్ః సాహ‌సం ఫ‌లించిన‌ట్లే..

Filmjasla Rating: 3/5