జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా.. సినిమా రివ్యూ, రేటింగ్హాస్య నటుడిగా తనదైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి గీతాంజలి చిత్రంతో  మొదట్లోనే హీరోగా మెప్పించాడు. ఆ విజయం ఇచ్చిన ఊపుతో అంతే స్పీడ్ తో ”జ‌య‌మ్ము నిశ్చ‌యమ్మురా..” అంటూ.. మ‌రో సారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైల‌ర్ ల‌తోనే సినిమాపై ఆస‌క్తి రేకెత్తించిన ఈ సినిమాను శివ‌రాజ్ క‌నుమూరి తెర‌కెక్కించ‌గా, పూర్ణ శ్రీనివాస్ రెడ్డికి జోడీ క‌ట్టింది. రిలీజ్‌కు రెండు రోజుల ముందే సినిమాపై ఉన్న గ‌ట్టి న‌మ్మ‌కంతో సినిమా యూనిట్ ప్రీమియ‌ర్ షో వేసింది. మరి సినిమాపై వారు పెట్టుకున్న నమ్మకం నిజమైందా ? ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఎంత వ‌ర‌కు అల‌రించిందో చూద్దాం. 
 
 
జాత‌కాల‌ను బాగా న‌మ్మే స‌ర్వ‌మంగ‌ళం (శ్రీనివాస్ రెడ్డి) కు త్వ‌ర‌లోనే ఉద్యోగం వ‌స్తుంద‌ని చెబుతాడు ఓ స్వామీజీ (జీవా). త‌న మీద త‌న‌కు ఆత్మ‌విశ్వాసం మ‌రీ త‌క్కువ‌గా ఉండ‌టంతో ప్ర‌తీ విష‌యంలోనూ ఆ స్వామీజీ పైనే ఆధార‌ప‌డ‌తాడు. త‌నకు ఉద్యోగం వ‌చ్చిన త‌ర్వాత కూడా, త‌ల్లి ఒక్క‌టే ఉంటుంద‌ని, ఉద్యోగంలో చేరిన వెంట‌నే ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకుని త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోదామ‌నుకుంటాడు స‌ర్వ మంగళం. అక్క‌డి నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకోడానికి సర్వ మంగ‌ళం పడిన పాట్లు ఏంటి? అస‌లు రాణి(పూర్ణ‌) ఎవ‌రు? ఆమెకు, స‌ర్వ మంగ‌ళంకు సంబంధం ఏంటి? చివ‌ర‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకుని త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు చేరాడా? అనేదే క‌థ‌. 
 
 శ్రీనివాస్ రెడ్డి సినిమాను త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడు. సినిమా మొత్తంలో ఒక్క‌సారి కూడా శ్రీనివాస్ రెడ్డి క‌నిపించ‌డు. స‌ర్వ‌మంగ‌ళం పాత్రే క‌నిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పాత్ర‌కు ప్రాణం పోశాడ‌నే చెప్పాలి. అటు త‌ల్లి కోసం తాప‌త్ర‌యం ప‌డే కొడుకుగా, ఇటు త‌ను ప్రేమించే అమ్మాయి ప్రేమ కోసం ప‌రిత‌పించే ప్రియుడిగా మంచి న‌ట‌నను క‌న‌బ‌రిచాడు. ముఖ్యంగా కొన్ని కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ లో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టాడు. పూర్ణ నేచుర‌ల్ గా,త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. త‌న పాత్ర‌కు అంత‌గా న‌టించే స్కోప్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఉన్నంత‌లో బాగానే మెప్పించింది. ఇక సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కృష్ణ భ‌గవాన్ గురించి. చాలా సినిమాల త‌ర్వాత మంచి పాత్ర దొరికింది. సెకండాఫ్ లో కృష్ణ భ‌గ‌వాన్ కామెడీకి పొట్ట చెక్క‌ల‌వ్వాల్సిందే.  పోసాని , ప్రవీణ్ ల‌ కామెడీ  కూడా ఈ సినిమాకు ప్ల‌స్.  మిగ‌తా వారిలో రవివర్మ,జీవా,కృష్ణుడు,ప్రభాస్ శీను,రఘు కారుమంచి లు త‌మ త‌మ ప‌రిధిలో ఫ‌ర్వాలేద‌నిపించారు. 
 
డైర‌క్ట‌ర్ శివ‌రాజ్ క‌నుమూరికి ఇది మొద‌టి సినిమా అయినప్ప‌టికీ, కంటెంట్ విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు తీసుకున్నాడు. ఇంత మంచి కంటెంట్ ఉన్న‌ప్పుడు, క‌థ‌నం విష‌యంలో ఇంకాస్త‌ జాగ్ర‌త్త‌గా వ్యవ‌హ‌రించాల్సింది. కానీ ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంచెం త‌డ‌బ‌డ్డాడు. సినిమా ఫ‌స్టాఫ్ అంతా ఏదో క‌థ జ‌రుగుతుంది అంటే జ‌రుగుతుంది అన్న‌ట్లు ఉంటుంది త‌ప్ప ఎక్క‌డా ఆస‌క్తిగా అనిపించ‌దు. కానీ సెకండాఫ్ విషయంలో మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేసి, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేయ‌గ‌లిగాడు. అయితే రొటీన్ క్లైమాక్స్ తో ప్రేక్ష‌కులు కొంచెం నిరుత్సాహ ప‌డ‌తారు. సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు మేజ‌ర్ హైలైట్. ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణాన్ని త‌న కెమెరా క‌న్నుతో న‌గేష్ బెన్నెల్ మ‌రింత అందంగా చూపించాడు. ప్ర‌తీ ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంది. చిన్న చిన్న సినిమాల‌కు సంగీతం చెప్పుకునే స్థాయిలో ఉండ‌దు. కానీ ఈ చిత్రం విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. అటు పాట‌ల‌తో పాటూ, ఇటు నేప‌థ్య సంగీతం కూడా  సినిమా ఫీలింగ్ ను ఎక్క‌డా పోనీయ‌కుండా బాగుంది. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకొంచెం ప‌ని చెప్పాల్సింది. కొన్ని అన‌వ‌స‌ర సీన్స్ ను తీసేస్తే సినిమా నిడివి త‌గ్గి, ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఆక‌ట్టుకునేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. 
 
చివ‌రగా,
త‌నలో ఉన్న పూర్తి స్థాయి న‌టుడిని ప‌రిచ‌యం చేసిన శ్రీనివాస్ రెడ్డి చేసిన ఈ ప్ర‌య‌త్నం ఖ‌చ్చితంగా జ‌యం క‌లిగిస్తుంద‌నే చెప్పొచ్చు. ప్ర‌తీ పాత్ర సాధార‌ణంగా ఉండ‌టం, కృష్ణ భ‌గ‌వాన్ కామెడీ ఇవ‌న్నీ సినిమాను ముందుకు న‌డిపిస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.సినిమా ర‌న్ టైమ్ విష‌యంలో కొంచెం ఇబ్బంది ప‌డ‌కుండా ఉంటే సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు. 

 

పంచ్ లైన్ః జ‌య‌మ్ము త‌ధ్య‌మురా..

Filmjalsa Rating:3/5