ధృవ సినిమా రివ్యూ, రేటింగ్చాలా కాలంగా స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఈ సారైనా విజ‌యం దిశ‌గా దూసుకుపోవాల‌ని త‌మిళంలో పెద్ద హిట్ అయిన త‌ని ఒరువ‌న్ సినిమాను ధృవ గా రీమేక్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. హీరోల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ స్టైల్ లో ప్రెజెంట్ చేసే డైర‌క్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డికి దర్శ‌క‌త్వ బాధ్య‌త‌ను అప్పగించారు. టైటిల్ లోగోతోనే ఆకట్టుకున్న ఈ సినిమా పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. మ‌రి ఈ సారైనా చెర్రీ ఆ అంచ‌నాల‌ను అందుకున్నాడా లేదా చూద్దాం.

ధృవ(రామ్చరణ్).. దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్‌ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు.

అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ… సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

సినిమాలో మొద‌టిగా చెప్పుకోవాల్సింది రామ్ చ‌ర‌ణ్ క‌ష్టం గురించి. సినిమా కోసం త‌ను ప‌డిన త‌ప‌న ప్ర‌తీ సీన్ లోనూ క‌నిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్ ద‌గ్గ‌ర నుంచి, డ్యాన్స్ ల వ‌ర‌కు ప్ర‌తీ దాంట్లో రామ్ చ‌ర‌ణ్ మెరుగైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ గా రామ్ చ‌ర‌ణ్ ప‌ర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ర‌కుల్ ప్రీత్ కేవ‌లం త‌న గ్లామ‌ర్ కు మాత్ర‌మే కాకుండా క‌థ‌లో కూడా భాగ‌మ‌వ‌డంతో, త‌న న‌ట‌న బాగుంది.అంతేకాదు,ర‌కుల్ బోల్డ్ బ్యూటీగా క‌నిపించ‌డం కూడా సినిమాకు ప్ల‌స్. ఇక అర‌వింద స్వామి న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పుకోవాల్సిందేమీ లేదు. త‌న న‌ట‌న‌తో క‌ట్టిపడేశాడు.అటు సైంటిస్ట్ గానూ, ఇటు బిజినెస్ మ్యాన్ గానూ, తండ్రి ద‌గ్గ‌ర వ‌చ్చే ఎమోష‌న‌ల్ సీన్స్ లోనూ త‌న న‌ట‌న సూప‌ర్బ్. న‌వ‌దీప్ కు కెరీర్ లో మంచి పాజిటివ్ రోల్ వ‌చ్చింది.
సినిమాకు మేజ‌ర్ హైలైట్ స్క్రీన్ ప్లే. త‌ర్వాత ఏం జ‌రుగుతుంది త‌ర్వాత ఏం జ‌రుగుతుంది అన్న ఆస‌క్తిని స‌ర్వ‌త్రా రేకెత్తించాడు ద‌ర్శ‌కుడు. చిన్న చిన్న విల‌న్ల తో పెట్టుకుంటే ఏముంది, వీళ్లందరికీ బాస్ అయిన వ్య‌క్తితోనే త‌న పోరాటాన్ని మొద‌లుపెట్ట‌డం, వాళ్లిద్ద‌రి మ‌ధ్య మైండ్ గేమ్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ను క‌లిగిస్తుంది. విల‌న్- హీరోల మ‌ధ్య సాగే కోల్డ్ వార్ సినిమాకే హైలైట్. ఆ స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన విధానం కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. కానీ సెకండాఫ్ చాలా నెమ్మ‌దిగా అనిపిస్తుంది. రెండున్న‌ర గంటల ర‌న్ టైమ్ కూడా సినిమాకు కొంచెం మైన‌స్. వెంక‌టేష్ లాంటి సీనియర్ హీరోలు సైతం కామెడీని నమ్ముకుంటున్న ఈ రోజుల్లో ఈ సినిమాలో కామెడీ లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులు నిరుత్సాహ ప‌డ‌తారు. దానికితోడు రామ్ చ‌ర‌ణ్ సినిమా అంటేనే ప్రేక్ష‌కులు ఆశించేది డ్యాన్సులు. కానీ ధృవ‌లో ప్రేక్ష‌కులు ఆశించిన స్థాయిలో రామ్ చ‌ర‌ణ్ డ్యాన్సులు ఉండవు.

వేరే భాష‌లో హిట్ అయిన సినిమాను తీసుకొచ్చి రీమేక్ చేయ‌డం అంత తేలిక కాదు. ప్ర‌తీ సీన్ నూ దాని మాతృక‌తో పోలుస్తారు. అలాంటి రిస్క్ ఉంద‌ని తెలిసి కూడా ఈ బాధ్య‌త‌ను తీసుకోవ‌డంలో సురేంద‌ర్ రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. అదే క‌థ‌ను మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో తెర‌కెక్కించి చాలా స్టైలిష్ గా మూవీ ని ప్లాన్ చేశాడు. మేకింగ్ ప‌రంగానూ త‌న మార్క్ ను మ‌రోసారి చాటుకున్నాడు. పీ.ఎస్ వినోద్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా చూపించాడు. ముఖ్యంగా పాట‌ల‌ను చాలా బాగా చిత్రీక‌రించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా విజువ‌ల్స్ ఉన్నాయి. హిపాప్ థ‌మిజా అందించిన పాట‌లు బాగానే ఉన్నాయ‌నిపించినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో మాత్రం మ్యాజిక్ చేశాడు. ఎడిటింగ్ చాలా బాగుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువ‌లు వారి సంస్థ‌ను మ‌రో రేంజ్ కు తీసుకెళ్లాయి.

చివ‌ర‌గా, ఏ రీమేక్ అయినా, ఒరిజినల్ ను పోలి ఉండ‌టం కామ‌న్. ధృవ విష‌యంలోనూ అదే జ‌రిగింది. గ్రిప్పింగ్ ఫ‌స్టాఫ్, సెకండాఫ్ స్లో క‌థ‌నం, సామాన్య ప్రేక్ష‌కుల‌కు అంతగా అంద‌ని లాజిక్స్ తో కూడాని ఈ ధృవ ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌క న‌చ్చుతుంది.

పంచ్ లైన్ః స్టామినా బాగానే చూపించాడుగా..

Filmjalsa Rating: 3.25/5