బాబు బంగారం సినిమా రివ్యూఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో నుంచి సినిమా వ‌స్తుందంటే చాలు. అంద‌రిలోనూ ఆస‌క్తి. అదే వెంక‌టేష్ సినిమా అంటే, యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియ‌న్స్ వ‌ర‌కు మొత్తం ఆ సినిమా కోసం ఎదురుచూసే వాళ్లే. దీనికి తోడు భ‌లే భ‌లే మ‌గాడివోయ్ వంటి స‌క్సెస్ ని ప్రేక్ష‌కుల‌కు అందించిన మారుతి, వెంకీని ఫ‌స్ట్ టైమ్ డైర‌క్ట్ చేశాడు. అంతేకాదు, గతంలో ల‌క్ష్మి, తుల‌సి సినిమాల‌తో వెంక‌టేష్ కి అచ్చొచ్చిన హీరోయిన్ న‌య‌న‌తార‌. వీరి ముగ్గురి కాంబినేష‌న్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. టీజ‌ర్ లో బొబ్బిలి రాజా సినిమాలోని అయ్యో అయ్యో అయ్య‌య్యో అనే డైలాగ్ ను వాడేసిన మారుతి, ట్రైల‌ర్ లో ఏకంగా బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్ అని పృథ్వీతో చెప్పించాడు. మ‌రి ఈ సినిమా బొబ్బిలి రాజా అంతటి మ‌న్న‌న‌ల‌ను పొందుతుందా, ప్రేక్ష‌కుల్లో అంత‌టి ఆస‌క్తిని క‌లిగించిన ఈ సినిమా వారి అంచ‌నాల‌ను అందుకుందా, లేదా నిరాశ మిగిల్చిందా చూద్దాం.


ఏసీపీ గా చేసే వెంకటేష్ ఒక మర్డర్‌ కేసును టేకప్‌ చేస్తాడు. ఆ మర్డర్‌ కేసుకు సంబంధించిన ఒక వీడియో నయనతార తండ్రి వద్ద ఉందనే విషయం వెంక‌టేష్ కు తెలుస్తుంది. దాంతో న‌య‌న‌తార‌కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించి, నిజంగానే ఆమెను ప్రేమిస్తాడు. కొంత కాలంకు వెంక‌టేష్ తనను ఒక కేసు కోసం ప్రేమించినట్లుగా నటించాడు అని అతడి నుండి దూరంగా వెళ్లి పోతుంది. ఆ తర్వాత కృష్ణ ఆ కేసును ఎలా పరిష్కరిస్తాడు, త‌ను ప్రేమించిన అమ్మాయి ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగిలిన కథాంశం.


సినిమా మొద‌టి నుంచి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ లోనూ, టీజ‌ర్ లోనూ, ట్రైల‌ర్ లోనూ, ఇప్పుడు సినిమాలోనూ వెంకీ, న‌య‌న్ చాలా రీఫ్రెషింగ్ లుక్ తో ఆకట్టుకుంటూ వ‌చ్చారు. వీరి జంట ఎప్ప‌టిలాగే చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. విక్టరీ వెంక‌టేష్ మ‌ళ్లీ ఇంత కాలం త‌ర్వాత చాలా గ్లామ‌ర‌స్ గా క‌న‌ప‌డుతున్నాడ‌ని చెప్పొచ్చు. వెంకీ కి ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ కొట్టిన పిండి. వాటిని చాలా ఈజ్ తో పెర్ఫార్మ్ చేయ‌గ‌ల‌గ‌డం ఆయ‌న‌కే సాధ్యం. ఏసీపీ గా వెంకీ చేసిన క్యార‌క్ట‌ర్ సీరియస్ అయినా, త‌న టైపు కామెడీతో బాగా న‌వ్వించాడు. బాడీ లాంగ్వేజ్, త‌న డైలాగ్ డెలివ‌రీతో బాగా మెప్పించాడు. ఇక న‌య‌న‌తార న‌ట‌న కంటే త‌న లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే సీన్ల‌లో కెమిస్ట్రీ బాగా వ‌ర్కవుట్ అయింది. ఎమోష‌నల్ సీన్స్ తో పాటు, ల‌వ్ సీన్ల‌లోనూ అమ్మ‌డు బాగా ఆక‌ట్టుకుంది. బ‌త్తాయి బాబ్జీగా థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పృథ్వీ న‌ట‌న, త‌న కామెడీ టైమింగ్ తో ఫ‌స్టాఫ్ కు ప్రాణం పోశాడు. వెన్నెల కిషోర్ త‌న కామెడీ స్టైల్ తో ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేశాడు. పోసాని సీరియ‌స్ రోల్ లో కామెడీ చేసి, మెప్పించాడు.ఈ మ‌ధ్య సినిమాల్లో చాలా అరుదుగా క‌నిపిస్తున్న బ్ర‌హ్మానందం మ్యాజిషియ‌న్ గా మ‌ళ్లీ విసుగు పుట్టించాడు. బ్ర‌హ్మాజీ, ముర‌ళీ శ‌ర్మ‌, సంపత్, చ‌మ్మ‌క్ చంద్ర త‌మ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.


టెక్నిక‌ల్ గా బాబు బంగారం సినిమాకు మొద‌టి హైలైట్ అంటే మ్యూజిక్. పాట‌ల‌తో పాటు, రీ రికార్డింగ్ కూడా జిబ్రాన్ బాగా చేశాడు. రిచ‌ర్డ్ కెమెరా క‌న్ను బాగుంది. ముఖ్యంగా యాక్ష‌న్ స‌న్నివేశాల్లో సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఎడిటర్ త‌న క‌త్తెర‌కు కొంచెం పనిచెప్పి ఉండాల్సింది. ఎడిటింగ్ లో కొన్ని కొన్ని లోపాలున్నాయి. ఫైట్స్ బాగా కంపోజ్ చేశారు. నిర్మాణాత్మ‌క విలువ‌లు బాగున్నాయి.


డైర‌క్ట‌ర్ గురించి చెప్పాలంటే భ‌లే భ‌లే మ‌గాడివోయ్ సినిమాతో టాప్ రేంజ్ కి వెళ్లిపోయిన మారుతి, త‌ర్వాతి సినిమా వెంక‌టేష్ లాంటి స్టార్ హీరో తో అంటే అంచ‌నాలు భారీగానే ఉంటాయి. ఆ అంచనాల‌ను అందుకోవ‌డంలో మారుతి ఫెయిల్ అయ్యాడ‌నే చెప్పాలి. క‌థ లో కొత్త‌ద‌నం లేక‌పోగా, క‌థ‌నంలో కూడా ఏ మ్యాజిక్ లేకుండా, కామెడీ తోనే లాగించేశాడు మారుతి. ఫ‌స్టాఫ్ లోనే స్టోరీ మొత్తం రివీల్ చేయ‌డంతో, త‌ర్వాత సీన్ ఏంటి అనేది ఇంట్రెస్టిగ్ గా మ‌ల‌చ‌డంలో మారుతి ఫెయిల్ అయ్యాడు. ప్ర‌థ‌మార్థంలో థియేట‌ర్ లో న‌వ్వులు పూయించిన‌ప్ప‌టికీ, సెకండాఫ్ మొత్తం సీరియ‌స్ గా న‌డిపించి, బోర్ కొట్టించాడు. కానీ క్యారెక్ట‌రైజేష‌న్ లో మాత్రం మారుతి విజ‌యం సాధించాడు.


బ‌త్తాయి బాబ్జీగా పృథ్వీ నాన్న‌కు ప్రేమ‌తో కాన్సెప్ట్ తో చేసిన పేర‌డీ థియేట‌ర్ లో న‌వ్వులు పూయించింది. కాన్సెప్ట్ నీకు అర్థం కాలేదా.. అయితే సినిమా సూప‌ర్ హిట్,ఎన్ఆర్ఐ ల‌కు అర్థం అవుతుందిలే అని చెప్పే డైలాగ్ సూప‌ర్బ్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ కి కేటాయించి, సెకండాఫ్ సీరియ‌స్ గా తీసుకెళ్ల‌డంతో సినిమా కొంచెం బోర్ గా ఫీల‌వుతాం త‌ప్పితే, మిగ‌తా అన్ని విష‌యాల్లోనూ బాబు బంగార‌మే. ముఖ్యంగా క్లైమాక్స్ లో వ‌చ్చే ఫైట్ సీన్ లో బొబ్బిలి రాజా మ్యూజిక్ తో, వెంకీ ఎంట‌ర్ టైన్ చేసే సీన్ సెకండాఫ్ కు ప్రాణం పోసిందని చెప్పుకోవాలి. న‌ట‌న ఎవ‌రైనా చేస్తారు. కానీ ఇలాంటి న‌ట‌న మాత్రం కేవ‌లం వెంక‌టేష్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు అనేలా త‌నదైన శైలిలో వెంక‌టేష్ మెప్పించాడు.


చివ‌ర‌గా,
వెంక‌టేష్ నుంచి చాలా కాలం త‌ర్వాత ఒక సినిమా వ‌స్తుంద‌ని వెయిట్ చేసే ఎవ‌రైనా, ఈ సినిమా చూశాక ఇలాంటి క్యారెక్ట‌ర్ కోసం క‌దా మ‌నం ఇన్నాళ్లూ ఎదురు చూసింది అనుకునేలా అనిపిస్తుంది. స‌ర‌దాగా, వెళ్లి కుటుంబంతో చూడ‌ద‌గ్గ సినిమా బాబు బంగారం.


పంచ్ లైన్ః బాబు మేలిమి బంగారమేమీ కాదు.


Filmjalsa Rating: 3/5