‘నరుడా డోనరుడా’ మూవీ రివ్యూ – విక్కీ డోనరుడే….తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడూ.. ఆదరిస్తాడనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ కొత్తదనం చూపించటంలోనే మన దర్శకులు విఫలమవుతున్నారు.

ఎప్పుడైనా ఒక కొత్త పాయింట్ తో వస్తే అది చేయటానికి మన హీరోలు, నిర్మాతలు బయపడి సేఫ్ జోన్ అయినా నాలుగు పాటలు, ఫైట్స్, కొంత కామెడీ తో నెట్టుకుంటూ పోతున్నారు.

కానీ, సుమంత్ ఇప్పటి వరకు తాను కొన్ని సేఫ్ జోన్ సినిమాలు చేసినా, ఎప్పుడూ కొత్తగా చేయటానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

అలాంటి ప్రయత్నంలో భాగంగానే బాలీవుడ్ లో హిట్టయిన ‘ విక్కీ డోనర్’ అనే హిందీ సినిమా రైట్స్ తీసుకొని, తానే స్వయంగా నిర్మాత బాధ్యతలు కూడా చేపట్టి తెలుగులో ‘నరుడా డోనరుడా’ పేరుతో రీమేక్ చేశాడు.

కానీ, ఈ సబ్జెక్ట్ తీసుకొని చాల పెద్ద సాహసమే చేసాడని చెప్పవచ్చు. ఎందుకంటే వీర్యం డొనేట్ చేయటమనే కాన్సెప్ట్, మన తెలుగు ప్రేక్షకులు ఆమోదించేలా చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. మరి అలాంటి కథని మనం ఆదరించేలా తీశాడా..? లేదా..? అన్నది తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే…

కథ విషయానికి వస్తే…

కార్గిల్ యుద్ధంలో చనిపోయిన తండ్రి, బ్యూటీ పార్లర్ నడిపిస్తూ… కుటుంబ భారం మోసే తల్లి.., ఇవన్నీ పట్టనట్టుగా తన సరదాల కోసం ఇంట్లో ఉన్న వస్తువులను కూడా అమ్మేసి తిరిగే కొడుకు విక్కీ (సుమంత్).

సంతాన ప్రాప్తిరస్తు అనే హాస్పిటల్ నడిపిస్తూ డాక్టర్ కు ( తనికెళ్ళ భరణి) వీర్యం డొనేట్ చేయటానికి సరైన మగాళ్లు దొరకక సతమతమౌతున్న తరుణంలో విక్కీ ని చూస్తాడు. వెంటపడి, వేధించి తను వీర్యదానం చేసేలా చేస్తాడు. అలా సాఫీగా సాగుతున్న విక్కీ లైఫ్ లోకి ఆషిమా(పల్లవి సుభాష్) ఎంటర్ అవుతుంది. వాళ్లిద్దరూ ఒకటవుతారు.
కానీ, వీర్యదానం వల్ల విక్కీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి… వాటిని ఎలా అధిగమించాడు అన్నది కథ.

నటీనటుల విషయానికి వస్తే…

ముఖ్యంగా తనికెళ్ళ భరణి డాక్టర్ గా మొదటి సీన్ నుండి చివరి వరకు నడిపించేది తనే, చాలా రోజుల తర్వాత భరణి తన నటనా చాతుర్యాన్ని చూపించాడనే చెప్పవచ్చు. ఇటు వీర్యదానం సైన్స్ అనే చెప్తూ.., అటు పురాణాలకు లింక్ పెట్టడం ఆ చెప్పే విధానంలో భరణి చాలా బాగా చేశాడు.
పరిస్థితులని అర్ధం చేసుకొని తన వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుతూ తను చేసిన క్లైమాక్స్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి.
ఎమోషనల్ సీన్స్ లోను మనల్ని ఏడిపించాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో పడే పడే స్పర్మ్ అంటూ విసిగిస్తాడు.

సుమంత్ తన బాడీ లాంగ్వేజ్ ను మొత్తం మార్చేసి కొత్తగా ప్రయత్నించాడు. వీర్యదానం చేయమని డాక్టర్ విసిగిస్తుంటే తను చాలా నాచురల్ గా ఒక సామాన్యుడు ఎలా బిహేవ్ చేస్తాడో.. అలాగే బిహేవ్ చేయటంలో సక్సెస్ అయ్యాడు.

సెకండాఫ్ లో వచ్చే అన్ని సీన్ లలో చాలా బాగా చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో ఆకట్టుకున్నాడు.
వీర్యం ఇచ్చే సమయంలో ఎలాంటి వల్గారిటీ ఎక్సప్రెషన్స్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు.
అయితే కొంచెం కామెడీ చేయాలనీ ప్రయత్నించినపుడు మాత్రం తడబడ్డాడు.

ఇక పల్లవి సుభాష్ నటనా పరంగా మంచి మార్కులే కొట్టేసినా, లుక్ పరంగా మాత్రం ఆకట్టుకోలేక పోయింది. పిల్లల కోసం తపించే తల్లిగా తన నటనతో ఆకట్టుకుంది హీరోకి తల్లిగా శ్రీలక్ష్మి. తదితరులు తమ పరిధిమేర బాగానే చేశారు.

దర్శకుడు: విక్కీ డోనర్ సినిమాకి మార్పులు చేశాం… అని చెప్పుకొచ్చాడు. కానీ, మార్పులు పెద్దగా చేయలేదనే చెప్పాలి. మొదటి భాగం అంతా వీర్యదానం చేయటానికి ఒప్పించే ప్రాసెస్ కొంత విసుగు తెప్పిస్తుంది. కానీ, ప్రీ ఇంటర్వెల్ నుండి కథలో ఎంటర్ అయ్యాక ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సెకండాఫ్ మాత్రం పూర్తి కథ మీద పట్టుతో సాగుతూ.. క్లైమాక్స్ వరకు ఒకే ఫీల్ క్యారీ అయ్యేలా విజయవంతం అయ్యాడు దర్శకుడు.

మధ్యలో కొంచెం లాగ్ చేసిన చివర్లో చిన్న పిల్లల సీన్ లలో ప్రేక్షకులని కట్టిపడేసాడు. ప్రతిసారి విత్తనాలు, విత్తనాలు అంటూ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు దర్శకుడు.

గుర్తుండి పాటలు ఇవ్వకున్నా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చి పేలవమైన సీన్ లకు కూడా ప్రాణం పోశాడు సంగీత దర్శకుడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది.

ఫోటోగ్రఫీ పర్వాలేదు, రచయిత ప్రాసలకోసం బాగానే పాకులాడాడు.
నిర్మాత లిమిటెడ్ బడ్జెట్ లో తీశాడన్నది తెలియకుండా బాగా జాగ్రత్త పడ్డాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

చివరగా వీర్యం గురించి మాట్లాడటానికి సిగ్గుపడే మన కల్చర్ లో, వీర్యదానం అనే కాన్సెప్ట్ తో సినిమా తీసి మెప్పించటం అనేది ఇక్కడ ప్రధానాంశం.
సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్న ఈరోజుల్లో, ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు.

హిందీలో తీసిన ‘విక్కీ డోనర్’ సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ అయింది. కానీ, ఈ సినిమా వీర్యదానం అనే కాన్సెప్ట్ ముందు నుండే ప్రచారం చేశారు. ఫ్యామిలీస్ రావటం అనేది ఓకింత ఇబ్బందికరమైన విషయం.
కానీ, ఇలాంటి కొత్త ప్రయత్నం చేసిన టీమ్ ని అభినందించాల్సిందే….
అయితే ఈ ప్రయత్నంతో నిర్మాత గట్టెక్కితే.. మరిన్ని ప్రయోగాత్మక సినిమాలు రావచ్చు.

కొసమెరుపు: మొదట్లో నాగార్జున, చివర్లో నాగ చైతన్య కనపడి ఫాన్స్ కు పండగ తెచ్చారు.

పంచ్ లైన్: విక్కీ డోనరుడే….

2.5/5