‘ల‌క్కున్నోడు’ సినిమా రివ్యూ


వినోదాన్ని న‌మ్ముకున్న ప్ర‌తీసారీ మంచు విష్ణుకు విజ‌యం వ‌రించింది. దానికి త‌న మొద‌టి హిట్, ఢీ సినిమా స‌క్సెస్‌యే. దేనికైనా రెడీ, ఆడోర‌కం..ఈడోర‌కం ఇలా త‌న‌కు హిట్ ఇచ్చిన సినిమాల‌న్నీ కామెడీని న‌మ్ముకుని చేసిన‌వే. విష్ణు మ‌రోసారి కామెడీని న‌మ్ముకుని చేసిన ప్ర‌య‌త్న‌మే ల‌క్కున్నోడు. త‌న ల‌క్కీ హీరోయిన్ అయిన హ‌న్సిన ఇందులో హీరోయిన్. గీతాంజ‌లి ఫేమ్ రాజ్ కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి విష్ణు న‌మ్మ‌కాన్ని ఈ సినిమా నిల‌బెట్టిందా లేదా చూద్దాం.

 


గ్యాంగ్‌స్ట‌ర్ జేకె, క‌రెన్సీ నోట్లు దొంగ‌త‌నం చేసే సీన్ తో సినిమా మొద‌ల‌వుతుంది. త‌ను ప్లాన్ చేసి, ఏదైనా దొంగ‌త‌నం చేశాడంటే, అది నిరూపించ‌డానికి సాక్ష్యాలు కూడా ఉండ‌వు. అలా పాతిక కోట్లు దొంగ‌త‌నం చేసిన జేకె ను త‌న ద‌గ్గ‌ర  ఉండే స‌న్నిహితుడే మోసం చేసి డ‌బ్బు తీసుకెళ్తాడు. ల‌క్కీ(మంచు విష్ణు)మ‌ధ్య త‌ర‌గ‌తి నుంచి వ‌చ్చిన ఒక దుర‌దృష్ట‌వంతుడు. త‌న బ్యాడ్ ల‌క్ వల్ల  మిగ‌తా వారికి కూడా ఎన్నో చిక్కులు క‌లుగుతాయి. చివర‌కు క‌న్న‌తండ్రి కూడా ల‌క్కీతో మాట్లాడ‌డు  అంటే ఎంత దుర‌దృష్ట‌వంతుడో అర్థం చేసుకోవ‌చ్చు. ప‌ద్మావ‌తి(హ‌న్సిక‌)ని చూసి తొలిచూపులోనే  ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఈలోగా ల‌క్కీ చెల్లికి నిశ్చితార్థం జ‌ర‌గ‌డం, క‌ట్నం డ‌బ్బు ఇవ్వ‌డానికి వెళ్తే ఆ బ్యాగ్ పోవ‌డం, తండ్రి ల‌క్కీ పై కోప్ప‌డ‌టం జరుగుతాయి. దీంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేస్తాడు ల‌క్కీ. సరిగ్గా అదే స‌మ‌యంలో ఒక వ్య‌క్తి వ‌చ్చి బ్యాగ్ ఇచ్చి ,దాన్ని ఒక‌రోజు  త‌న‌తో ఉంచుకుంటే కోటి రూపాయ‌లు ఇస్తాన‌ని చెబుతాడు. అలా మళ్లీ స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్న ల‌క్కీ కి చివ‌ర‌కు అదృష్టం ఎలా వ‌రిస్తుంది, అనేది సినిమా క‌థ‌.


hansika


ఫ‌స్టాఫ్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా, ల‌క్కీ ఫ్లాష్ బ్యాక్ లో ఎలాంటి చేదు అనుభ‌వాలు  ఎదుర‌య్యాయి, ల‌క్కీతో ఉన్నందుకు ప‌క్క‌న‌వారికి ఎన్ని ఇబ్బందులు తలెత్తాయి, ల‌క్కీ-ప‌ద్మ ల మ‌ధ్య ల‌వ్ సీన్స్ వీటితోనే సాగుతుంది. ట్రైల‌ర్ లో ఉన్న పంచ్ లే సినిమాలో అక్క‌డ‌క్క‌డా పేల‌తాయి  త‌ప్ప‌, సినిమాలో కొత్త‌గా రెండు గంటల్లో పెద్ద‌గా న‌వ్వు తెప్పంచే  కామెడీ ఏమీ లేదు. ఒక సాంగ్ లో మోహ‌న్ బాబు వ‌చ్చి, విష్ణుతో డ్యాన్స్ చేయ‌డం ఫ్యాన్స్ ను అల‌రిస్తుంది. ఫ‌స్టాఫే సో సో గా ఉంది అంటే,  సెకండాఫ్ లో ఫ‌స్టాఫ్ లో తీసుకున్న జాగ్ర‌త్త‌లు కూడా తీసుకుపోగా, ఒకే పాయింట్ తో క‌థ ను దాదాపు రెండు గంట‌లు న‌డ‌ప‌డంతో సినిమా సాగ‌దీసిన‌ట్లు, ప్రేక్ష‌కుడికి బోర్ కొట్టిస్తుంది విల‌న్ కు, హీరోకు మ‌ధ్య న‌డిచే గేమ్ అయినా కాస్త ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయాల్సింది. క్లైమాక్స్ విష‌యంలోనూ ద‌ర్శ‌కుడు జాగ్ర‌త్త ప‌డ‌లేక‌పోయాడు. 


 


విష్ణు మ‌రోసారి త‌న కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. బాడీ లాంగ్వేజ్ లో కూడా మార్పు వ‌చ్చింది. ప్ర‌తీ సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా మోహ‌న్ బాబును ఇమిటేట్ చేయ‌డం క‌న్పిస్తుంది. హన్సిక పాత్ర కేవ‌లం గ్లామ‌ర్ కే ప‌రిమిత‌మైంది. కానీ ఆమె మేక‌ప్, డ‌బ్బింగ్ విష‌యంలో కొంచెం జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బాగుండేది. విల‌న్లు ఎవ‌రూ లేన‌ట్లు, నిర్మాత ఎం.వి.వి నే విల‌న్ అవ‌తార‌మెత్తి, ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. మిగ‌తా వారు స‌త్యం రాజేష్, ప్ర‌భాస్ శ్రీను, పోసాని, సురేష్, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు. 


 


ఇక సాంకేతిక ప‌రంగా చూస్తే, రాజ్ కిర‌ణ్ అస‌లు ప్రేక్షకుడికి ఏం చెప్పాలి అనుకున్నాడో, ఏం చెప్పాడో అర్థం కాదు. సంగీతం ప‌ర్వాలేదు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ బాలేదు.  ఒక్క‌మాట‌లో చెప్పాలంటే చెప్పుకునేంత గొప్ప‌గా ఎవ‌రూ చేసిందేమీ లేదు.  నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేదు. 


 


పంచ్ లైన్ః లక్కున్నోడు.. మ్యావ్ మ్యావ్


Filmjasa Punchline: 2/5