తిక్క మూవీ రివ్యూమెగా కాంపౌండ్ లో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ వ‌రుస హిట్లు అందుకుంటున్నాడు సాయి ధర‌మ్ తేజ్. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు ఈ సుప్రీమ్ హీరో. అయితే మ‌ధ్యలో రిలీజ్ చేసిన త‌న పాత చిత్రం రేయ్ త‌న హ్యాట్రిక్ కు గండి కొట్టింది. ఇప్పుడు త‌న తిక్క చూపించడానికి ఓం అనే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సునీల్ రెడ్డితో జ‌త‌క‌ట్టాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. మ‌రి త‌న తిక్క సినిమాతో ఎలా చూపించాడో చూద్దాం.


ఎప్పుడూ, అమ్మాయిల‌తో, ప‌బ్ ల‌లో త‌న లైఫ్ ను జ‌ల్సా చేసే అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమలో ప‌డి, త‌న ప్రేమ‌ను ఎలా గెలుచుకున్నాడు, త‌నను ఆ అమ్మాయి ఎలా మార్చుకుంది అనేదే కథ‌.


ఓం వంటి గొప్ప‌ సినిమాను చూశాక కూడా, సాయి ధ‌ర‌మ్ తేజ్ సునీల్ రెడ్డికి మ‌ళ్లీ అవ‌కాశం ఎలా ఇచ్చాడో త‌నకే తెలియాలి. కొత్త క‌థా అంటే కాదు, పోనీ క‌థ‌నంలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా మ‌లిచాడా అంటే అదీ లేదు. అస‌లు సినిమా ఎక్క‌డ మొద‌లై.. ఎక్క‌డో అయిపోయిందో ఒక క్లారిటీ కూడా లేదు. క‌థ లో ఆస‌క్తి లేన‌ప్పుడు ఎంత మంది టెక్నిషీయ‌న్స్ క‌ష్ట‌ప‌డి ఏం లాభం.. అంతా వృథానే. కానీ సాయి ను మాత్రం న్యూ లుక్ తో చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. సాయి వంటి మ‌ల్టీ టాలెంటెడ్ హీరో త‌న‌కు డేట్స్ ఇచ్చాడంటే, సునీల్ చేసిన గొప్ప ప్ర‌య‌త్న‌మే ఈ తిక్క‌.


మొద‌టి నుంచి ఈ సినిమా కు త‌మ‌న్ ప‌డిన త‌ప‌న అంతా ఇంతా కాదు. త‌మిళం నుంచి ధ‌నుష్‌, శింబు ల‌ను క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకుని వ‌చ్చి మ‌రీ, వాళ్ల‌తో పాట‌లు పాడించడం, నీర‌జ కోన తో లిరిక్స్ రాయించ‌డం.. ఇలా ఒక‌టేంటి, ప్ర‌తీ దాంట్లో త‌మ‌న్ బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ ఫ‌లితం మాత్రం లేక‌పోయింది. సినిమా బాగుంటేనే పాట‌లు బాగున్నాయి అనే ఈ రోజుల్లో త‌మ‌న్ క‌ష్టం వృథా అయింద‌నే చెప్పాలి. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు గురించి చెప్పాలంటే, సాయి కెరీర్ లో హయ్య‌స్ట్ బ‌డ్జెట్ తో నిర్మించిన సినిమా అని చెప్పుకోవాలి. ఎక్క‌డా ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా, సాయి మార్కెట్ కంటే ఎక్కువ బ‌డ్జెట్ తోనే నిర్మించారు.


నటీన‌టుల గురించి చెప్పాలంటే, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. కాస్త‌లో కాస్త అయినా చెప్పాలంటే సాయి నే సినిమాకు ప్ల‌స్. సినిమాలో ఎవ‌రో హీరోయిన్స్ ఉండాలి క‌దా అంటే ఉన్నారు అన్న‌ట్లు ల‌రిస్సా, మ‌న్నారా ల‌ను పెట్టారు. పోనీ వాళ్ల క్యారెక్ట‌రైజేష‌న్ ఏమైనా గొప్ప‌గా ఉందా అంటే అదీ లేదు. మ‌న్నారా చోప్రా అయితే ఇరిటేటింగ్. ప్ర‌సాద్ తాగుబోతుగా, బాగా చేసిన‌ప్ప‌టికీ త‌న క్యారెక్ట‌రైజేష‌న్ విసుగు పుట్టిస్తుంది. సెకండాఫ్ లో స‌త్య‌,అలీ చేసిన కామెడీ థియేటర్ల‌లో అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయించాయి. పాత్ర‌లు కూడా వాళ్ల వాళ్ల పాత్ర‌ల పరిధిలో న‌టించారు. అస‌లు ఎంత మంది ఏం చేస్తే ఏం ప్ర‌యోజనం, ఇలాంటి సినిమాల‌కు.


చివ‌ర‌గా, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ వంటి సినిమాల‌తో విజ‌యాలను అందుకున్న సాయి, ఈ సినిమాతో త‌న తిక్క చూపించి, హ్యాట్రిక్ కొడ‌దామ‌నుకున్న‌ప్ప‌టికీ, చివ‌ర‌కు తిక్క నే మిగిలింది.


పంచ్ లైన్ః ప్రేక్ష‌కుల‌కు తిక్క తిక్క‌గానే ఉంటుంది.


Filmjalsa Rating: 1.75/5