‘నిర్మ‌లా కాన్వెంట్’ సినిమా రివ్యూటాలీవుడ్ లో కొత్త టాలెంట్ ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌డానికి ఎప్పుడూ ముందుటాడు నాగార్జున‌. త‌న సొంత బ్యాన‌ర్ ద్వారా ఇప్ప‌టికే రాజ్ త‌రుణ్ ను ఒక పొజిష‌న్ లో ఉంచిన నాగార్జున, ఇప్పుడు శ్రీకాంత్ త‌న‌యుడు రోషన్ ను ఇంట్ర‌డ్యూస్ చేశాడు. జి. నాగ‌కోటేశ్వ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో నాగార్జున కూడా ఓ కీల‌క పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే.ఓ ప‌క్క శ్రీకాంత్ కొడుకు మొద‌టి సినిమా, మ‌రో వైపు నాగార్జున ఆ సినిమాలో న‌టిస్తూ, నిర్మించ‌డంతో ఈ సినిమాపై అంచానాలు కూడా బాగానే ఉన్నాయి. మ‌రి నిర్మ‌లా కాన్వెంట్ ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం.


అన‌గ‌న‌గా భూప‌తి న‌గ‌రం, అందులో ఓ రోజు, ఆ రాజు గారి మాటే ఊరిలో శాస‌నం. కానీ త‌న‌కున్న 99 ఎక‌రాల పొలానికి సాగు నీరు వ‌చ్చే ఎగువ‌నున్న‌ ఆ ఒక్క ఎక‌రం పొలం మాత్రం ఎల్ బి శ్రీరామ్ ది. ఆ ఒక్క ఎక‌రాన్ని కూడా రాజు గారు సొంతం చేసుకోవాల‌ని అడిగితే, ఎల్ బీ శ్రీరామ్ ఆ పొలాన్ని ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌డు. దీంతో ఊరి జాత‌ర‌లో ఎల్ బి శ్రీరామ్ ను చంపేయిస్తాడు రాజుగారు. ప్రాణం పోయినా ప‌ర్లేదు కానీ, త‌న‌కు అన్నం పెట్టే భూమిని వ‌దులుకోవ‌ద్దు అని చెప్తూ , త‌న కొడుకు సూర్య ద‌గ్గ‌ర మాట తీసుకుని ప్రాణాలు వ‌దిలేస్తాడు ఎల్ బి శ్రీరామ్. ఆ సూర్య కొడుకే రోష‌న్. ఆ రాజు గారి ఒక్క‌గానొక్క మ‌న‌వ‌రాలు శ్రియ శ‌ర్మ‌.


చిన్న‌ప్ప‌టి నుంచి వీళ్లిద్ద‌రూ ఆ ఊరిలో ఉన్న ఒక్క‌గానొక్క స్కూల్ నిర్మ‌లా కాన్వెంట్ లో చ‌దువుతుందటారు. చ‌దువులో, జ‌న‌ర‌ల్ నాలెడ్జ్ లో రోష‌న్ ఫ‌స్ట‌. అల్ల‌రిలో మాత్రం శ్రియా శ‌ర్మ ఫ‌స్ట్. ఇంకేముంది మామూలు క‌థే, పెద్దింటి అమ్మాయి, పేదింటి అబ్బాయి.. ఇద్ద‌రూ ప్రేమించుకుంటారు. ఆ విష‌యం వాళ్ల నాన్న‌కు న‌చ్చ‌క‌పోవ‌డం, రోష‌న్ ను త‌న మ‌నుషుల‌తో కొట్టించ‌డంతో తీవ్ర గాయాల పాల‌వుతాడు రోష‌న్. త‌న కొడుకు ప‌రిస్థితిని అర్థం చేసుకుని, శ్రియ శ‌ర్మ ను రోష‌న్ కు ఇచ్చి పెళ్లి చేయ‌మ‌ని భూప‌తి రాజు ను అడుగుతాడు సూర్య‌.ఎప్ప‌టి నుంచో ఆ ఎక‌రం మీద క‌నున్న భూప‌తి రాజు ఆ ఎక‌రం ఇస్తే నువ్వు చెప్పింది చేస్తాన‌ని, ఆ పొలం లాక్కొని మోసం చేసి, నా స్థాయికి ఎదిగి అప్పుడు క‌నిపించు. ఆలోచిద్దాం అంటాడు. ఆ విష‌యం తెలుసుకున్న రోష‌న్ ఏం చేసి ఆ స్థాయికి వ‌స్తాడు, త‌న ప్రియురాలి ప్రేమ‌కు ఎలా ద‌గ్గ‌ర‌వుతాడు అన్న‌ది తెర పైనే చూడాలి.


హీరోగా మొద‌టి సినిమా అయిన‌ప్ప‌టికీ రోష‌న్ ఎక్క‌డా ఆ ఫీలింగ్ క‌ల‌గ‌నీయ‌కుండా ఎంతో కాన్ఫిడెంట్ గా చేశాడు. తెరపై రోష‌న్ ను చూస్తున్నంత సేపు, అరె శ్రీకాంత్ మ‌ళ్లీ చిన్నపిల్లాడిలా మారాడే అనిపిస్తుంది. పేదింటి అబ్బాయిగా త‌న పాత్ర‌లో బాగా ఇమిడిపోగ‌లిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన శ్రియా శ‌ర్మ న‌ట‌న, త‌న స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చిన్న చిన్న ఫీలింగ్స్ ను కూడా బాగా క్యారీ అయ్యేలా చూసుకుంది. నాగార్జున ఇందులో న‌టించాల్సిన అవ‌స‌రం రాలేదు. ఎందుకంటే ఈసారి నాగార్జున ఓ సెలిబ్రిటీగా త‌న ప‌ర్స‌న‌ల్ క్యారెక్ట‌రే చేశాడు. అంటే త‌ను బ‌య‌ట ఎలా ఉంటాడో సినిమాలో అంతే ఉన్నాడు. తర్వాత‌ చెప్పుకోద‌గ్గ పాత్ర‌లు అంటే రోష‌న్ కు త‌ల్లి దండ్రులు గా చేసిన పాత్ర‌లు సూర్య‌, అనితా చౌద‌రి లు.. పాత్ర‌ల్లో ఎక్క‌డా సూర్య‌,అనితా చౌద‌రి లు క‌నిపించ‌రు. డేవిడ్, మేరీలు మాత్ర‌మే క‌నిపించారు. మిగ‌తా పాత్ర‌లు ఆదిత్య మీన‌న్, స‌మీర్, ర‌విప్ర‌కాష్, ఎల్ బీ శ్రీరామ్ త‌మ త‌మ పాత్రల ప‌రిధిలో బాగా చేశారు.


సినిమా ఫ‌స్టాఫ్ అంతా కాన్వెంట్ లో రెండు క్లాస్ లు, నాలుగు గేమ్స్ గా వినోదంతో సాగిపోతుంది. ముఖ్యంగా ప్ర‌థ‌మార్థంలో హీరోయిన్ కి ప్రేమ భాష క‌నిపెడ‌దామ‌ని ప్రేమ‌ను కొత్త‌గా చెప్ప‌డం, ముద్దుల గురించి వివ‌రించ‌డం బాగుంది. ప్ర‌గ్నెంట్ లేడీ కి యాక్సిడెంట్ అయినప్పుడు వ‌చ్చే హాస్పిటల్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ‌స్టాఫ్ లో జ‌రిగిన ప్ర‌తీ చిన్న అంశాన్ని, సెకండాఫ్ లోవ‌చ్చే స‌న్నివేశాలకు క‌నెక్ట్ చేయ‌డం బాగుంది. ఇక సినిమాలో నాగార్జున వ‌చ్చాక సినిమా వేరే స్థాయికి చేరుతుంది. రోష‌న్ నాగార్జున కు ఛాలెంజ్ చేయ‌డం, నాగార్జున దానికి ఓకే అన‌డం, ఛాంపియ‌న్ ఆఫ్ ఛాంపియ‌న్ అంటూ రియాలిటీ షో ప్లాన్ చేయ‌డం, చివ‌రిలో నాగార్జున కు రోష‌న్ తండ్రి చెప్పులు తెచ్చి ఇవ్వ‌డం ఇలాంటి సీన్స్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటాయి. ఇంట‌ర్ వ‌య‌సులోనే వారికి ప్రేమ ఏంటి అనుకునే వారికి క్లైమాక్స్ లో రోష‌న్ చెప్పే ఆన్స‌ర్ క‌న్విన్సింగ్ గా ఉంటుంది.


ఫ‌స్టాఫ్ ల‌వ్ స్టోరీ అంతా మామూలే కానీ, ఎక్క‌డో ఏదో ట్విస్ట్ ఉంటుందిలే అని ప్రేక్ష‌కుడు ఆస‌క్తి క‌న‌ప‌ర‌చిన‌ప్ప‌టికీ, ఎప్పుడైతే సెకండాఫ్ మొద‌లై, నాగార్జున ద‌గ్గ‌ర‌కు స్టోరీ వెళుతుందో అప్పుడో సినిమాలో త‌ర్వాత ఏం జ‌రుగుతుంది అనేది అంద‌రికీ అర్థ‌మైపోతుంది. సినిమాలో ఒక్క ట్విస్ట్ కూడా లేకుండా, ప్రేక్ష‌కుడికి మినిమ‌మ్ ఎగ్జ‌యిట్ మెంట్ ఇవ్వ‌లేక‌పోవ‌డం సినిమాకు మైన‌స్ గానే చెప్పుకోవాలి. తాగుబోతు ర‌మేష్ తో కామెడీ చేయించాల‌ని చూసినా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ అవ‌లేదు. సినిమా ఇంకొంచెం ఎంటైర్ టైన్ మెంట్ దిశ‌గా వెళ్లుంటే బాగుండేదనిపిస్తుంది.


ద‌ర్శ‌కుడు ఇంకొంచెం డైలాగ్స్ పైన, కామెడీ పైన దృష్టి పెట్టుంటే బాగుండేది. ఫ‌స్టాఫ్ లో ప‌ల్లెటూరి అందాల‌ను ఎంతో బాగా చూపించారు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సంగీత ద‌ర్శ‌కుడు కోటి త‌న‌యుడు రోష‌న్ అందించిన పాట‌లు, రీరికార్డింగ్ బాగుంది. ఇది త‌న మొద‌టి సినిమా అంటే న‌మ్మ‌బుద్ది కానంత మంచి సంగీతాన్ని ప్రేక్ష‌కుల‌కు అందించడంతో పాటూ, కొత్త కొత్త భాష అనే పాట‌తో ఎ.ఆర్ రెహ్మాన్ కొడుకు ఎ.ఆర్ అమీన్ ను సంగీత ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన క్రెడిట్ ను కూడా కొట్టేశాడు. ఎడిటింగ్ కూడా బాగుంది. నాగార్జున తో కూడా అదే పాట‌ను పాడించి, మ‌ళ్లీ నాగార్జున లో గాయ‌కుడిని చూపించాడు. ఇక నిర్మాణ విలువ‌ల‌లో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా, ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టారు.


చివ‌ర‌గా, నిర్మ‌లా కాన్వెంట్ లో రోష‌న్, శ్రియా శ‌ర్మ మంచి న‌టులుగా పాస్ అయిపోయారు. నాగార్జున మ‌రోసారి కొత్త టాలెంట్ ను ప‌రిచ‌యం చేసే మంచి హ‌స్త‌వాసిగా నిరూపించుకున్నాడు.


పంచ్ లైన్ః కాన్వెంట్ లో కోటీశ్వ‌రుడు
filmjalsa Rating: 3/5