శ‌త‌మానం భ‌వ‌తి సినిమా రివ్యూరెండు భారీ చిత్రాలు విడుద‌ల‌వుతున్నాయ‌ని తెలిసినా, ఆ రెండు సినిమాల కంటే ఇది చిన్న సినిమా అని తెలిసినా కాంపిటీష‌న్ ను లెక్క చేయ‌కుండా శ‌త‌మానం భ‌వ‌తి ని రిలీజ్ చేస్తున్నారంటేనే దీనిలో ఏదో విష‌యం ఉంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.ఎప్ప‌టిక‌ప్పు విభిన్న క‌థ‌లతో పాటు, మంచి న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించగ‌లిగే హీరో శ‌ర్వానంద్. కెరీర్‌లో బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లు లేకున్నా, అతనికి మంచి టేస్ట్ ఉంద‌న్న విష‌యాన్ని ఎన్నో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు శ‌ర్వానంద్. ఇప్పుడిప్పుడే త‌న రేంజ్ ను పెంచుకుంటున్న శ‌ర్వానంద్, దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో మ‌న ముందుకు వ‌చ్చాడు. మ‌రి రెండు భారీ చిత్రాల మ‌ధ్య వ‌చ్చిన ఈ సినిమా ఆ చిత్రాల‌కు ధీటుగా స‌మాధానం చెప్తుందా.. ప్రేక్ష‌కుల‌ను అంచ‌నాల‌ను శ‌త‌మానం భ‌వ‌తి అందుకుంటుందా లేదా చూద్దాం.

అంద‌రూ ఉండి కూడా ఆత్రేయ‌పురం అనే ప‌ల్లెటూర్లో రాజుగారు(ప్ర‌కాశ్ రాజ్), జాన‌క‌మ్మ‌(జ‌య‌సుధ‌) అనే దంప‌తులు ఒంట‌రిగా జీవితాన్ని గ‌డుపుతూ ఉంటారు. వాళ్ల ఇద్ద‌రు కొడుకులు, కూతురు విదేశాల్లో స్థిర‌ప‌డిపోవ‌డంతో వీరు మ‌న‌వ‌డు రాజు (శ‌ర్వానంద్) తో ఒంట‌రిగా ఉంటారు. సంక్రాంతికి పిల్ల‌లంతా వ‌స్తే బాగుండ‌ని అనుకున్న రాజుగారు దానికోసం ఓ ప్లాన్ వేసి మ‌రీ పిల్ల‌లంద‌ర్నీ వ‌చ్చేలా చేస్తాడు. అలా వ‌చ్చిన ఆయ‌న మ‌న‌వ‌రాలే నిత్య (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌). రాజు, నిత్య‌లు బావా మ‌ర‌ద‌లు అవడంతో.. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరిగి, ప్రేమ‌గా మారుతుంది. స‌రిగ్గా అదే స‌మ‌యానికి రాజు గారు వేసిన ప్లాన్ గురించి అంద‌రికీ తెలియ‌డంతో, కుటుంబం విడిపోయే ప‌రిస్థితి వ‌స్తుంది. ఇంత‌కీ రాజుగారు ఆ ప్లాన్ ద్వారా త‌న పిల్ల‌ల‌కు ఏం చెప్పాల‌నుకున్నాడు.. రాజు, నిత్య‌ల ప్రేమ క‌థ ఎలా స‌ఫ‌లమ‌వుతుంది అన్న‌దే అస‌లు క‌థ‌.

ఆత్రేయ‌పురంలో మొద‌లైన ఈ క‌థను పెద్ద‌గా సస్పెన్స్ ఏమీ లేకుండా, చిన్న ట్విస్ట్ తోనే కథ‌ను నడిపించాడు ద‌ర్శ‌కుడు. ఆద్యంతం ఎమోష‌న్స్ తో క‌ట్టిప‌డేసేలా సీన్లు రాసుకున్నారు. కామెడీ విష‌యానికొస్తే, న‌రేష్ త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఫెయిలైన‌ట్లే. ర‌చ్చ ర‌వి కామెడీ క‌థ‌కు అవ‌స‌రం లేక‌పోగా, విసుగు పుట్టిస్తుంది. కొన్ని సీన్స్ బోర్ తెప్పించినా, త‌ర్వాత వ‌చ్చే సీన్ దాన్ని మ‌రిపిస్తుంది. ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దాగా, హీరోహీరోయిన్ల ప్రేమ‌క‌థ‌తో సాగిపోతే, సెకండాఫ్ చాలా వ‌ర‌కు ఎమోష‌న‌ల్ గా సాగిపోతుంది. ముఖ్యంగా, క్లైమాక్స్ లో కుటుంబ విలువ‌ల గురించి చెప్పే సీన్స్ చాలా బాగా ఆక‌ట్టుకుంటాయి. శ‌ర్వానంద్ వాళ్ల బాబాయి ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి, ఆమెతో మాట్లాడించే సీన్ కొత్త‌గా ఉంది. కానీ కొన్ని సీన్స్ ఎక్క‌డో చూసిన‌ట్లుగా అనిపించిన‌ప్ప‌టికీ, ఆక‌ట్టుకుంటాయి.

ఎప్పుడూ ఫీల్ గుడ్ మూవీస్ మాత్ర‌మే చేసే శ‌ర్వానంద్, ర‌న్ రాజా ర‌న్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో కామెడీ జోన‌ర్లోకి వెళ్లి స‌క్సెస్ చూశాడు. ఇప్పుడు మ‌ళ్లీ శ‌త‌మానం భ‌వ‌తి వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తో వ‌చ్చిన శ‌ర్వా, సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతోనే అనుకుంటా, సంక్రాంతి బ‌రిలో ఇద్ద‌రు స్టార్స్ ఉన్నా, భ‌య‌ప‌డ‌కుండా, బ‌రిలోకి దిగాడు. అన్ని ర‌కాల సీన్స్ లో శ‌ర్వానంద్ త‌న న‌ట‌న‌తో ఎప్ప‌టిలాగానే ఆక‌ట్టుకున్నాడు. అటు మాస్ క్యారెక్ట‌ర్ల‌లో మెప్పిస్తూనే, ఇటు సాఫ్ట్ క్యారెక్ట‌ర్స్ లోనూ రాణిస్తూ, ఎలాంటి క‌థ‌తో అయినా ద‌ర్శ‌కుడు త‌న వ‌ద్ద‌కు వెళ్లొచ్చనే కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు.
శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కూడా అత‌డికి పోటీగా న‌టిస్తూనే, మ‌రోవైపు త‌న అందంతో అచ్చ తెలుగు ప‌ల్లెటూరి అమ్మాయిగా ఆక‌ట్టుకుంది. వీరిద్ద‌రి జోడీ తెర‌పై చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధలు వారి పాత్ర‌ల్లో జీవించేశారు. నరేష్‌ మంచి నటనతో, త‌న కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఇంద్ర‌జ న‌ట‌న బాగుంది. మిగ‌తా వారిలో చ‌ల‌ప‌తి రావు, ప్ర‌వీణ్, ప్ర‌భాస్ శ్రీను త‌మ త‌మ పాత్ర‌ల మేర బాగానే చేశారు.

సాంకేతిక వ‌ర్గాల ప‌నితీరు గురించి చెప్పుకుంటే, ముందుగా, డైర‌క్టర్ స‌తీష్ వేగేశ్న క‌థ చెప్పిన విధానాన్ని అభినందించాలి. అన‌వ‌స‌ర‌మైన వాటి జోలికి పోకుండా, అవ‌స‌ర‌మైన వాటిని, చెప్పాల‌నుకున్న విష‌యాన్ని సూటిగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. చిన్న ట్విస్ట్ తోనే క‌థ‌ను మొత్తం న‌డిపించిన డైర‌క్ట‌ర్ సెకండాఫ్ ను కొంచెం గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే సినిమా స్థాయి మ‌రోలా ఉండేది.అయిన‌ప్ప‌టికీ త‌న స్క్రీన్ ప్లే తోనే మెప్పించాడు. ప‌ల్లెటూరి అందాల‌ను బాగా చూపించ‌డంలో సినిమాటోగ్ర‌ఫ‌ర్ స‌మీర్ రెడ్డి విజ‌యం సాధించాడు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం సినిమాకు తగ్గ‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ, విన్న సంగీతాన్నే విన్న‌ట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. దిల్ రాజ్ నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.

గోవిందుడు అందరి వాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అ..ఆ ఇలా పలు సినిమాల్లో కుటుంబ విలువలు చూపించడం జరిగింది. అవే విలువలు ఈ సినిమాలో కూడా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కుటుంబాల‌న్నీ ఒకేలా ఉన్న‌ప్ప‌టికీ, దేనికి అది వేరే అన్న‌ట్లే, ఈ కుటుంబ క‌థా చిత్రం కూడా , మిగ‌తా చిత్రాల్లా అనిపించినా, కొత్త‌ద‌నాన్ని మాత్రం త‌ప్ప‌క చూస్తారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది.

పంచ్‌లైన్ః కుటుంబ విలువ‌ల‌కు శ‌త‌మానం భ‌వ‌తి

Filmjalsa Rating: 3/5