ప్రేమ‌మ్ మూవీ రివ్యూ – ఫీలింగ్స్ ను ప్రేమించే ప్రేమ‌మ్నాగచైతన్య..ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో గురించి క‌నీసం రోజుకు ఒక‌సారైనా మాట్లాడ‌ని వారుండ‌రు. ఓ వైపు టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ తో ప్రేమ,పెళ్లి అనే వార్త‌లతో, మ‌రోవైపు ‘ప్రేమ‌మ్’ సినిమా. ఇలా ఎక్క‌డ పట్టినా నాగ‌చైత‌న్య నే టాక్ ఆప్ ది టాలీవుడ్ అయ్యాడు. మలయాళంలో భారీ విజయాన్ని అందుకున్న ‘ప్రేమ‌మ్’ సినిమాను తెలుగులో చందూ మొండేటి రీమేక్ చేసిన ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. మ‌ల‌యాళంలో లాగానే ముగ్గురు హీరోయిన్లు, హీరో మూడు ద‌శ‌ల‌లోని ప్రేమ ఉన్న‌ప్ప‌టికీ, క‌థ‌ను తీసుకుని ఆ సినిమాను కాపీ కొట్ట‌డ‌కుండా దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేసిన ఈ సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మంచి అనుభూతి ఉన్న ప్రేమ క‌థగా తెర‌కెక్కిన ఈ సినిమా మ‌ల‌యాళంలో లానే ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను హ‌త్తుకుంటుందా లేదా చూద్దాం.


క‌థ‌లోకి వెళితే, ఒక్క ముక్క‌లో చెప్పాలంటే, విక్ర‌మ్ అలియాస్ విక్కీ(నాగ చైతన్య) జీవితంలో కలిగే మూడు ల‌వ్ స్టోరీస్ మరియు వాటి పరిణామాల నేప‌థ్య‌మే ప్రేమ‌మ్. ఆ ముగ్గురు అమ్మాయిలు అతడి జీవితంలో ఎలాంటి మార్పులకు కారణం అయ్యారు, ఒక వ్య‌క్తికి మూడు ప్రేమ కథలు ఉండ‌టానికి కారణం ఏంటి, చివరకు విక్కీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్న ధోర‌ణిలో క‌థ సాగుతుంది.


ఒక భాష‌లో విజ‌యం సాధించిన సినిమాల‌ను తెచ్చి రీమేక్ చేయ‌డం మ‌న‌వాళ్లకు అల‌వాటే. అయితే అలా చేసిన వారిలో ఒక‌రిద్ద‌రి ప్ర‌య‌త్నం త‌ప్ప మిగ‌తా వారిది ఎక్కువ భాగం వృధానే అయింది. రీమేక్ అంటే అస‌లు సినిమాలో ఏముందో అచ్చు ఈ సినిమాలో కూడా అదే దింపేయ‌డం కాదు. ఆ ఫీలింగ్స్ , ఎమోష‌న్స్ తో పాటూ క‌థ‌ను కూడా క‌రెక్ట్ గా క్యారీ చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే వారు చేసిన ప్ర‌య‌త్నానికి ఓ ప్ర‌యోజ‌నం ఉంటుంది.ఇక్క‌డ ద‌ర్శ‌కుడు చందూ మొండేటి కూడా అదే చేశాడు. ఎక్క‌డా క‌థ‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డం కానీ, అదే సినిమాను ఇక్క‌డ చూపించ‌డం కానీ కాకుండా, కేవ‌లం ఆ క‌థ కి కొన్ని మెరుగులు దిద్ది, తెలుగు ప్రేక్ష‌కులు కోరుకునే విధంగా ప్రెజెంట్ చేశాడు. ఓ క్లాస్ సినిమాని… మాస్ ఏంగిల్ లో ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు.


10వ త‌ర‌గ‌తి చ‌దివే కుర్రాడిలా, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్(సుమ‌) తో వ‌చ్చే ల‌వ్ ట్రాక్ లో నాగ‌చైత‌న్య న‌ట‌న‌, ఆ వ‌య‌సులో ఉన్న‌ప్పుడు చేసే అల్లర్లు బాల్య జీవితాన్ని గుర్తుకుతెస్తాయి. ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ అయిపోయి, చైత‌న్య టీనేజ్ కి వ‌చ్చి కాలేజ్ లో అడుగు పెడ‌తాడో అక్క‌డి నుంచి ఇంకో ల‌వ్ ట్రాక్ మొద‌ల‌వుతుంది అని అర్థ‌మ‌వుతుంది. ఈసారి త‌న కాలేజ్ లో పాఠాలు చెప్ప‌డానికి వ‌చ్చిన సితార(శృతి హాస‌న్) అనే లెక్చ‌ర‌ర్ తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. సినిమాకు ఈ ట్రాక్ యే మేజ‌ర్ హైలైట్. ఇక చివ‌రిలో సింధు(మ‌డోన్నా) తో వ‌చ్చే ఎపిసోడ్ మాత్రం కొంచెం అన్ క‌న్విన్సింగ్ గా ఉంటుంది. శృతిహాస‌న్ కు, నాగ‌చైత‌న్య కు మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తీ సీన్ సినిమాను మ‌రో స్థాయికి తీసుకెళ్లింది. శృతి ఊరెళ్లేట‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశం ఆక‌ట్టుకుంటుంది. ”నేను ప్రేమిస్తుంది నా ఫీలింగ్స్ ని. నువ్వు దూరం అయినా నా ఫీలింగ్స్ నా ద‌గ్గ‌రే ఉంటాయ‌ని చెప్ప‌డం..”, ”శృతి త‌న గుర్తుగా ఒక బ్యాండ్ ఇవ్వ‌డం.. త‌ర్వాత శృతికి యాక్సిడెంట్ అయి జ‌రిగినదంతా మ‌ర్చిపోయిన‌ప్పుడు ఆ బ్యాండ్ ను చూపించి నేను గుర్తొచ్చానా” అని అడ‌గ‌డం లాంటి స‌న్నివేశాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి. చివ‌ర‌కు ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్లి కుద‌రడం, త‌ర్వాత ఆ అమ్మాయి గుర్తుగా ఒక రెస్టారెంట్ పెట్ట‌డం.. దానికి సితార అని త‌న పేరే పెట్ట‌డం.. త‌న‌కు కుకింగ్‌ ఇష్టమని, అతని బలమేంటో అత‌నికి తెలియ‌చేసింది ఆ అమ్మాయేన‌ని, త‌న స్ఫూర్తితోనే అతను జీవితంలో అలా స్థిరపడ్డాడని ద‌ర్శ‌కుడు చెప్పిన విధానం బాగుంది. ఫ‌స్ట్ లో నాగ‌చైత‌న్య శృతి కోసం స్వీట్ చేయ‌డం, క్లైమాక్స్ లో ఆ స్వీట్ సీన్ ను క‌నెక్ట్ చేసి, విక్కీ జీవితంలో సితార కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని చెప్ప‌డం, ఆ స్వీట్ ను చూడ‌గానే సితార కు విక్కీ ఎవ‌ర‌న్న‌ది గుర్తు రావ‌డం ఇలాంటి సీన్స్ అన్నీ సినిమాకు ప్రాణం పోశాయి.


ఇక న‌ట‌న ప‌రంగా, నాగ‌చైత‌న్య త‌న కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. స్కూల్ పిల్లాడిలా త‌న అల్లరి ప‌నులు, లవ్ లెట‌ర్ రాయ‌డం, ఆ అమ్మాయి చుట్టూ తిర‌గ‌డం.. కాలేజ్ స్టూడెంట్ లా ర‌ఫ్ లుక్స్, ఫుల్ గ‌డ్డంతో గాగుల్స్ పెట్టుకుని ఎవ్వ‌రినీ లెక్క చేయ‌ని యాటిట్యూడ్ తో, మ‌రో వైపు పేరొందిన చెఫ్ గా మూడు పాత్ర‌ల్లోనూ త‌న దైన న‌ట‌నతో మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ లో, రొమాంటిక్ సీన్స్ లో త‌న‌కు త‌నే పోటీ అనుకుని న‌టించేశాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌నదైన న‌ట‌న‌తో పాటూ , అందంతో కూడా ఆక‌ట్టుకుంది. ఇక శృతిహాస‌న్ కాలేజ్ లెక్చ‌ర‌ర్ గా, మ‌రాఠీ అమ్మాయిగా చాలా బాగా చేసింది. కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న‌ను మెచ్చుకోకుండా ఉండ‌లేం. ఇక మ‌డోన్నా సెబాస్టియ‌న్ ప‌ర్లేదు అనిపించింది. హీరో ఫ్రెండ్స్ గా ప్ర‌వీణ్, శ్రీనివాస రెడ్డి బాగా సెట్ అయ్యారు. ప్ర‌వీణ్ ఈ సినిమాతో న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కాడ‌నే చెప్పాలి. కాలేజ్ లో బ్ర‌హ్మాజీ, న‌ర్రా శ్రీను ల మ‌ధ్య వ‌చ్చే కామెడీ ట్రాక్ బాగుంది. ద‌ర్శ‌కుడు సినిమాలోని క్యారెక్ట‌ర్స్ తోనే కామెడీ చేయించాడు త‌ప్ప‌, కామెడీ కోసం కొత్త క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేయ‌లేదు. సినిమా మ‌ధ్య‌లో వెంక‌టేష్ విక్కీకి మేనమామ గా ఇచ్చిన గెస్ట్ అప్పీయ‌రెన్స్ బాగుంది. వెంక‌టేష్ ఉంది కాసేపే అయినా, విజిల్స్ ప‌డే రేంజ్ లో ఆ సీన్ పేలింది. ”డోంట్ ట్ర‌బుల్ మి విత్ ది ప్రెట్టీ ప‌ప్పీ ఇష్యూస్..” అంటూ సీరియ‌స్ గా వెంక‌టేష్ చెప్పే డైలాగ్ థియేట‌ర్లో న‌వ్వులు పూయిస్తుంది. క్లైమాక్స్ లో విక్కీ తండ్రిగా నాగార్జున గెస్ట్ రోల్ అక్కినేని అభిమానుల కోసమే అన్న‌ట్లు ఉంటుంది. సినిమా లో కూడా అక్క‌డక్క‌డా నాగ‌చైత‌న్య కు క‌నెక్ట్ అయ్యే విధంగా.. ”రేయ్ ఏంటి చైన్ తీస్తున్నావ్.. ఈ చైన్ మీద స‌ర్వ హ‌క్కులు, పేటెంట్ రైట్స్ మావి..” అంటూ నోయ‌ల్ తో అనడం, ”చిన్న‌ప్ప‌ట్నుంచి నేను ఎస్ అనే అక్ష‌రంతో మొద‌ల‌య్యే అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అని నా జాత‌కంలో ఉందంట అనే డైలాగ్..” కాలేజ్ లో ర్యాగింగ్ చేయ‌డానికి జూనియ‌ర్ ని పిలిచి ”రేయ్, నీ పేరేంట్రా అంటే అఖిల్ అని చెప్ప‌డం, వెళ్లు అయితే ఇంకేం ర్యాగింగ్ చేస్తాం” అన‌డం.. లాంటి డైలాగు లు ప్రేక్ష‌కుల‌ను హుషారెత్తిస్తాయి. మిగ‌తా పాత్ర‌ధారులు త‌మ త‌మ ప‌రిధుల్లో బాగానే చేశారు.


సినిమాటోగ్ర‌ఫీ కి సినిమాకు ఊపిరినిచ్చింది. ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో అందంగా ప్రెజెంట్ చేశారు.సినిమాకు మ్యూజిక్ డైర‌క్ట‌ర్ గోపీ సుంద‌ర్ అయిన‌ప్ప‌టికీ, మేజ‌ర్ సాంగ్స్ మొత్తం రాజేష్ కంపోజ్ చేసిన‌వే. ఆఖ‌రికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సేమ్ మ‌ల‌యాళం వెర్ష‌న్ లోదే అవ‌డంతో, సంగీతం గురించిన క్రెడిట్ అంతా రాజేష్ కే ద‌క్కుతుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువ‌ల్ చాలా బాగున్నాయి.


ప్రేమకథలకి ముగింపు ఉండొచ్చేమో కానీ.. ప్రేమ తాలూకు జ్ఞాపకాలకి మాత్రం ముగింపు ఉండ‌దు అని చెప్పే ఈ ప్రేమ క‌థను తెర‌పై చూస్తున్నంత సేపు మ‌నం చూస్తున్న‌ది కేవ‌లం విక్కీ ప్రేమ క‌థ‌నే కాదు, మ‌నంద‌రి ప్రేమ క‌థ కూడా అనిపిస్తుంది. ప్రేమ‌లో ఉన్న‌వారు కొందరు గెలుస్తారు, కొంద‌రు ఓడిపోతారు.. అస‌లు ప్రేమ‌లో ప‌డ‌ట‌మే అన్నింటికంటే కీల‌కమైన‌ద‌ని, ప్రేమ‌లో గెలిస్తే కేవ‌లం అమ్మాయి మాత్ర‌మే మ‌న ప‌క్క‌న ఉంటుంది అదే ఓడితే ఆ అమ్మాయి తాలూకు జ్ఞాప‌కాలు మ‌న‌తో ఉంటాయని చెప్ప‌డమే ఈ సినిమా సారాంశం. చివ‌ర‌గా.. ప్రేమ క‌థ‌ల‌ను ఇష్ట‌ప‌డే వారు మాత్ర‌మే కాదు.. సినిమా చూసిన ప్ర‌తీ ఒక్క‌రూ ‘ప్రేమ‌మ్’ తో ప్రేమ లో ప‌డ‌తారు. త‌మ గుండె లోతుల్లో దాగిన ప్రేమ జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెస్తుంది.


పంచ్ లైన్ః ఫీలింగ్స్ ను ప్రేమించే ప్రేమ‌మ్


Filmjalsa Rating: 3.5/5