నేను లోక‌ల్ మూవీ రివ్యూకెరీర్ లో వరస విజయాలతో దూసుకొని పోతున్న నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిన చిత్రం ‘నేను లోకల్’ . త్రినాథ‌రావు దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య ఇవాళే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ చిత్రంతో నాని మరో డీసెంట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడా ? లేక ఈ సినిమా నాని విజయాల పరంపర కి బ్రేక్ వేసిందా అన్న విషయం తెలియాలంటే ఈ రివ్యూ వాచ్ చేయాల్సిందే .

కథ‌..

ముందుగా ఈ సినిమా కధ విషయానికి వస్తే. డిగ్రీ పూర్తి చేసిన బాబు. లైఫ్ లో ఎలాంటి ఆశయాలు లేకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. బాధ్యతలేవీలేని బాబు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో కీర్తి(కీర్తి సురేష్)తో లవ్ లో పడతాడు. అయితే, బాబు తన లవ్ ని సక్సెస్ చేయించుకునే ప్రాసెస్ లో కీర్తిని కాస్త ఇబ్బంది పెట్టినా, మొత్తానికి బాబుతో లవ్ లో పడుతుంది కీర్తి. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కీర్తి ప్రేమ విషయంలో బాబు, కీర్తి తండ్రితో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది . మరి ఆ ఛాలెంజ్ లో బాబు గెలిచాడా ? కీర్తి ప్రేమని దక్కించుకున్నాడా ? అసలు ఈ లవ్ జర్నీలో బాబు ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి అన్నదే మిగిలిన కధ.

నటీ నటుల పనితీరు..

ఇప్పటి వరకు తన న్యాచురల్ యాక్షన్ తో అన్నివ‌ర్గాల‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన నాని, ఈ సినిమాలో ఇంత‌కుముందులా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌. దర్శకుడు కథ‌ని ముందుకి తీసుకెళ్లే భారం నాని పాత్ర పై వేసి, ఆ పాత్రని తెరకెక్కించే విధానంలో పూర్తిగా యూత్ ని టార్గెట్ చేయడంతో, నాని యాక్షన్ అన్ని వర్గాల ప్రేక్షకులకి రీచ్ అవ్వకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే నాని కామెడీ టైమింగ్ మాత్రం ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు. ఇక లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కీర్తి సురేష్ ఫుల్ మార్క్స్ కొట్టేసింది. వ‌న్ ప్ల‌స్ వ‌న్ ఆఫ‌ర్ అంటూ త‌ళుకున్న మెరిసిన వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. నెగిటివ్ షేడ్ లో న‌వీన్ చంద్ర మెప్పించాడు. ఇక సచిన్ ఖేదేకర్, పోసాని కృష్ణమురళి, ఈశ్వరి రావు నటన సినిమాకు కీలకంకాగా, మిగతా నటీనటులంతా వాళ్ల పరిధి మేరకు మెప్పించారు.

సాంకేతిక వర్గం..

ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు..చెప్పాల‌నుకున్న పాయింట్ పాతదే అయినా కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేయలేదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సేఫ్ గేమ్ ఆడేశాడు. అయితే ఆ గేమ్ లో అంతే సేఫ్ గా గట్టెక్కాడు అని చెప్పుకోవచ్చు. బాబు పాత్ర‌ చుట్టూ ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో సినిమాను ముడిపెట్టిన తీరు చూస్తే ద‌ర్శ‌కుడిని అభినందించ‌క త‌ప్ప‌దు. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు చాలా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేదు. నిజార్ ష‌ఫీ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సాయికృష్ణ‌, ప్ర‌స‌న్న‌కుమార్‌లు ర‌చ‌న సినిమాకు అద‌న‌పు బ‌లాన్ని ఇచ్చింది. డైలాగ్స్ పరంగా రైటర్స్ పూర్తి న్యాయం చేశారు అని చెప్పుకోవచ్చు . ఎడిటింగ్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువలకు ఎక్క‌డా వంక పెట్ట‌డానికి వీల్లేదు.

ప్లస్ పాయింట్స్ :

నాని కామెడీ టైమింగ్

కీర్తి సురేష్ అందం, అభినయం

కామెడీ

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ః

పాత కధ

రొటీన్ స్క్రీన్ ప్లే

దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్

చివరగా..

ఇప్పుడు వస్తున్న యువ దర్శకులు సేఫ్ గేమ్ ఆడి, నామ మాత్రం సక్సస్ అయ్యాము అనిపించుకోవడానికి ముందే సిద్ధం అయిపోతున్నారు . అలా పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో వచ్చి ఓకే అనిపించుకోగల రీతిలో ఉన్న చిత్రమే నేను లోకల్ . అయితే ఇలాంటి చిత్రాల వల్ల నిర్మాతలకి డబ్బులు వస్తాయి ఏమో కానీ , దర్శకుడి సృజనాత్మకత మాత్రం ఏ మాత్రం బయట పడదు.

పంచ్ లైన్ ..

నాని సినిమాకి వెళ్తున్నాం అని కాకుండా , రాజ్ తరుణ్ సినిమాకి వెళ్తున్నాం అని ఫిక్స్ అయి వెళ్తే , సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ : 3/5