‘రెమో’ సినిమా రివ్యూ, రేటింగ్భాష‌తో సంబంధం లేకుండా సినిమా బాగుంటే ఆద‌రించేది మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఒక్క‌రే…..ఆ న‌మ్మ‌కంతోనే త‌మిళంలోనే 60 కోట్లు పైగా వ‌సూలు చేసిన రెమో చిత్రాన్ని మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు దిల్ రాజు.ఈ శుక్ర‌వారం విడుద‌లైన రెమో చిత్రం దిల్ రాజు నమ్మకాన్ని నిల‌బెట్టిందా.. లేక ఆ న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేసిందా చూద్దాం.
 
హీరో కావాల‌నుకునే ఓ యువ‌కుడికి హీరోయిన్ (కీర్తి సురేష్‌) ను చూడ‌గానే ప్రేమ పుడుతుంది. ఆ అమ్మాయికి త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌నుకునే లోపే త‌న‌కు నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఇదిలా ఉండ‌గా.. వాసు గారి ద‌ర్శ‌క‌త్వంలో ఆడ వేషం వేసే హీరో కావాల‌ని తెలియ‌డంతో, దానికి సంబంధించిన ఆడిష‌న్ కు వెళ‌తాడు. ఈ నేప‌థ్యంలోనే అమ్మాయిగా హీరోయిన్ కు ద‌గ్గ‌ర‌వుతాడు. అస‌లు విష‌యం హీరోయిన్ ఎప్పుడు తెలుసుకుంటుంది. నిజం తెలియ‌కుండా త‌నని తాను ఎలా కాపాడుకున్నాడు. అమ్మాయిగా ఉంటూనే హీరోయిన్ ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడు, చివ‌ర‌కు హీరోగా ఎలా నిల‌దొక్కుకున్నాడు ఇలాంటి ప్ర‌శ్న‌ల స‌మాధాన‌మే క‌థ‌. 
 
మొత్తం సినిమాను శివ కార్తికేయ‌న్, కీర్తి సురేష్ వీళ్లిద్దరే క్లైమాక్స్ వ‌ర‌కు త‌మ భుజాలపై న‌డిపించారు. అటు  ఎస్ కె పాత్ర‌లోనూ ,ఇటు రెమో పాత్ర‌లోనూ శివ కార్తికేయ‌న్ జీవించాడ‌నే చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయి పాత్ర‌లో ఒదిగిపోయాడు. త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాడు. క్లైమాక్స్ లో పాప కోసం  త‌ను అబ్బాయిగా మారే స‌న్నివేశంలో అందిచేత కంట‌త‌డి పెట్టించాడు. అలాగే ప్రేమికుడిగా అమ్మాయిల మ‌న‌సుల్ని దోచేస్తాడ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. శివ కార్తికేయ‌న్ కు టాలీవుడ్ లో ఇది మంచి డెబ్యూ గా చెప్పుకోవ‌చ్చు.  నేను శైల‌జ సినిమాతో త‌న అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన కీర్తి సురేష్, ఈచిత్రంలో కూడా కేవ‌లం అందంతో మాత్ర‌మే కాకుండా, మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి ఆక‌ట్టుకుంది. నిశ్చితార్థం జ‌రిగాక కూడా, ల‌వ్ లో పడే సీన్ లో త‌న న‌ట‌న‌కు వావ్ అనాల్సిందే. కాక‌పోతే ఈ చిత్రంలో కొంచెం బొద్దుగా క‌నిపించింది. మిగ‌తా పాత్ర‌లు త‌మ ప‌రిధిలో బాగానే చేశారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు ఇలాంటి క‌థ‌లు ఎన్నో వ‌చ్చినా కూడా, డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో ద‌ర్శ‌కుడు భాగ్య‌రాజ్  క‌న్న‌న్ సినిమాను  బాగా తెర‌కెక్కించాడు.  ఎంగేజ్ మెంట్ అయిన అమ్మాయిని ఫోర్స్  చేసి, ల‌వ్ లో ప‌డేసే సీన్స్ క‌న్విన్సింగ్ గా ఉన్నాయి. డైలాగ్స్ కూడా పంచ్ లు, ప్రాస లు లేకుండా సింపుల్ గా ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. అమ్మాయిల ఫుల్ టైమ్ జాబ్ అబ్బాయిల‌ను ఏడిపించ‌డ‌మే క‌దా.. ఇలాంటి డైలాగ్స్ యూత్ ను ఆక‌ట్టుకుంటాయి. ఫ్యామిలీ ఎమోష‌న్స్ కానీ, హాస్పిటల్ లో చిన్న పిల్ల‌ల‌పై వ‌చ్చే సీన్స్ లాంటివి ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఏ సినిమాకైనా ఆడియో బాగుంటేనే సినిమాను రెండున్న‌ర గంట‌లు భ‌రించ‌గ‌లం. అంత‌టి ప్రాముఖ్య‌త ఉన్న సంగీతం విష‌యంలో మాత్రం ఈ సినిమాకు అన్యాయం జ‌రిగింద‌నే చెప్పాలి. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాల మ‌ధ్య వ‌చ్చిన పాట‌లు ఇబ్బందికి గురిచేస్తాయి. అనిరుధ్ రీరికార్డింగ్ బాగున్న‌ప్ప‌టికీ, పాట‌లు మాత్రం గుర్తుంచుకునే స్థాయిలో లేవు. సినిమాటోగ్ర‌ఫీ గురించి ఏం చెప్తాం, పీసీ శ్రీరామ్ కెమెరా క‌న్ను గురించి కొత్త‌గా చెప్పుకునే ప‌నిలేదు. ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో రిచ్ గా, విజువ‌ల్ ఫెస్ట్ గా ఉంది. పాట‌ల్లో వ‌చ్చే లైటింగ్ షాట్స్ కొన్ని బాగున్నాయి. ఎడిటింగ్ ఫ‌ర్వాలేద‌నిపించిన‌ప్ప‌టికీ, కొన్ని సీన్స్ కు క‌త్తెర ప‌డితే బాగుండేది. కొన్ని అవ‌స‌రం లేని సీన్స్ ను క‌ట్ చేసి ఉంటే,  సినిమా నిడివి త‌గ్గి, సినిమా మ‌రోలా ఉండేది. నిర్మాణ విలువ‌లు  బాగున్నాయి.
 
మ‌న‌కు హీరో కొత్త వాడైనా, హీరోయిన్ ఆల్రెడీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న అమ్మాయి కాబ‌ట్టి, తన ప‌బ్లిసిటీతో  
ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల వర‌కు తీసుకురావ‌డంలో దిల్ రాజు బాగానే స‌క్సెస్ అవుతాడు. సినిమా చూసిన త‌ర్వాత ప్ర‌తీ ఒక్క‌రూ ఒక మంచి సినిమాను చూశామ‌న్న భావ‌న‌తోనే బ‌య‌ట‌కు వ‌స్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

పంచ్ లైన్ః రెమో.. ఇది బాగానే ఉంది.

Filmjalsa Rating:3/5